దగ్గుబాటి సురేష్… రామానాయుడి కొడుకు… నిర్మాత, ఫైనాన్షియర్, వ్యాపారి, స్టూడియోల ఓనర్, థియేటర్ల సిండికేట్ మెంబర్… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద తలకాయ… చాలా తెలివైన ఇంటర్వ్యూ ఇచ్చాడు… చతురుడైన ప్యూర్ వ్యాపారి… కర్ర విరగొద్దు, పాము చావాలి… సూటిగా మనసులో ఉన్నది చెప్పొద్దు, కాగల కార్యం జరిగిపోవాలి… ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో ఇండస్ట్రీకి నష్టం అని సూటిగా చెప్పడు, ప్రభుత్వంతో ఏదో మిస్ కమ్యూనికేషన్ ఉందంటాడు… అసలు కమ్యూనికేషన్ లేకపోవడం ఏమిటి..? మిస్ కమ్యూనికేషన్ ఏమిటి..? మరో పెద్ద తలకాయ చిరంజీవి, ఇంకో స్టూడియో తలకాయ నాగార్జున, ఇంకొందరు వెళ్లి నేరుగా సీఎం జగన్‌నే కలిశారు కదా ఆమధ్య… జగన్‌కు ఇండస్ట్రీ పెద్దల పోకడల మీద, తన పట్ల వాళ్లు చూపే అనాదరణ పట్ల, తన ప్రత్యర్థి చంద్రబాబు మీద వాళ్లకున్న ప్రేమ మీద ఓ ఫిక్స్‌డ్ ఒపీనియన్ ఉంది… అలాగని ఇండస్ట్రీ గొంతు పిసికేయడం కాదు, ఫర్దర్‌గా ఇంకేదో చేస్తాడు… (అసలు సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం, ధరలు- రేట్లు ఆ వ్యాపారుల ఇష్టం అనే వాదన తప్పు… రెగ్యులేషన్ లేకపోతే ఇక ప్రభుత్వం దేనికి..? ప్రతి వ్యాపారం మీద ప్రభుత్వ నిఘా, కట్టడి, ఆంక్షలు, పరిమితులు తప్పనిసరి… కాకపోతే మరీ ఇండస్ట్రీని చంపేసే స్థాయిలో నిర్ణయాలు ఉంటే అభ్యంతరకరం… అదే ఇప్పుడు చర్చనీయాంశం…)
ముందుగా ఆన్‌లైన్ అమ్మకాలు స్ట్రీమ్ లైన్ చేస్తాడు, ఆల్‌రెడీ తన గుప్పిట్లోకి వచ్చేశాయి… బెనిఫిట్ షోలను బొందపెట్టేస్తాడు, రూల్స్ వచ్చేశాయి… అవి ఫ్యాన్స్‌ను దోపిడీ చేసి, హీరోలకు దోచిపెట్టే షోలు… ఫ్యాన్స్ బలహీనతను సొమ్ము చేసుకోవడం… ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీ లేదు… అందుకే దీని మీద నిర్మాతలు ఎవరూ కిక్కుమనడం లేదు… నాలుగు షోలు మాత్రమే అనేదీ సమంజసమే… ఎటొచ్చీ ఇండస్ట్రీ బాధ ఏమిటంటే..? రేట్లు… ప్రభుత్వమే టికెట్ రేట్లు ఖరారు చేస్తే ఎలా..? సురేష్ కూడా అదే అంటున్నాడు… ఏ సెంటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు వోకే… బీ, సీ సెంటర్లలో రేట్లే మరీ తక్కువగా ఉన్నాయని..! ఆ సెంటర్లలో వేల థియేటర్లను ఓ సిండికేట్‌గా మార్చి ఇష్టారాజ్యంగా రేట్లు పెట్టేశారు కదా… అదుగో, అక్కడ పడుతోంది దెబ్బ…
Ads
నేనిక ఏపీ థియేటర్లలో నా సినిమాలు రిలీజ్ చేయను అని నేరుగా చెప్పడు తను… ఓటీటీలే బెస్ట్ అంటాడు… దృశ్యం-2 అలాగే రిలీజ్ చేశాడు… మరో మూడు సినిమాల్ని ఓటీటీకే ఇచ్చేశాడు… ఇంకో మూడు సినిమాల కథ చెప్పడు… కానీ తన థియేటర్ దందా నడవాలి కదా… (ఓటీటీలు, టీవీ రైట్స్ నిర్మాతలకు ఇప్పుడు పెద్ద భరోసా… థియేటర్ రిలీజ్ లేకపోయినా నిర్మాతకు రిలీఫ్… థియేటర్ దోపిడీ లేనందున ప్రేక్షకుడికీ రిలీఫ్… కానీ అందరూ ఓటీటీల్లో, టీవీల్లోనే చూడరు కదా… సో, థియేటర్ నడవాలి, కానీ అందుబాటులో ఉండాలి… కానీ అది అలా ఉంటే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్‌కు ఏం లాభం..? హైప్ క్రియేట్ చేసి, వారం పది రోజుల్లోనే కుమ్మిపారేయాలి కదా… అందుకే థియేటరూ కావాలి…)
‘‘అఖండ, పుష్ప వంటివి థియేటర్లలోనే చూడాలనుకుంటారు, కానీ పండుగలప్పుడే జనం థియేటర్లకు వస్తున్నారు, ఒకప్పుడు అయిదారొందల థియేటర్లు అడ్జస్ట్ చేస్తే సరిపోయేది, ఇప్పుడు అందరూ 1500 థియేటర్స్ కావాలంటున్నారు’’ అంటాడు సురేష్… అవును మరి, పండుగలపూట జనం కర్చు చేస్తారు, ఒకేసారి వేల థియేటర్లలో ఒకే బొమ్మ వేసి, ప్రేక్షకుల జేబులు కట్ చేస్తే సరి… ఆ సినిమాను పండుగ తెల్లవారే ఎత్తిపారేసినా సరే, నిర్మాత సేఫ్, డిస్ట్రిబ్యూటర్ సేఫ్, థియేటర్ ఓనర్ సేఫ్, హీరో ట్రిపుల్ సేఫ్, ప్రేక్షకుడు మాత్రం ఖల్లాస్… కానీ సురేష్ ఇంటర్వ్యూలో ఒక్కటి మెచ్చుకోవాలి… ‘‘నేను బిజినెస్ చేస్తాను, డబ్బు జనరేట్ చేయాలి’’… అవును… సత్యం… ఆలోచనలు, అడుగులు అన్నీ సేమ్ అలాగే… ఏపీలో ఓ స్టూడియో, ఆస్తులు… తెలంగాణలో ఓ స్టూడియో, ఆస్తులు… ప్రభుత్వాలతో ‘‘మంచి కమ్యూనికేషన్’’ కావాలి… అదే సమయంలో ఓటీటీలు, థియేటర్లు, తన సొంత సినిమాల బిజినెస్ సమన్వయమూ కావాలి… అందుకే ఆచితూచి పదాలు వాడాడు… 15 నెలల్లో కేంద్రం, రాష్ట్రం ఏమీ చేయలేదు అంటాడు, సినిమా ప్రైవేట్ వ్యాపారం అయినప్పుడు ప్రభుత్వాలు మాఫీలు, సబ్సిడీలు ఎందుకు ఇవ్వాలి సారూ..? అది జనం సొమ్ము కాదా… అదనంగా బెనిఫిట్ షోలు, అడ్డగోలుగా రేట్లతో హీరోలు, స్టార్ దర్శకులు ఇంకా బలిసిపోవాలా..? కరెంట్ బిల్లులు మీకు మాత్రమే ఎందుకు రద్దు చేయాలి… కరోనా టైంలో దాదాపు ప్రతి రంగం దెబ్బ తిన్నది… సో, ఇది పెద్ద సబ్జెక్ట్… దగ్గుబాటి అలాగే మాట్లాడాలి, సినిమా బిజినెస్ అంటే అంతే మరి… తప్పదు…!! కిక్కు దిగిపోతున్నా, కిక్కుమనలేని స్థితి…!!
Share this Article