ఫేస్‌బుక్‌లో ఓ మిత్రురాలు ఉవాచ… ఎవరి మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు, అనర్హుల మరణానికి నివాళీ అక్కర్లేదు..! యుద్ధాల్లో మినహా… మనకు నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా మరణించినప్పుడు సంతాపం ప్రకటించడం, మరీ నచ్చని వ్యక్తి అయితే నిశ్శబ్దంగా ఉండటం..! కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుజనం ధోరణి విస్తుగొలుపుతోంది… ఎవరైనా సెలబ్రిటీ మరణిస్తే తన కులాన్ని బట్టి, తన రాజకీయ భావజాలాన్ని బట్టి, వ్యక్తిత్వాలు అంచనా వేయబడుతున్నయ్, వృత్తిలో ప్రతిభకు కొత్త కొలతలు వేయబడుతున్నయ్… కటువైన విమర్శలు పోస్టవుతున్నయ్… మళ్లీ వాటిపై ఖండనలు, వాదనలు, ప్రతివాదనలు, ఆవేశకావేషాలు… తాజాగా సిరివెన్నెల మరణం మీద కనిపిస్తున్న కొన్ని పోస్టులు, విమర్శలు, దానికి కౌంటర్లు, ఆగ్రహప్రకటనలన్నీ అవే…
ఆయన ఆర్ఎస్ఎస్… సో వాట్..? అందరికీ ఉన్నట్టే ఆయనకూ ఓ భావజాలం నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు… ఆయన్ని వ్యతిరేకించే వాళ్లకు భావజాలాలు లేవా..? ఫలానా భావజాలం ఎవరికీ ఉండొద్దని నిషేధాలేమైనా ఉన్నాయా..? ఆయన బ్రాహ్మడు… సో వాట్..? దేవుడిని అడుక్కుని ఆ కులంలో పుట్టాడా..? బ్రాహ్మణజాతి గతంలో చేసిన ప్రతి పనికీ ఈయన ఇప్పుడు బాధ్యత వహించాలా..? అదీ ఈ లోకం విడిచిపెట్టి వెళ్తున్నవేళ..! నో, నో, అలాంటోళ్లకు నివాళులే అక్కర్లేదు అంటారు కొందరు… దానికీ బోలెడన్ని లోతైన సైద్ధాంతిక సమర్థనలు… నివాళులేం అక్కర్లేదు సరే, కానీ సందర్భశుద్ధి అవసరం లేదా..?
Ads
ఒకదానితో ఒకటి ముడేయాలా..? ఎస్, సిరివెన్నెల పాటల మీద అభ్యంతరాలు ఉన్నవాళ్లు కూడా బోలెడు మంది… వేటూరి, సినారె, ఆత్రేయ తదితరుల్లాగే ఆయన కూడా బోలెడు చెత్త రాసి తెలుగు ప్రేక్షకుల మీద గుమ్మరించాడు… అంతెందుకు, మొన్నటి సామజవరగమనా అనే పాట ఆయన సినీజీవితంలోకెల్లా పెద్ద బ్లండర్.., తన ఖ్యాతిని, తన పాటను, తన విద్వత్తును తీసుకెళ్లి ఓ నటి కాళ్లకు సమర్పించేశాడు… అసలు సామజవరగమనా అనే పదాన్ని ఓ కథానాయికకు వర్తింపజేయడమే అబ్సర్డ్… గతంలోనే… పుచ్చుకుంటాలే నీ పూతరేకు, విచ్చుకుంటా గానీ వీడిపోకూ వంటి వెగటు వాక్యాల్నీ రచించాడు… సో వాట్… పాట అంటే ఒక్క రచయిత బాధ్యతేనా..? సంగీతదర్శకుడు, దర్శకుడి టేస్ట్, కథ, సందర్భం, హీరో గాడి ఇమేజీ, హీరోయిన్ పాపులారిటీ, ఆ సినిమా స్థాయి గట్రా చాలా ఈక్వేషన్స్‌తో… ఏదో దిక్కుమాలిన ట్యూన్‌లో అవసరమైన కొన్ని పదాలు ఇరికించడమేగా… కానీ ఈ పోస్ట్‌మార్టం ఇప్పుడేల..? ఇదేనా సందర్భం..? అదంతా ఆయన బతికి, మంచి ఊపుమీద ఉన్నప్పుడే సాగించాల్సిన తంతు కదా..!!
ఆయన రాసిన ప్రతిపాటా హృదయనివేదన కాదు, ఆయన తత్వానికి అద్దం పట్టేది కాదు… సినిమాను బట్టి, పాత్రను బట్టి అల్లబడిన పదాలు, వాక్యాలు… కానీ మథనం తప్పదు, ప్రసవవేదన తప్పదు… కడుపు కోసమే కావచ్చుగాక, కానీ ప్రయాస లేకుండా ఏ ప్రసవమూ సాధ్యం కాదు… కొన్ని అందరికీ నచ్చొచ్చు, కొన్ని ఎవరికీ పట్టక కాలగతిలో కొట్టుకుపోవచ్చు… ప్రతి సినిమా రచయితా చెప్పినట్టే తనూ చెప్పాడు, నాకు పూర్తిగా సంతృప్తి అనిపిస్తే తప్ప పాట బయటికి రాదు అని… సినిమా సాహిత్యాన్ని అసలు సాహిత్యంగానే గుర్తించరు, తెలుగు సినిమా కవిని అసలు కవిగానే గౌరవించరు అనే అసంతృప్తి కూడా ఆయనలో ఉండేది… అవన్నీ ఆయన వ్యక్తిగతం, ఆ చర్చ ఇక్కడ అక్కర్లేదు… బహుశా అందుకే ఆ ఆత్మఘోష కోసమే శివకావ్యం మొదలుపెట్టి ఉండొచ్చు… తను అనుకున్నట్టు మొత్తం వంద పద్యపాదాలు గనుక పూర్తయి ఉంటే, బాగుండేది… కానీ ఇవన్నీ వేరు… ఒక వ్యక్తి పుట్టుక నేపథ్యాన్ని బట్టి, తన బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి తన ప్రతిభను తూలనాడటం, మనిషే మాయమైపోతున్నవేళ ఖండనమండనలు ఓ విపరీత ధోరణే…!!
Share this Article