కొన్ని అద్భుతాలు అంతే..! ఆ అద్భుతాల వెనుక అంతులేని మానవప్రేమ… గాఢమైన అనుబంధం… సాహసం…! యాదృచ్ఛికమో, దైవసంకల్పమో, మానవప్రయాసో, కాకతాళీయమో… కొన్ని నమ్మలేని అద్భుతాలు వినిపిస్తయ్, కనిపిస్తయ్, నిబిడాశ్చర్యంలో ముంచేస్తయ్… ఇదీ అంతే… అప్పట్లో చాలా ఏళ్ల క్రితం తెలుగులో పాపులర్ నవల పాఠకుల్ని ఉర్రూతలూగిస్తున్న కాలం అది… యండమూరి వీరేంద్రనాథ్ ఓ వీక్లీలో ప్రార్థన అనే సీరియల్ రాస్తుండేవాడు… (ఏదో ఇంగ్లిష్ నవల నుంచి ఆ ప్రార్థన నవల ఇతివృత్తం తీసుకున్నట్టు రచయిత కూడా ఆమధ్య అంగీకరించాడు, అది వేరే కథ…) అందులో ఓ తండ్రి, కేన్సర్ బారిన పడ్డ తన కూతురి కోసం కేన్సర్ మందు కనిపెడతాడు, దానికోసం పరిశోధన, అడ్డుకునే శక్తులు, తండ్రి ప్రేమతో తను సాగించిన పోరాటం అద్భుతంగా పండాయి… కథ, కథనం వోకే కానీ అనుకోకుండా ఓ బుల్లెట్ తగిలి, కేన్సర్ మందు రూపుదిద్దుకుంటుంది… అప్పట్లో కొందరు నవ్వారు, యండమూరికి ఏమైంది అన్నారు… ఈ కథ కూడా అలాంటిదే… అంతకుమించింది… మాటల్లో చెప్పలేనిది…
ఇది బీజింగ్ వార్త… జూవీయ్ ఓ సాదాసీదా ఉద్యోగి… హైస్కూల్ చదువు కూడా దాటలేదు… తనకు రెండేళ్ల కొడుకు… పేరు హవోయంగ్… ఓ అరుదైన వ్యాధి ఉంది ఆ పిల్లాడికి… లక్ష మందిలో ఒకరికి ఉంటుంది… కాపర్ తగినంత లేకపోవడంతో వచ్చే మెంకెస్ సిండ్రోమ్… ఔషధాలు వాడాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి… ఆ ఔషధాలేమో దొరకడం లేదు, దేశం మొత్తమ్మీద ఎక్కడ దొరుకుతాయో నెట్ అంతా గాలించాడు… ఫలితం లేదు… కొడుకును చూస్తుంటే పట్టలేని దుఖం… ఏమీ చేయలేని దైన్యం… బయటి దేశాలకు తీసుకెళ్దామంటే కరోనా కారణంగా రాకపోకలపై ఆంక్షలు… మరేం చేయాలి… కన్నీళ్లు తుడుచుకుని తనే కార్యరంగంలోకి దిగాడు… నిజంగా తను చేసింది సాహసమే…
Ads
ఆయన తండ్రి ఓ జిమ్ నడిపిస్తుంటాడు… అందులో జూవీయ్ ఓ చిన్న లేబరేటరీ ఏర్పాటు చేసుకున్నాడు… నెట్ అంతా గాలించి ఈ సిండ్రోమ్ లక్షణాలు, ప్రపంచంలో దొరికే ఔషధాలు, వాటిల్లోని ఇంగ్రెడియెంట్స్ తెలుసుకున్నాడు… ఆ ఔషధాలతో వ్యాధిని పూర్తిగా తగ్గించలేం, కానీ పెరగకుండా నిలువరించవచ్చు… కానీ తనకేమో పెద్దగా చదువు రాదు.., అయితేనేం, ట్రాన్స్‌లేటర్ సాయంతో మెల్లిమెల్లిగా తనకు కావల్సిన సమాచారమంతా సేకరించాడు… ప్రయోగాలు మొదలుపెట్టాడు… ఎలాగూ పోయే ప్రాణాలు, ఓ ప్రయత్నం చేస్తే తప్పేమిటి..? ఇదీ తన భావన… రేయింబవళ్లూ అదే ఆలోచన, అదే ప్రయాస… లోకల్‌గా దొరికే కెమికల్స్‌తో మందు తయారు చేయాలనేది తపన… కాపర్ హిస్టడైన్… ఎట్టకేలకు ఆ మందు తయారైంది…
తొలుత కుందేళ్ల మీద ప్రయోగించాడు, ఏ నెెగెటివ్ రిజల్ట్ కనిపించలేదు… సేఫ్ డ్రగ్… హమ్మయ్య అనుకున్నాడు, కొడుక్కి ఇద్దామని అనుకుని, మళ్లీ వెనక్కి తగ్గాడు, కుందేళ్ల మీద సరే, మానవదేహాల మీద నెగెటివ్ రిజల్ట్ ఉండకూడదని ఏముంది..? ఇక్కడా కొడుకు మీద తండ్రి ప్రేమే గెలిచింది, గ్రేట్… తన ప్రాణాల్నే పణంగా పెట్టాడు, ఆ మందును తనమీదే ప్రయోగించుకున్నాడు… తన మీద కూడా ఆ మందు నెగెటివ్ ఫలితం ఏమీ చూపలేదు… అప్పుడు కొడుక్కి ఇచ్చాడు… రెండు వారాల తరువాత పరీక్షలు చేయించాడు, కొడుకు కోలుకుంటున్నాడు, తండ్రిని చూసి నవ్వుతున్నాడు… ఆ తండ్రి ఆరాటానికి అంతకుమించిన ప్రతిఫలం ఇంకేం కావాలి..? ఈ కథ విన్న సైంటిస్టు కమ్యూనిటీ నివ్వెరపోయింది… ఇంకా ఆశ్యర్యం నుంచి తేరుకోవడం లేదు…!!
Share this Article