అవునూ, మన దేశంలో అత్యంత ధనిక మహిళ ఎవరు..? ఆమె ఆస్తి విలువ ఎంత..? ఆమె పేరు రోష్ని నాడార్… దాదాపు 85 వేల కోట్ల ఆస్తిపరురాలు… అంతా వైట్ మనీ… అంటే లెక్కకు వచ్చే సొమ్మే… ఇంతకుమించి ధనం ఉండీ, బయటికి అధికారికంగా చెప్పుకోలేని మరింత ధనిక మహిళలు ఉంటే ఉండవచ్చుగాక… తాజాగా కొటక్-హురున్ విడుదల చేసిన లెక్కల ప్రకారం రోష్నీయే టాప్… అసలు ఎవరీమె..? అందరిలాగే కేవలం కాగితాలపై కనిపించే డమ్మీ కేరక్టరా..? దమ్మున్న కేరక్టరా..? ఓసారి చెప్పుకుందాం…
తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని ఓ కోస్తా గ్రామంలో పుట్టిన శివ నాడార్ వయస్సు ఇప్పుడు 77 ఏళ్లు… అప్పుడెప్పుడో నలభై ఏళ్ల క్రితం హెచ్‌సీఎల్ కంపెనీ స్థాపించాడు… పెంచుకుంటూ పోయాడు… మన ఐటీ, హార్డ్‌వేర్ ఉత్పత్తులకు, ఎగుమతులకు ప్రధాన కంపెనీగా మారింది… ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా ఇచ్చింది ప్రభుత్వం… ఆయనే రోష్నీ తండ్రి…
Ads
తనకు ఒక్కతే కూతురు… వేల కోట్ల తన కంపెనీకి, తన గౌరవానికి అర్హురాలిగా తన వారసురాలిని జాగ్రత్తగా చెక్కాడు… అకస్మాత్తుగా తీసుకొచ్చి కంపెనీ మీద రుద్దలేదు… కంపెనీని ఆమె నెత్తి మీద హఠాత్తుగా పెట్టలేదు… ఆమె పర్సనల్ అభిరుచులకు, ఆశలకు, ఆకాంక్షలకు అడ్డుపడకుండానే… తన ఆశలకు తగినట్టుగా మౌల్డ్ చేసుకున్నాడు… అది అభినందనీయం అనిపిస్తుంది… అదేసమయంలో డబ్బు తాలూకు మైకం, నడమంత్రపు సిరి ఆమె కళ్లను కమ్మేయకుండా జాగ్రత్తపడ్డాడు…
ఆమె శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానంది… నేర్పించాడు… యోగా కావాలంది… నేర్పించాడు… ఈరోజుకూ వాటిని వదలదు ఆమె… బాగా చదవాలని ఉంది నాన్నా అనడిగింది… అమెరికాలో కమ్యూనికేషన్స్ చదువుకుంది… జర్నలిస్టు నెత్తురు కదా… (శివ నాడార్ మేనమామ ఎస్పీ అదితనార్ దినతంతి అనే పాపులర్ డెయిలీ ఓనర్…)
చదువు అయిపోయింది… సీఎన్బీసీ, సీఎన్ఎన్ తదితర మీడియా హౌజుల్లో కొన్నాళ్లు ఇంటర్న్‌షిప్… ఇందులో అందరూ మీడియా మొఘల్ రూపర్డ్ మర్డోక్‌లు కాలేరమ్మా అని నచ్చజెప్పాడు బిడ్డకు… బిజినెస్ మేనేజ్‌మెంటులో చేర్పించాడు… అదయ్యాక… ఇండియా తిరిగొచ్చాక… పేరుకు ఆమెను కంపెనీ సీఈవోగా ప్రకటించాడు… కానీ ఎకాఎకిన కంపెనీ బాధ్యతలు పూర్తిగా అప్పగించలేదు ఆమెకు… వేల కోట్ల టర్నోవర్, వేల మంది ఉద్యోగులు… ఆమెను రుద్దలేదు నేరుగా… రిస్క్ కదా…
కంపెనీ ట్రస్టు తరఫున నడిచే స్కూళ్లు, ఇతర సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమాల్ని ప్రధానంగా చూడమన్నాడు మొదట్లో… సమాజం పట్ల కొంత జవాబుదారీతనం పెరగటానికి అది అవసరం అనుకున్నాడు… గొప్ప ఆలోచన… 26 ఏళ్లకే ఓ లిస్టెడ్ ఐటీ కంపెనీకి సీఈవో అయిన తొలి మహిళ ఆమె… తరువాత కంపెనీ డైరెక్టర్‌ను చేశాడు… ఆర్థిక వ్యవహారాలు అప్పగించాడు… ఒక్కొక్క అంశమే నేర్పించాడు… ఒక్కసారి ఫైనాన్షియల్ మేటర్స్ అర్థమైతే చాలు, ఇక ఎవరూ వేలు పెట్టి నడిపించనక్కర్లేదు… ఆమె నేర్చుకుంది…
ఆమె పర్సనల్ విషయాలను కూడా గౌరవించాడు… ఆమె ప్రేమించిన శిఖర్ మల్హోత్రా అనే మామూలు హోండా డిస్ట్రిబ్యూటర్‌తో పెళ్లి చేశాడు… ఎకాఎకిన ఓ అనామక డీలర్ కొన్ని వేల కోట్ల హెచ్సీఎల్ సామ్రాజ్యానికి అల్లుడు అయిపోయాడు… తరువాత ఓ టైం వచ్చింది… అల్లుడు, బిడ్డకు అప్పగించి, రిటైర్ కావాల్సిన టైం వచ్చేసిందని ఫీలయ్యాడు…
ఆమెను ఆమధ్య ఏకంగా కంపెనీ ఛైర్ పర్సన్‌ను చేశాడు… కొడుకైనా, బిడ్డయినా ఆమే కదా… అల్లుడిని ఉపాధ్యక్షుడిని చేశాడు… ఐనాసరే, కంపెనీని వదిలేయలేదు… ఇప్పటికీ ఆమె తండ్రి చాటు బిడ్డలాగే కనిపిస్తుంది… హంబుల్… తండ్రి కూడా అన్నింట్లోనూ వేలు పెట్టడు… కానీ చీఫ్ స్ట్రాటజిక్ డైరెక్టర్ హోదాలో ఎప్పుడూ ఓ కన్నేసే ఉంటాడు… ఆమెను పెంచిన తీరు, మల్చుకున్న తీరు, ఆమెకు క్రమేపీ అన్నీ నేర్పి, ప్రత్యేకంగా సమాజానికి మనం తిరిగి ఏమివ్వాలో నేర్పించి, అన్నీ అప్పగించి… ఈరోజుకూ ఒక కంటితో ఆమెను చూసి గర్విస్తాడు… మరో కంటితో కంపెనీని గమనిస్తూనే ఉంటాడు… ఎవరూ గాడితప్పకుండా…! గొప్ప తండ్రి… ఆ తండ్రికి తగ్గ తనయ…!!
గొప్ప తండ్రి అనడానికి సందేహించాల్సిన పనిలేదు… అలాగే గొప్ప మనిషి అనీ అందాం… ఇండియాలోకెల్లా టాప్ ఫైవ్ గ్రేట్ ఫిలాంత్రపిస్టుల (దాతలు) జాబితాలో ఉంటాడు… అంబానీలు, ఆదానీలు ఎంత సంపాదిస్తేనేం… శివ నాడార్ సంపాదించిన పుణ్యంలో పైసామందం కూడా లేదు… అయితే ఈ 85 వేల కోట్లను ఆమె సంపాదించలేదు, అవేమీ ఆమె ప్రతిభ కాదు… కానీ అవి ఇప్పుడు కాపాడితే చాలు, తండ్రి బాటలో నడుస్తూ, కొన్ని వేల కుటుంబాలకు ఆధారంగా కొనసాగితే చాలు… అదే ఆమె ప్రతిభకు సవాల్… ఎందుకంటే…? లక్షన్నర మంది ఉద్యోగులు… యాభై దేశాల్లో వ్యాపారం… ఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల సంపాదన… అన్నింటికీ మించి వాళ్ల ఆదాయం నుంచి భారీగా ఖర్చయ్యే సేవా కార్యక్రమాలు… ఆమె కూర్చున్న కుర్చీకి చాలా బాధ్యత ఉంది…!
Share this Article