గ్రాండియర్..! కొన్ని ఇంగ్లిష్ సినిమాలు చూస్తుంటే ఈ చిత్రీకరణ, ఈ పర్‌ఫెక్షన్, ఈ భారీతనం మనవాళ్లకు ఎందుకు చేతకావు అనిపిస్తుంది కొన్నిసార్లు… బాహుబలి వంటి అట్టముక్కల సెట్టింగులు, గ్రాఫిక్కుల మాయలు, కొబ్బరి చెట్ల స్ప్రింగు అస్త్రాలు వదిలేయండి కాసేపు… దాని మార్కెట్ ఇంటర్నేషనల్, కానీ క్వాలిటీలో అంత సీన్ లేదు… పోనీ, ప్రాంతీయ సినిమా ఖర్చు, పెట్టుబడి, తిరిగి వచ్చే డబ్బు పరిమితం కాబట్టి, ఆ లెక్కల్లో భారీతనం రిస్క్ అనుకుందాం… అది కూడా గతం… ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాయే కదా, పలు భాషల్లోకి డబ్ చేసేసి, బహుభాషాచిత్రం అని ముసుగులేసి వదిలేస్తున్నారు… ఓటీటీ, ఓవర్సీస్, టీవీ, థియేటర్ రైట్స్ పేరిట బోలెడు రెవిన్యూ వస్తోంది… రీచ్ పెరిగింది… పెద్ద పెద్ద ప్లేయర్స్ ఫీల్డ్‌లోకి ఎంటరవుతున్నారు… ఇవి వదిలేసినా హిందీ సినిమా మార్కెట్ ఎక్కువే కదా… వాళ్లకు పెట్టిన డబ్బు వాపస్ వచ్చే చాన్స్ ఎక్కువ ఉంది కదా… వాళ్లు కూడా పెద్దగా రిస్క్ తీసుకోరు దేనికో…!
ఈ ఆలోచనల నడుమ మరక్కర్ సినిమా ఓ విశేషం అనిపించింది… కొన్ని సీన్ల చిత్రీకరణలో దర్శకుడు ప్రియదర్శన్ సినిమాను ఎక్కడికో తీసుకుపోయాడు… అసలు కథాకాలమే పదహారో శతాబ్దం… పోర్చుగీసుల దాడి నుంచి కొబ్బరి తీరాన్ని కాపాడటానికి జరిగిన పోరాటమే కథ… సముద్రంపై యుద్ధాలు… కుట్రలు, కుతంత్రాలు… ఎత్తుగడలు… సీన్లు, బీజీఎం కొన్నిచోట్ల కళ్లప్పగించేలా చేస్తయ్… కానీ మంచి థియేటర్ అయితేనే ఈ ఫీల్… పెద్ద స్క్రీన్, మంచి క్వాలిటీ వీడియో, సౌండ్ ఉంటేనే… ఈ సంవత్సరం మూడు జాతీయ అవార్డులు ఆల్‌రెడీ కొట్టేసింది… బెస్ట్ ఫీచర్ ఫిలిమ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ విభాగాల్లో ఈ అవార్డులు… అయిదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు… తెలుగులో ఈరోజు రిలీజైంది…
Ads
భారీతనం చిత్రీకరణలో మాత్రమే కాదు… ఎంచుకున్న కథలోనే కాదు… ఖర్చులో కూడా ఎక్కడా రాజీపడలేదు, తారాగణం ఎంపికలోనూ అంతే… మోహన్‌లాల్ అబ్బాయి ప్రణవ్, ప్రియదర్శన్ అమ్మాయి కళ్యాణితోపాటు మోహన్‌లాల్, అర్జున్, కీర్తిసురేష్, మంజూ వారియర్, సునీల్ శెట్టి, సుహాసిని, ప్రభు… జే జక్రిత్ అనే ఓ చైనీస్ యాక్టర్… ఇలా బోలెడు మంది… ప్రత్యేకించి తమిళ, మలయాళ తారలు… ఏక్‌సేఏక్ నటనా ప్రావీణ్యం ఉన్నవాళ్లు… ఏ ఎమోషనైనా సరే, ఏ పాత్రయినా సరే అలవోకగా చేయగలిగేవాళ్లే… ఒక దశలో నాగార్జున కూడా ఈ సినిమాలో నటిస్తాడని వార్తలొచ్చాయి, ఎందుకో తను ఆగిపోయాడు… హీరోను అద్భుతంగా ఎలివేట్ చేయగల పాత్ర… దాదాపు వంద కోట్ల అంచనా వ్యయం… మంచి పేరున్న 24 క్రాఫ్ట్స్ నిపుణులు… నిజానికి సినిమా అదిరిపోవాలి… కానీ..?
కథ దగ్గరే దెబ్బకొట్టింది… అసలు కథకు సహజంగానే కొంత క్రియేటివ్ లిబర్టీ తీసుకుని దర్శకుడు చాలామేరకు తన సొంత సీన్స్, ట్విస్టులు యాడ్ చేసుకున్నాడు… Troy నుంచి స్పూర్తి పొందిన కంటెంటు బాగా కలిపేశాడు… ఎక్కువ మంది అయిపోయారు, ఏ పాత్ర కేరక్టరైజేషన్ బలంగా పడలేదు… కథను కూడా హడావుడిగా నడిపించడంతో సినిమా మీద ఆసక్తి సన్నగిల్లేలా చేశాడు దర్శకుడు… ఇక్కడ జాగ్రత్త వహించి ఉంటే సినిమా ఓ రేంజులో హిట్ కొట్టేదేమో… ఐనా సరే, ఇప్పటికీ మంచి స్క్రీన్ ప్రొజెక్షన్, మంచి సౌండ్ సిస్టం ఉన్న మంచి థియేటర్లలో ఈ సినిమా చూడటం ఓ అబ్బురమే..!!
Share this Article