రాజకీయ నాయకులంటేనే ప్రజలు ఏవగించుకుంటున్న ఈ రోజుల్లో… జనం ఈసడించుకునే స్థాయిలో రాజకీయ నాయకుడు పతనమైన స్థితిలో… కొందరి గురించి చెప్పుకోవాలి, ఎప్పుడైనా ఓసారి స్మరించాలి… అది జాతి కనీసధర్మం, ఇప్పటి ప్రతి నాయకుడు సిగ్గుపడాలి… అలాంటి నాయకుల్లో బిజూ పట్నాయక్ ఒకరు… అవును, ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి… అసలు కొడుకే ఆదర్శ నాయకుడు అంటే, తండ్రి అంతకుమించిన లెజెండ్… (వ్యక్తిత్వం, నడత అనే కోణంలో వర్తమాన రాజకీయ నాయకుల్లో నవీన్ పట్నాయక్‌కు మిగతావాళ్లు కొన్ని మైళ్ల దూరంలో ఆగిపోయి ఉంటారు)… బిజూ పట్నాయక్ గురించి అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని పోస్టులు కనిపిస్తున్నయ్… ఒడిశాతో సంబంధమున్నవాళ్లకూ తెలియని సంగతులున్నయ్… ఒకసారి మనం గర్వంగా కాలరెగరేసే ముచ్చట్లున్నయ్… వికీపీడియాకు వెళ్తే కొంత డిఫరెంట్ సమాచారం కనిపిస్తుంది… కానీ సోషల్ మీడియాలో మిత్రుడు Sambashiva Kodati వాల్ మీద కనిపిస్తున్న ఆ ఇంగ్లిష్ పోస్టునే తెలుగులోకి అనువదించుకుందాం…
ఒక నాయకుడు మరణిస్తే సాధారణంగా ఏం చేస్తారు..? తన స్థాయిని బట్టి వీలయితే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసే సందర్భంలో జాతీయ పతాకాన్ని కప్పుతారు… తుపాకులు గాలిలోకి పేల్చి గౌరవవందనం సమర్పిస్తారు… అది జాతి సమర్పించే అత్యున్నత గౌరవం… కానీ మూడు దేశాల జాతీయ పతాకాలను కప్పుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించాడు బిజూ పట్నాయక్… అత్యంత అరుదైన విశేషం… రష్యా, ఇండియా, ఇండొనేషియా పతాకాలు అవి… ఇండియా సరే, మరి రష్యా, ఇండొనేషియా పతాకాల మాటేమిటి..? అదే చెప్పుకోవాలి…
Ads
తను పుట్టింది 1916, కటక్‌లో… పైలట్ శిక్షణ పొందాడు… అప్పట్లో కళింగ ఎయిర్‌లైన్స్ పేరిట ఓ ప్రైవేటు విమానం కలిగి ఉండేవాడని అంటారు… రెండో ప్రపంచ యుద్ధకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు… సోవియట్ యూనియన్ తరఫున హిట్లర్ బలగాల మీద తన డకోటా విమానం నుంచి బాంబింగ్ చేశాడు… దాంట్లో హిట్లర్ సేనలకు తీవ్ర నష్టం వాటిల్లింది… సోవియెట్ తనకు గౌరవ పౌరసత్వం ఇవ్వడంతోపాటు అత్యున్నత పౌర పురస్కారం కూడా ప్రదానం చేసింది… ఇది ఒక అధ్యాయం… సాయుధ గిరిజన తిరుగుబాటుదార్లు కాశ్మీర్‌పై దాడి చేసినప్పుడు, నెహ్రూ కోరిక మేరకు ధైర్యంగా విమానంలో వెళ్లి, శ్రీనగర్‌లో అడుగుపెట్టాడు… ఆ తరువాత పలు ట్రిప్పులు వేసి మన సైనికులను శ్రీనగర్‌లో దింపాడు… ఇదొక అధ్యాయం…
ఇండొనేషియాకు అందించిన సేవలు మరీ విశేషం… అప్పట్లో ఆ దేశంలోని చాలా భాగం డచ్ ఆధీనంలో ఉండేది… డచ్ సైన్యం ఇండొనేషియా చుట్టూ మొహరించి, ఆ దేశ పౌరుల కదలికల్ని నియంత్రించేవాళ్లు… 1945లో విముక్తి పొందినట్టే పొందింది, కానీ తిరిగి 1947లో డచ్ బలగాలు ప్రధాని సూతన్ జాహిర్‌ను అరెస్టు చేశాయి… ఇండొనేషియా ఇండియా సాయం కోరింది… నెహ్రూ మరోసారి బిజూ పట్నాయక్‌కు ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం కాల్ చేశాడు… బిజూ పట్నాయక్, ఆయన భార్య జ్ఞాన్ పట్నాయక్ అదే డకోటా విమానంలో వెళ్లారు… ఆ దేశంలో దిగి, ఆ ప్రధానిని రక్షించి సింగపూర్ మీదుగా సురక్షితంగా తీసుకొచ్చారు…
తరువాత ఇండొనేషియా బలగాలు బలం పుంజుకుని డచ్ సైనికులను తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని పొందాయి… బిజూకు ఆ దేశపౌరసత్వంతోపాటు భూమిపుత్ర అనే ఆ దేశ ఉన్నత పురస్కారాన్ని, తరువాత కొన్నేళ్లకు మరో అత్యున్నత పురస్కారం Bintang Jasa Utma కూడా ఇచ్చారు… ప్రెసిడెంట్ సుకర్ణో బిడ్డకు మేఘావతి అనే పేరుపెట్టింది కూడా బిజూ దంపతులే… ఆమె తరువాత ఇండొనేషియా తొలి మహిళా అధ్యక్షురాలైంది… బిజూ మరణించినప్పుడు ఆ దేశం వారం రోజుల సంతాపాన్ని పాటించింది, రష్యా ఒకరోజు సంతాపదినంగా పాటించింది… ఆ దేశాల్లో జాతీయ పతాకాల్ని అవనతం చేశారు… ఇప్పటికీ మన దేశంలోని ఇండొనేషియా ఎంబసీలో ఓ గది బిజూ పేరిటే ఉంటుంది… మరి ఇలాంటి నాయకుడి గురించి మన పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ మనకేమైనా బోధించాయా..? ఒక్కసారి ఆలోచించండి… What a great leader… నిజంగా మీ గురించిన ఈ చరిత్ర మాలో ఎవరికీ ఇంత సమగ్రంగా తెలియదు… మమ్మల్ని క్షమించండి…!!
Share this Article