నో, నో… ఇది అనుభవించు రాజా సినిమా రివ్యూ కాదు, కానేకాదు… నిజానికి ఈ సినిమాకు రివ్యూ కూడా అక్కర్లేదు… ఓటీటీల్లో వచ్చినప్పుడు… అదీ అవసరం లేదు, ఏదో దిక్కుమాలిన టీవీలో ఎప్పుడో ఓసారి రాకపోదు, వీలుంటేనే చూడండి, చూడలేకపోతే వదిలేయండి… నిజానికి హీరో రాజ్‌తరుణ్ మీద కాదు, నాగార్జున టేస్ట్ చూసి జాలేసింది… ఎందుకంటే… ఇది అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ అట మరి… యార్లగడ్డ సుప్రియ నిర్మాత… ఓ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ, సాధనసంపత్తి పుష్కలంగా ఉన్న సంస్థ ఓ టీవీ సీరియల్‌కు తక్కువ, షార్ట్ ఫిలిమ్‌కు ఎక్కువ బాపతు సినిమా తీసినందుకు వాళ్లు సిగ్గుపడాలి… ఫాఫం, రాజ్‌తరుణ్ తప్పేముంది..? ఓ స్టార్‌గా తన స్టామినా ఎప్పుడో పడిపోయింది, అవకాశాల్లేవు, ఎవరో ఒకరు పిలిచి హీరో నువ్వే అంటే, తక్షణం అగ్రిమెంట్‌పై సంతకం పెట్టడంకన్నా తనకు వేరే చాన్సేముంది..? కానీ ఇదుగో, ఇలాంటి సంతకాలే ప్రతి సినిమాకూ తనను మెట్లు దింపేస్తున్నాయని అర్థం చేసుకోవడం లేదు, చేసుకున్నా ఇప్పుడు వేరే దిక్కేమీ లేదు…
నిజానికి రాజ్‌తరుణ్ తీసిపారేయదగిన యాక్టర్ ఏమీ కాడు… మంచి ఎనర్జీ ఉంది, కామెడీకి తగిన టైమింగ్ ఉంది, మొహంలో ఎమోషన్స్ కూడా పలికించగలడు… డాన్సులు- ఫైట్లు అంటారా, అవన్నీ రోప్ ట్రిక్స్, సర్కస్ ఫీట్లే కదా, వారస హీరోలు కూడా చేస్తున్నారు… ఎవడైనా చేస్తాడు… కానీ రాజ్‌తరుణ్‌లోని నటుడు బయటికి రావడం లేదు, కారణం సింపుల్… మంచి పాత్ర పడటం లేదు… దొరికిన పాత్రలేమో ఇదుగో ఈ అనుభవించు రాజా వంటి పాత్రలు… తనకంటూ ఏ డిమాండ్లూ ఉండవు, హీరోయిన్‌గా ఏ కషిష్ ఖానైనా వోకే… ఓ సంగీతం కుదరలేదు, కామెడీ పండలేదు, ట్విస్టులు- సస్పెన్స్ సోసో… ఆ దర్శకుడి పేరేమిటో గానీ… థియేటర్‌కు నమ్మి వచ్చావు కదా, అనుభవించు రాజా అని కసికసిగా కసి తీర్చుకున్నాడు… టికెట్ రేట్లు, పార్కింగు ఫీజు, క్యాంటీన్ దోపిడీ, వచ్చీపోయే ఖర్చు… ఇంతకింతా అనుభవిస్తావ్ డైరెక్టరూ… చేసిన పాపం, ఈ సినిమా తీసిన పాపం ఊరకే పోదు…
Ads
ఇంకా ఎన్నాళ్లు రాజా… ఈ కోడిపందేలు, ఊరి ప్రెసిడెంటు గిరీ, చిల్లర పంచాయితీలు, ఆ పిచ్చి గెంతులు, తోడుగా పాచిపోయిన కామెడీ… అటు తమిళం వైపు… ఇటు మలయాళం వైపు… పోనీ, తుళు, కొంకణి, మరాఠీ వంటి భాషల్లోనూ ప్రయోగాలు చేస్తున్నారు, కొత్త నీరు వస్తోంది, సినిమాల్ని కొత్త కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నాలు సాగుతున్నయ్… సక్సెసో, ఫెయిలో… ఒక ప్యాషన్ ఇండస్ట్రీలోకి ప్రవహిస్తోంది… ఫార్ములాలు బ్రేకవుతున్నయ్… రొటీన్ మసాలా కంపు క్రమేపీ కడిగేస్తున్నారు… అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఈ సోయి ఇంకా ఎక్కినట్టు లేదు… అదే అనుభవించు రాజా, రాబోయే బంగార్రాజు… ఫాఫం… మళ్లీ చెప్పుకుందాం, రాజ్‌తరుణ్ తప్పేమీ లేదు… అదృష్టం బాగాలేదు, అంతే… ఈరోజు సినిమా ప్రేక్షకుడిని థియేటర్ దాకా రప్పించాలి అంటే ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్ అవసరం… లేకపోతే ఫోఫోవోయ్, ఓటీటీ మీదకు వస్తావుగా, టీవీల్లో కనిపిస్తావుగా, అప్పుడు చూస్తాంలే అనేస్తున్నారు ప్రేక్షకులు… అసలు ఇక్కడ ఐరనీ, జోక్, ట్రాజెడీ, కామెడీ, కంట్రాస్టు ఏమిటంటే… దృశ్యం-2 వంటివి ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి, అనుభవించు రాజాలు, ఖాళీ ఫ్లవర్లు థియేటర్లకు వస్తున్నాయి… సార్, డైరెక్టర్ గారూ, మీ పేరేమిటో మరిచిపోయాను గానీ, మీకు ఓ దండం సార్… అమ్మా తల్లీ, యార్లగడ్డ సుప్రియా, నీకు కూడా…!!
Share this Article