కుటుంబ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికే ముప్పు అని ప్రధాని మోడీ అన్నాడు… ప్రతిపక్షాలు బహిష్కరించిన అధికారిక రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలపై ఇదొక్క మాటే చెప్పుకొచ్చాడు… అంతేతప్ప ఎలా ముప్పు అనేది చెప్పలేదు, చెప్పడు… ఆమధ్య ఒక దేశం, ఒక చట్టవేదిక అన్నాడు… అదేమిటో చెప్పడు… పైగా అందరూ ఏకాభిప్రాయానికి రావాలంటాడు… 75 ఏళ్లొచ్చాయి, మన స్వాతంత్ర్యానికి… నిజంగా మన ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కుటుంబ పార్టీల వల్ల వస్తోందా..? ఆనాటి నుంచీ కుటుంబ పార్టీలు, వ్యక్తి పార్టీలదే కదా పెత్తనం… ముప్పు వాటివల్లేనా..? లేక సైద్ధాంతిక నిబద్ధత లేని, సామాజిక బాధ్యత లేని, ప్రజల్ని ప్రేమించలేని, నియ్యత్ లేని శీలరహిత నాయకుల వల్ల వస్తోందా..? అసలు అది కదా డిబేటబుల్… కాకపోతే మోడీ చెప్పలేదు గానీ… కుటుంబ పార్టీలు, వ్యక్తి పార్టీల వల్ల మన ప్రజాస్వామిక వాతావరణంలో నాణ్యత, విలువలు, ప్రమాణాలు లేకుండా పోయాయనేది నిజం… దాన్ని ముప్పు అని సూత్రీకరించలేం… ఒకసారి మన జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన కొన్ని రాష్ట్ర పార్టీలను పరిశీలిద్దాం… రెండుమూడు పార్టీలు మినహా అసలు మొత్తం మన దేశంలో ఉన్నవి కుటుంబ పార్టీలు, వ్యక్తి పార్టీలే కదా…
ముందుగా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు…
తృణమూల్… మమతా బెనర్జీకి సొంత కుటుంబం ఏమీ లేదు, అన్న కొడుకు అభిషేక్ బెనర్జీదే వారసత్వం
Ads
బహుజనసమాజ్ పార్టీ… మాయావతికి సొంత కుటుంబం ఏమీ లేదు, అన్న కొడుకు ఆకాశ్ కుమార్‌దే వారసత్వం
భారతీయ జనతా పార్టీ… కుటుంబం, వ్యక్తి వారసత్వాలు లేవు… సిస్టమాటిక్ రైట్ వింగ్ పార్టీ, ప్రజల పార్టీ
సీపీఐ… కుటుంబం, వ్యక్తి వారసత్వాలు ఉండవ్… సిస్టమాటిక్ లెఫ్ట్ వింగ్ పార్టీ… ప్రజలదే పార్టీ
సీపీఎం… కుటుంబం, వ్యక్తి వారసత్వాలు ఉండవ్… సిస్టమాటిక్ లెఫ్ట్ వింగ్ పార్టీ… ప్రజలదే పార్టీ
కాంగ్రెస్… నెహ్రూ కుటుంబానిదే తరతరాల వారసత్వం… పెత్తనం, ఓనర్ షిప్… పేరుకు ప్రజల పార్టీ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ… శరద్ పవార్ సొంత పార్టీ, ఆయన తరువాత అజిత్ పవార్, లేదంటే సుప్రియా సూలే పెత్తనాలు
నేషనల్ పీపుల్స్ పార్టీ… ఇది పీఏ సంగ్మా పార్టీ, ఆయన తరువాత కొడుకు కొనరాడ్ సంగ్మా వారసుడయ్యాడు
….. ఇక గుర్తింపు పొందిన కొన్ని రాష్ట్ర పార్టీల విషయానికొస్తే….
ఆమ్ ఆద్మీ… కేజ్రీవాల్ సొంత పార్టీలాగే నడుస్తుంది, కాకపోతే కుటుంబ ఆస్తిగా అనిపించదు, అలా ఎంకరేజ్ చేయడం లేదు
అన్నాడీఎంకే… దీనికీ వారసత్వ గొడవలున్నయ్… ఓ కుటుంబం అంటూ లేని జయలలిత చనిపోయాక పార్టీకి కూడా దిక్కూదివాణం లేకుండా పోయింది
డీఎంకే… పూర్తిగా కరుణానిధి పార్టీ, ఆ కుటుంబానిదే ఓనర్ షిప్… ప్రస్తుతం స్టాలిన్ సీఎం… ఆ కుటుంబంలో బోలెడు మంది నాయకులు
మజ్లిస్… ఒవైసీ కుటుంబ పార్టీ… సలావుద్దీన్ మరణించాక ఇద్దరు కొడుకులు అసద్, అక్బర్‌లవే పగ్గాలు…
ఎన్ఆర్ కాంగ్రెస్… ఇది పుదుచ్చేరి పార్టీ… ఇది కూడా రంగస్వామి సొంత పార్టీయే దాదాపు
ఎఐయూడీఎఫ్… ఇది అస్సాం పార్టీ, లీడర్ బద్రుద్దీన్ చెప్పుచేతల్లోని పార్టీ
బిజూజనతాదళ్… నిజానికి ఇది వ్యక్తి పార్టీ… తండ్రి బిజూ పట్నాయక్ పేరిట ప్రస్తుత సీఎం నవీన్ పట్నాయక్ పెట్టుకున్న సొంత పార్టీ… కానీ ఆయనకు పొలిటికల్ వారసుల్లేరు, రేపు రేపు పార్టీ ఓనర్‌షిప్ ఎవరిదనేది ప్రశ్నార్థకం…
డీఎండీకే… ఇది నటుడు విజయకాంత్ సొంత పార్టీ, ఆయనదే ఓనర్‌షిప్…
ఇండియన్ నేషనల్ లోక్‌దళ్… ఇది చౌతాలా కుటుంబ పార్టీ…
నేషనల్ కాన్ఫరెన్స్… ఇదీ కుటుంబ పార్టీయే… షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, తరువాత ఒమర్ అబ్దుల్లా
పీడీపీ… ఇదీ అంతే… ముఫ్తి మొహమ్మద్ సయీద్ తరువాత బిడ్డ మెహబూబా ముఫ్తి పగ్గాలు చేపట్టింది
జేడీఎస్… కుటుంబ పార్టీయే… దేవెగౌడ మాజీ పీఎం, కొడుకు కుమారస్వామి మాజీ సీఎం… తరువాత నిఖిల్ గౌడ…
జేడీయూ… ఇప్పుడు దీని ఓనర్‌షిప్ పూర్తిగా సీఎం నితిశ్ అనుభవిస్తున్నా సరే, వారసుల్లేరు, రేపు ఎవరనేది క్లారిటీ లేదు…
జార్ఖండ్ ముక్తిమోర్చా… శిబూసోరెన్ పార్టీ, తరువాత కొడుకు హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టాడు, సీఎం ఇప్పుడు
లోక్‌జనశక్తి పార్టీ… రాంవిలాస్ పాశ్వాన్ తరువాత కొడుకు చిరాగ్ పాశ్వాన్ పెత్తనం… వారసత్వంపై కుటుంబ గొడవలు కూడా ఉన్నయ్
రాష్ట్రీయ జనతాదళ్… లాలూప్రసాద్ యాదవ్ కుటుంబ పార్టీ… ఆయన బయట లేనప్పుడు భార్య రబ్రీదేవి పగ్గాలు, ఇప్పుడు కొడుకు తేజస్వి పెత్తనం
సమాజ్‌వాదీ పార్టీ… ములాయం సింగ్ యాదవ్, ఆయన వారసుడు అఖిలేష్ యాదవ్… కుటుంబపార్టీ
శిరోమణి అకాలీదళ్… కుటుంబమే… ప్రకాష్ సింగ్ బాదల్ తరువాత ఇప్పుడు ఆయన కొడుకు సుఖ్‌బీర్‌సింగ్ పెత్తనం
శివసేన… కుటుంబపార్టీ… బాల్ థాక్రే తరువాత కొడుకు ఉద్ధవ్ థాక్రే పెత్తనం, ఆయన కొడుకు ఆదిత్య థాక్రే కూడా వారసత్వానికి రెడీ
టీఆర్ఎస్… కేసీయార్ ఓనర్‌షిప్… ఆయన తరువాత కొడుకు కేటీయార్‌దే వారసత్వం
తెలుగుదేశం… ఎన్టీయార్ సొంత పార్టీ, అల్లుడు చంద్రబాబు లాక్కున్నాడు, ఆయన కొడుకు లోకేష్ వారసత్వం
వైసీపీ… జగన్‌మోహన్‌రెడ్డి సొంత పార్టీ, వంద శాతం ఓనర్‌షిప్ ఆయనదే
స్థూలంగా పరిశీలిస్తే… భారతదేశంలోని రాజకీయ వ్యవస్థ పాత రాజరికం, వారసత్వాల మూలాల నుంచి, ఆ పోకడల నుంచి, ఆ వాసనల నుంచి బయటపడలేదు… పూర్తిగా రైట్ వింగ్ అయిన బీజేపీ, పూర్తిగా లెఫ్ట్ వింగ్ అయిన సీపీఎం, సీపీఐలు బెటర్… సిద్ధాంతాలే వాటి వారసులు… కార్యకర్తలదే వారసత్వం… ఎవరో నాయకుడవుతాడు, నడిపిస్తాడు… ఇక మిగతా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల్లో దాదాపు 98 శాతం వరకూ వ్యక్తి పార్టీలు, కుటుంబ పార్టీలు… వాళ్లదే ఓనర్‌షిప్… పార్టీల పేరిట ఉండే ఆస్తులు, ట్రస్టులు, ఇతర యవ్వారాల్ని కూడా ఆ కుటుంబాలే అనుభవిస్తుంటయ్… ఇక లెక్కలేనన్ని అన్ రికగ్నయిజ్డ్ పార్టీలున్నయ్… అందులో చాలావరకూ నామ్‌కేవాస్తే… కాకపోతే మోడీ చెప్పినట్టు ప్రజాస్వామ్యానికే చేటు అని చెప్పలేం… వ్యక్తి పార్టీలైనా సరే, కుటుంబ పార్టీలైనా సరే… పగ్గాలు, పెత్తనాలు వాటి అంతర్గత సమస్య, అవి డెమొక్రటిక్ లైన్స్ దాటి వ్యవహరించడం లేదు కదా… నిర్దేశిత నియమావళికే లోబడి వ్యవహరిస్తాయి… కాకపోతే వీటిలో అధికశాతం పార్టీలకు, వాటి నేతలకు సంపాదన, అధికారమే ప్రథమలక్ష్యం, సైద్ధాంతిక బలమేమీ ఉండదు… జాతీయ సమస్యలపై ఓ దృక్పథం ఉండదు… ప్రాంతీయ పరిమితులు దాటలేనితనం… కుర్చీ దొరికితే చాలు, దంచుకోవడమే…!! మన ఎన్నికల విధానంలో, ప్రజాప్రాతినిధ్య విధానంలో ఉన్న లోపాలే ప్రధాన కారణం, ఆ మార్పులు, సంస్కరణల గురించి మాత్రం ప్రధాని మాట్లాడడు, ఏ పార్టీ మాట్లాడదు… అది కదా అసలు ఖర్మ…!!
Share this Article