అందుకే మరి అప్పుడప్పుడూ కొందరు దర్శకుల తెలివితక్కువతనం, పైత్యం మీద చిరాకెత్తేది… తెలివితక్కువతనంలో బోయపాటి కూడా తక్కువోడేమీ కాదు… అఖండలో ఓ సీన్ ఏమిటంటే..? కలెక్టర్ కేరక్టర్ శరణ్య (ప్రజ్ఞా జైస్వాల్)ను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ పల్లెటూరిలో పుట్టించాడు కథకుడు… అసలు ఆ కలెక్టర్ పాత్ర తెలంగాణలోనే ఎందుకు పుట్టాలి..? ఎందుకంటే సినిమా తెలంగాణలోనూ కూడా నడవాలి, తెలంగాణను ఇగ్నోర్ చేసినట్టు ఉండకూడదు, అసలే ఈమధ్య ట్రెండ్ తెలంగాణ పాటలు, పదాలు, పాత్రలు… పైగా తెలంగాణలోనే టికెట్ల రేట్లు ఎక్కువ… పాన్ ఇండియా తరహాలో పాన్ తెలుగు అన్నమాట… సరే, ఆ కలెక్టర్ ఓ రైతును చూసి తొలిచూపులో ఢమాల్ అని హీరో ప్రేమలో పడిపోతుంది… సరే, వోకే… పడితే పడిపోయింది… సినిమా అన్నాక లాజిక్కులు వెతికితే ఎలా..? అందులోనూ బాలయ్య సినిమా…
ఇద్దరూ కలిసి పొలం గట్లవైపు వెళ్తారు… కల్లు తాగుదాం అని హీరోయిన్ అంటే హీరో ఉహూ అంటాడు… అరె, అది మందు కాదుర భయ్, మెడిసిన్, అది మా ట్రెడిషన్ అని పద్దతిగా చెబుతుంది హీరోయిన్… (ఎస్, కల్లును ఓ ట్రెడిషన్‌గా చెప్పుకోవడానికి సగటు తెలంగాణవాసికి ఏ మొహమాటమూ అక్కర్లేదు, ఓ మోతాదు వరకూ అది మంచిదే కూడా…) ఎహె, కూర్చో అని హీరోను ఆ గట్టు మీద కూర్చోబెడతది… కల్లు గీత కార్మికుడు వస్తాడు, రాకె బాలయ్య చేతికిస్తుంది… ఇక కల్లు బింకి తనే తీసుకుని, హీరో పట్టుకున్న రాకెలో ఒంపుతుంది… (ఏమాటకామాట ప్రజ్ఞాకు డబ్బింగ్ చెప్పినవాళ్లెవరో గానీ తెలంగాణ యాక్సెంట్ పర్‌ఫెక్ట్‌గా పలికారు) బాలకృష్ణ గుటగుట కల్లు తాగినాక హీరోయిన్ సదరు కల్లుగీసే పాత్రధారి (కమెడియన్ చమ్మక్ చంద్ర)ని తొక్కు ఉందా అని అడుగుతుంది…
Ads
తొక్కు అనే పదం తెలియనట్టు చూస్తాడు చంద్ర… మామిడికాయ తొక్కు అని మళ్లీ చెబుతుంది హీరోయిన్… ఓహో, ‘‘ఆవకాయ బద్దా’’ అంటాడు చంద్ర… మామిడికాయ తొక్కును ఇదుగో ఇలా నాకాలి అని కూడా ప్రజ్ఞ చెబుతుంది హీరోకు… అప్పుడు చమ్మక్ చంద్రతో ‘‘నాకండి, నాకండి’’ తరహాలో బూతు డైలాగులు కూడా అనిపిస్తాడు డైలాగ్ రైటర్, దర్శకుడు… కల్లు సీన్‌ను ఎంజాయ్ చేసే ప్రేక్షకుడికి ఒక్కసారిగా వెగటు పుట్టించేస్తారు… ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే..? కల్లు కేవలం తెలంగాణ ట్రెడిషనా..? ఇతర ప్రాంతాల్లో కల్లు తెలియదా..? ఊరందరికీ బుద్దులు చెప్పి, పంచాయితీలు తప్శా చేసే ఊరిపెద్దకు కల్లు తెలియదా..?
అన్నింటికీ మించి… భావదరిద్రం ఏమిటంటే..? ప్రజ్ఞ తెలంగాణలో పుట్టింది, తొక్కు ఉందా అనడిగింది, వోకే… చమ్మక్ చంద్ర పాత్రధారికి తొక్కు అంటే తెలియదా..? తొక్కు ఆంధ్రా, సీమ, తెలంగాణల్లో ఎక్కడైనా తొక్కే కదా… ఓహో, ఆవకాయ బద్ధా అనడిగిపిస్తాడు డైలాగ్ రైటర్… ఓహ్, సీమలో తొక్కు తెలియదట, ఆవకాయ అంటేనే అర్థమవుతుందట… పెరిఫెరల్‌గా చూస్తే ఏదో సరదా సీన్, ఎవడో రాశాడు, ఎవరో తీశాడులే అన్నట్టుగా ఉన్నా… కాస్త నిశితంగా పరిశీలిస్తే డైలాగ్ రైటర్‌కు కల్లు, గుడాలు, తొక్కులు, సీకుల గురించి… ఏమీ తెలియదని లెక్క… పైగా ఆంధ్రా, తెలంగాణ నడుమ ఏదో కల్చరల్ డిఫరెన్స్ తనేదో బాగా పట్టుకోగలిగినట్టు, చూపించగలిగినట్టు డైలాగులు, నడుమ బూతులు… ఎందుకొస్తర్ర భయ్… ఈ డైలాగ్ రైటర్ ఎవరో తెలుసుకుందామని కాస్త ట్రై చేసి, విఫలమై పోయా గానీ… ప్చ్, నాకు ఇంకో దమ్ము పోయి గౌడ్ భయ్… తొక్కు ఉంది కదా..!!
Share this Article