కొన్ని తీర్పుల మీద డిబేట్ జరగాలి… పౌరసమాజం చర్చించాలి… ఇదీ అలాంటిదే… కానీ సబ్‌జుడీస్ భయంతో జర్నలిస్టులే పెద్దగా స్పందించరు, మనకెందుకొచ్చిన చర్చ అనుకుని అడ్వొకేట్ కమ్యూనిటీ కూడా పట్టించుకోదు… రాజకీయ నాయకులకు..? సారీ, తీరిక లేదు, అంత బుర్ర కూడా లేదు… ఒక నేరం- ఒక తీర్పు- ఒక చట్టం… ఎప్పుడూ చర్చనీయాంశాలే నిజానికి… ప్రజెంట్ ఈ కేసు ఏమిటంటే..? ఎనిమిదేళ్ల క్రితం ముంబైలో ఓ సామూహిక హత్యాచారం… మన సిస్టం గురించి తెలుసు కదా, దర్యాప్తులు, విచారణలు, చార్జి షీట్లు, తీర్పులు, శిక్షల అమలు ఎంత వేగంగా జరుగుతాయో… సరే, సెషన్స్ కోర్టు దోషులకు మరణశిక్ష వేసింది… అదీ చట్టప్రకారమే… కానీ హైకోర్టు మరోరకంగా ఆలోచించింది…
‘‘జరిగింది ఆటవికమే, దుర్మార్గమే, దారుణమే, సమాజం ఆత్మనే షేక్ చేసింది, బాధితురాలి నష్టాన్ని కూడా ఎవరూ పూడ్చలేరు… కానీ కేవలం జనం ఎమోషన్స్ ఆధారంగా శిక్షలు వేయలేం కదా… చట్టం ప్రకారం వేయాలి… ఏ నేరానికి ఏ శిక్ష అవసరమో అదే విధించాలి… ఒకేసారి మరణశిక్ష విధిస్తే ఇక ఆ దోషులకు పశ్చాత్తాపం చాన్స్ ఏముంది..? జీవితకాలం, కనీసం పెరోల్ కూడా లేకుండా, బతికినన్నిరోజులూ చస్తూ, చస్తూ, కుమిలిపోతూ జైలులోనే గడిపితే కదా, బాధ అంటే వాళ్లకూ తెలిసేది… అందుకని మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నాం’’ అని తీర్పు చెప్పింది…
ఎస్, స్థూలంగా చూస్తే హైకోర్టు వాదన, కేసును చూసిన కోణం భేష్… ఆ దోషులకు సమాజంలో బతికే హక్కులేదు, క్షమాపణలకూ అర్హులు కారు అనే దృక్కోణం కూడా కరెక్టే… అయితే ఈ గ్యాంగ్ రెండు కేసుల్లోనూ దోషులే… బయటపడనివి ఇంకేమైనా ఉన్నాయో లేదో తెలియదు… ఇలాంటివాళ్లు బయటతిరగడం సొసైటీకి నష్టదాయకం… అయితే..? మరో కోణంలో కూడా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ప్రస్తావనార్హం…
Ads
- సెషన్స్ కోర్టు కూడా చట్టం ప్రకారమే మరణశిక్ష విధించింది కదా… ఫలానా నేరాలకు మాత్రమే మరణశిక్ష విధించాలి అనే స్పష్టత ఏమీ లేదు కదా… అలాగే హత్యాచారం కూడా అత్యంత తీవ్ర నేరమే కదా… సో, మరణశిక్ష తీర్పు అనేది కొట్టిపారేయతగిందేమీ కాదు…
- దేహంలో ఓ కేన్సర్ కణితి కనబడితే, కన్ఫరమ్ అయితే ఇంకా దాన్ని ఎందుకు ఉంచుకోవాలి… సర్జరీ చేసి, దేహం నుంచి ‘ఏరిపారేయడమే’ సరైన చికిత్స కదా… ఈ సామూహిక హత్యాచార నిందితులు కూడా సొసైటీకి కణితులే కదా… అసలు లోకం నుంచే డిలిట్ చేస్తే తప్పేముంది..?
- అసలు ఇలాంటి ‘అన్వాంటెడ్ ఎలిమెంట్స్’ భద్రతకు, పోషణకు, తిండికి, జీవనానికి డబ్బు ఎందుకు చెల్లించాలి..? జైలులోనైనా సరే..!
- అసలు ఇలాంటి నొటోరియస్ కేరక్టర్స్ పశ్చాత్తాపపడతాయా ఏ దశలోనైనా..? ఉరి తప్పింది కదా, బతికినంతకాలమూ బతుకుదాం అని సంతోషించే బాపతు… మానసికంగా కుంగుబాటు, చస్తూ బతకడం అనేవి మనం చెప్పుకోవడమే గానీ, ఇలాంటి ఆదర్శ పదాలు అసలు గ్యాంగులకు వర్తిస్తాయా..?
- ఇలాంటి కేరక్టర్లు పశ్చాత్తాపపడితే ఎంత..? పడకపోతే ఎంత..? వాళ్లు లేకపోతే సొసైటీకి పోయేదేముంది..? ఉండి ఉద్దరించేది ఏముంది..? సొసైటీ వాళ్లను ఎందుకు పోషించాలి..? పోనీ, పశ్చాత్తాపపడతారే అనుకుందాం… మనుషుల్లా మారిపోతారు అనుకుందాం, ఎలాగూ బతికినంతకాలమూ జైలే అంటున్నారు కదా… బయటికి రారు కదా, మరిక వాడి పశ్చాత్తాపం గురించి సొసైటీకి ఎందుకు చింత..? వాడు కుమిలిపోతుంటే చూసి, బాగుంది అనుకునే శాడిజం సమాజానికి దేనికి..?
- నో, నో, ఈ వాదన తప్పు… అసలు తీర్పులు, శిక్షల అమలు మనుషుల్ని సంస్కరించడానికి కదా, ఒకేసారి చంపేస్తే ఇక సంస్కరణకు చాన్స్ ఏమున్నట్టు అనే కోణమూ దీనికి కంట్రాస్టు… హైకోర్టు అబ్జర్వేషన్, ఆలోచించిన తీరు కరెక్ట్ అనేవాళ్లూ ఉంటారు…
- ఒకవేళ మరణశిక్షే కరెక్టు అనుకునే పక్షంలో… వేగంగా తీర్పులు రావు, అమలు కావు, ఎక్కడో లూప్‌హోల్ దొరికితే, బయటికొస్తే సొసైటీకి నష్టం, అంటే లీగల్‌గా ఈ కణితుల్ని తొలగించలేం.., ఏ ప్రభుత్వమో కోపంతో, తక్షణ న్యాయం అని ఆలోచించి, తమ పోలీసులకు చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తే విచారణలు, చిక్కులు తప్పవు… దాంతో జీపులు బోల్తాపడటాలు, రైళ్లకు ఎదురెళ్లి నిందితులు ఆత్మహత్యలు చేసుకోవడాలు వంటి ప్రత్యామ్నాయ శిక్షలు ఆలోచించబడుతుంటయ్… వెరసి, ఎక్కడుంది లోపం..? ఏది పరిష్కారం..? అసలు ఇదీ చిక్కుప్రశ్న…
- అవునూ, మన జైళ్లలో మనుషులు సంస్కరించబడతారా..? మరింత రాటుదేలి, ముదిరిపోతారా..? సొసైటీ మీద అంతులేని కక్షతో రగిలిపోతుంటారా..? శిక్షలు పడి, బయటికి వచ్చి, మళ్లీ నేరాలు చేసి, వరుసగా హత్యాచారాలు చేసిన ఓ నొటోరియస్ కేరక్టర్ గురించి మనం ఈమధ్య చెప్పుకున్నట్టున్నాం కదా…!! (Just for Academic debate Only)
Share this Article