Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విక్టరీ వెంకటేష్ ఖాతాలో మరో ‘విక్టరీ’… మళ్లీ ‘దృశ్యం’ చూపించాడు…

November 25, 2021 by M S R

తవ్వి పాతేసిన కేసు మళ్లీ ఎప్పుడు పైకి లేస్తుందో, ఎప్పుడు కత్తి మెడ మీద పడుతుందోనని ప్రతి క్షణం భయపడుతూ, ఎవరి పట్లో తప్పు చేస్తాననే మనస్తాపంతో సగం చస్తూ బతికే బతుకూ ఓ బతుకేనా..? అదీ ఓ శిక్షే కదా….. అంతర్లీనంగా ఈ సూత్రమే చెబుతూ దృశ్యం-2 సినిమాను డైరెక్టర్ జీతూజోసెఫ్ జాగ్రత్తగా పేర్చాడు… నిజానికి ఈ సినిమా చూడాలనుకునేవాళ్లు ఫార్ములా రివ్యూలు చదవొద్దు, ప్రిజుడీస్‌గా సినిమా చూడొద్దు… అలాగే దృశ్యం ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లకు మాత్రమే ఈ సినిమా అర్థమవుతుంది, ఆ కొనసాగింపులోని అసలు థ్రిల్ మనసును తాకుతుంది…

చాలామంది దృశ్యం-2 మూవీని మలయాళంలోనే సబ్ టైటిళ్లు పెట్టుకుని మరీ చూసేశారు, వాళ్లు కూడా ఈ సినిమా చూడొద్దు… రేపర్ ఒకటే అయినా, దేని ఫ్లేవర్ దానిదే… అయితే అంతా బాగుందా..? ఉందని కాదు, పలుచోట్ల ‘అతి’ అనిపిస్తుంది… డైరెక్టర్ ఏమిటీ, ఇలా దారితప్పాడు అనిపిస్తుంది… కథనం స్లో పేస్‌లో సాగుతుంటుంది… కానీ, స్థూలంగా సినిమా టైటిళ్లు పడుతున్నప్పుడు మిస్ కావద్దు, చివరి అరగంట అస్సలు మిస్ కావద్దు… మంచి స్క్రీన్ ప్లే పడితే కథలోని ట్విస్టులు ఎంతటి థ్రిల్ ఇస్తాయో అర్థమవుతుంది… హీరో పని అయిపోయినట్టే అనేదాకా కథను తీసుకొచ్చి, ఇక దర్శకుడు అక్కడి నుంచి పరుగులు పెట్టిస్తాడు కథను…

మెచ్చుకోవాల్సిన అంశం ఏమిటంటే… డైరెక్టర్ ఎక్కడా ఫార్ములా జోలికి పోలేదు… జస్ట్, ఒకటే పాట, అది హీరోయిన్ వేదనను చెప్పే చిన్న విషాదగీతం… అంతే… ఇక నో మోర్ సాంగ్స్, నో ఫైట్స్, నో కామెడీ ట్రాక్స్, నో డర్టీ సీన్స్, నో స్టోరీ డివియేషన్… ఒక్క నిమిషం సీన్ కూడా వృథా కాదు, అన్నీ కథలో పార్టే… డైరెక్టర్ కథ నుంచి ఒక్కచోట కూడా పక్కదోవ పట్టకపోవడం బాగనిపిస్తుంది… బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఇతర టెక్నికల్ వాల్యూస్ బాగున్నయ్… స్థూలంగా చూస్తే కథ మొత్తాన్ని వెంకటేషే ప్రధానంగా మోస్తాడు… కానీ తెర వెనుక డైరెక్టర్ కృషి మనల్ని పట్టేస్తుంది… మలయాళంలో మోహన్‌లాల్ సొంత సోది కొంత బోర్ కొట్టించిందనే విమర్శలు వచ్చాయి, కానీ తెలుగులో అదీ లేదు…

Ads

drushyam

అతి అనిపించిన కొన్ని పాయింట్లు కూడా చెప్పుకోవాలి… తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరో రెండుమూడేళ్లుగా ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యలు ‘‘ఆచరణసాధ్యమా’’ అనిపిస్తయ్… ప్రేక్షకులు ఇలా ఫీలవుతారని డైరెక్టర్‌కు కూడా ఏదో ఓ దశలో ఈ డౌట్ వచ్చినట్టుంది… అందుకే పోలీస్ ఆఫీసర్, జడ్జితో ఆఫ్‌దిరికార్డు మాట్లాడే సీన్ పెట్టి, ఇదంతా ఆచరణ సాధ్యమేనని పోలీసాయనతో చెప్పిస్తాడు… అయితే ఆరేళ్ల క్రితం మర్డర్ గురించి ఓ ఐజీ ఏకంగా అండర్ కవర్ ఆపరేషన్ ప్లాన్ చేయడం, ఇయర్ బగ్స్, నైబర్స్-ఓ స్వామిని ప్లాంట్ చేయడం, రెండేళ్ల నిఘా గట్రా అతి అనిపిస్తయ్… దానికీ ఓ రీజనింగ్, జస్టిఫికేషన్ చెప్పుకున్నాడు డైరెక్టర్… నదియా తన ఫ్రెండ్, సర్వీస్ మేట్, అందుకే ఇంత శ్రద్ధ తీసుకుని దర్యాప్తు చేస్తున్నాను అని సదరు ఐజీ పాత్రతో చెప్పిస్తాడు…

తను శవాన్ని ఎక్కడ పూడ్చేశాడో హీరో చివరకు కుటుంబసభ్యులకు కూడా తెలియనివ్వడు, అది తన మనసులో దాగున్నన్ని రోజులే తమ కుటుంబానికి శ్రీరామరక్ష అని చెబుతాడు కూడా… ఐనాసరే, హీరోయిన్ మీనా ఓ దశలో ‘ఎక్కడ పాతేశారో నాకు చెప్పండి, నన్ను నమ్మలేరా, నేనెవరికైనా చెబుతానని అనుమానిస్తున్నారా’ అంటూ పదే పదే ఇన్‌సిస్ట్ చేయడం ఆమె కేరక్టరైజేషన్ ఫాల్ట్… డైరెక్టర్ తప్పులో కాలేశాడు ఇక్కడ… మరో అతి, నవ్వొచ్చేది ఎక్కడంటే… సీక్రెట్ దర్యాప్తు అంటూనే, ఇదొక వార్ అంటూనే ఐజీ తమ లోకల్ సీఐతో పేపర్ బాయ్స్, మిల్క్ వెండర్స్, మ్యారేజీ రిసెప్షన్‌కు హాజరైన గెస్టులతో మాట్లాడింపజేస్తూ, ఎంక్వయిరీ చేయిస్తాడు… రెండేళ్ల నుంచీ అండర్ కవర్ చేయిస్తూ, లోకల్ సీఐకి ఎప్పుడో ఓసారి అనుకోకుండా చెప్పి, ఇన్వాల్వ్ చేస్తాడు… డైరెక్టర్ బహుశా జీతెలుగు సీరియళ్లు అప్పుడప్పుడూ చూస్తాడేమో అని మనకు నవ్వొస్తుంది…

సినిమాలో నచ్చేది మరొకటి ఉంది… లోకం పోకడను ఆవిష్కరించడం… తమ కళ్ల ముందే హీరో ఓ థియేటర్ లీజు తీసుకోవడం, సినిమా తీస్తాననడం, పెద్ద ఇల్లు కట్టుకోవడం గట్రా ప్రజల్లో ఈర్ష్యను పెంచుతాయి… హీరోకు తాగుడు అలవాటవుతుంది… చివరకు ఆ అలవాటు రావడానికి కూడా డైరెక్టర్ ఓ జస్టిఫికేషన్ ఇస్తాడు చివరలో… ఇంకొకటి నచ్చే అంశం… ఒక హత్య, పోలీసు దర్యాప్తు హింస పిల్లల మీద ఎంత దీర్ఘకాలం ప్రభావాన్ని చూపిస్తాయి, వాళ్ల ఆరోగ్యం మీద, మానసిక ఆరోగ్యం మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఏమిటో కూడా సినిమా చక్కగా చూపించింది…

చెప్పడానికి డైరెక్టర్‌ను మెచ్చుకునే అంశం మరొకటి ఉంది… తనికెళ్ల భరణి, షఫి, పూర్ణ, నదియా, ఎవరైతేనేం, పాత్ర పరిమితికి తగ్గట్టు స్క్రీన్ స్పేస్, అంతే… అంత పెద్ద నదియా అనుకుని ఆమెకేమీ పెద్దపీట వేయలేదు, జబర్దస్త్ కమెడియన్లను వెకిలి కామెడీకి వాడుకోకుండా కథలో పాత్రధారుల్ని చేయడం కూడా బాగుంది… ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది… అన్నట్టు, చెప్పనేలేదు కదూ… కొన్ని అన్‌సాల్వ్‌డ్ కేసులు ఉంటయ్, అంగీకరించాల్సిన రియాలిటీ అని చివరకు జడ్జి, పోలీసు ఐజీలతో కూడా చెప్పించి, ఇక ఈకేసును ఏమీ చేయలేమని అనిపించి, దృశ్యం-3కు బేస్ లేకుండా చేశాడు డైరెక్టర్… అఫ్‌కోర్స్, మూడో పార్ట్ తీయాలనే అనుకుంటే తెలుగు టీవీ సీరియల్‌లాగా ఏదో కొత్త ట్విస్టు ఇచ్చి తిరగదోడటం ఎంతసేపు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions