మీకు ఈమధ్య వచ్చిన ఏదో సినిమాలోని దిగు దిగు దిగు నాగ అనే దిక్కుమాలిన పాట గుర్తుందా..? కాపీ మాస్టర్ అనే విమర్శలున్న థమనుడు ప్లస్ ఈమధ్య తనకేమైందో తెలియని అనంత శ్రీరాముడి కాంబినేషన్ అది… బూతును దిగేశారు… రాబోయే అఖండ అనే జైబాలయ్య సినిమాలో కూడా ఓ పాట ఉందండోయ్… నిన్న ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో దీన్ని కూడా ఆవిష్కరించినట్టున్నారు… ఈ పాటలో బూతులేమీ లేవు కానీ, మనుషుల్ని, సంగీత ప్రియుల్ని, సినిమా ప్రేమికుల్ని… ప్రత్యేకించి బాలయ్య అభిమానుల్ని కూడా మూకుమ్మడిగా చావగొట్టేశారు… సేమ్, అదే థమనుడు, అదే అనంత శ్రీరాముడు… ఇద్దరూ ఇద్దరే, ఏం దొరికారురా బాబూ… అసలు పాటే జైబాలయ్య… మరి బాలయ్య సినిమా అంటే మితిమీరిన స్వోత్కర్ష, వంశకీర్తన, సూపర్ హీరో పోకడ, ఎట్సెట్రా ఉండాల్సిందే కదా… ఈ వయసులోనూ, వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నా సరే, అదే స్టయిల్, తను మారడు… మారలేడు…
మా బాలయ్యకు ముసలితనం వచ్చేసింది… మూమెంట్స్ కష్టమవుతున్నయ్… పర్లేదు, ఏదో కష్టపడ్డాడు పాపం… ఓచోట ఓ చేత్తో కళ్లద్దాలను కాస్త పైకి జరిపి, మరో చేత్తో అవే కళ్లద్దాలను కాస్త కిందకు జరిపితే అది స్టెప్… మరోచోట వరుసగా షర్టులన్నీ ఎవరో వెనుక నుంచి లాగేస్తుంటారు, అన్ని షర్టులు అలా ఎందుకేసుకొచ్చాడో మరి… మరేమనుకున్నారు..? జైబాలయ్యా… (నిజానికి అఘోరా టైపు పాత్ర, ఆ గాంభీర్యం, ఆ టెంపో సినిమాలో అలాగే కంటిన్యూ అయిపోతే బాగుండేదేమో… మరీ ఇలాంటి రొటీన్, మసాలా, ఫార్ములా, మీనింగ్ లెస్ పాటలతో కథాగమనం డైల్యూట్ అయిపోదా..?) ఇక ఈ పాట సంగతికొస్తారా..? చదివి, కింద పడిపోను అనే ధైర్యముంటే చదవండి…
Ads
కియా కియా జాదూ కియా.., దియా దియా దిల్ దేదియా…,
మయ్యా, మయ్యా, మామా మియ్యా… అయ్యా బాలయ్యా…
తియ్యా, తియ్యా, గారాలయ్యా.., తయ్యా, తయ్యా, తయారయ్యా, అయ్యా బాలయ్యా…
హొయ్యరో హొయ్యా… ముద్దుల మామయ్యా…
కొబ్బరి కాయా కొట్టనా బావయ్యా… కత్తులే దూసే కృష్ణదేవరాయా…
కళ్లతో చేసే కృష్ణుడంటి మాయ… మత్తుగా చూస్తే పోయినాది సోయా…
మొత్తంగా నీకే నేను పడిపోయా… కాళ్లా గజ్జా కంకాళయ్యా… ఏగు చుక్కే ఎలగాలయ్యా…
య్యా, య్యా, జై బాలయ్యా… కాలు కదిపి స్టెప్పేయి అబ్బాయా…
యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా…
(అస్సలు ఏం పాడబడిందో కూడా తెలియని మరో వాక్యం కూడా చివరలో ఉంది)
అసలు రేకు డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్టు… థమన్ మ్యూజిక్ కూడా ఇలాగే ఉంది… చాలాచోట్ల అసలు ఆ తెలుగు పదాలేమిటో అర్థమే కాలేదు… ఆ పాడిందెవరో గానీ… తల్లి… అమ్మా.., నీ గాత్రానికి హేట్సాఫ్… హహహ… అనంత శ్రీరాం రాసిన పదాలకు, వాక్యాలకు పొంతన ఉండదు, అర్థమే ఉండదు, ఏ వాక్యం ఎందుకు రాసిండో తనకే తెలియదు… జస్ట్, ప్రతి వాక్యం చివర యా లేదా య్యా అని అంత్యప్రాస రావాలి, నడుమ నడుమ జై బాలయ్యా రావాలి… అంతే… అదొక్కటే సూత్రం… మధ్యలో ఆమె కొబ్బరికాయ కొట్టుడేందో ఎంతగా జుత్తు పీక్కున్నా ఓపట్టాన సమజ్ కాదు… కాళ్లగజ్జా కంకాళమ్మా అని చిన్నప్పుడు పాడుకునేవాళ్లం కదా, దాన్ను పుంలింగీకరించి కంకాళయ్యను చేసేశాడు ఇక్కడ… సోయిని సోయా చేశాడు… వామ్మో, వామ్మో… వెంటనే ఏగుచుక్క అంటాడు… ఏం ఎలగబెట్టావో ఏమో… రామ రామ, అనంత శ్రీరామా… అసలు థమన్‌కు బాలయ్య మీద ఏదో కక్ష ఉందంటారా..? లేకపోతే ఈ ట్యూన్ ఏమిటి..? ఈ డబ్బా మోత ఏమిటి..? ఈ పాట రాయించిన తీరేమిటి..? కనీసం బోయపాటైనా చూసుకోవాలి కదా… ఆ పాటి తీరిక కూడా లేదా మాస్టారూ..!?
Share this Article