ఇప్పుడంతా సిరివెన్నెల పాటల మీద దుమారం నడుస్తోంది కదా… నిజానికి మనమూ చెప్పుకున్నాం… సినిమా పాట దాన్ని రాసే కవి కోసం కాదు, తన సొంత ఘోష కూడా కాదు… సినిమాలో ఒక సందర్భం కోసం, కథానుగుణంగా రాయబడే పాట… దర్శకుడి టేస్ట్, కథ డిమాండ్, హీరో ఇమేజీ, సీన్ ఇంపార్టెన్స్, సంగీత దర్శకుడి సహకారం వంటివి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప ఏ సినిమా కవీ తన కవిత్వాన్ని గుమ్మరించడం కోసం రాయడు సినిమా పాట… సిరివెన్నెల పాటలనూ ఇంతకు భిన్నంగా చూడాల్సిన పనిలేదు, కాకపోతే మంచి పదాలు, సందర్భానుగుణ వ్యక్తీకరణకు ఆయన పడిన తపనను మెచ్చుకోవచ్చు… మనం ఇటీవల చెప్పుకుంటున్నాం కదా, ఏ పాటయినా సరే సందర్భోచితంగా ఉండాలి, పాత్రోచితంగా ఉండాలి, సహజంగా ఉండాలి అని… అంతేకాదు, దర్శకుడు చెప్పే కంటెంటుకు సరిగ్గా సూటవ్వాలి పాట… ఈ కోణంలో సిరివెన్నెల రాసిన రెండు పాటల మీద మిత్రుడు Chakradhar Rao.. ఏమంటాడంటే…
‘‘ఇందాక సిరివెన్నెల గారి పాటలు వింటూంటే.. జగమంత కుటుంబం నాదీ అనే పాట మళ్ళీ చెవిన పడింది. ఈ పాట, అర్థం , అంతరార్థం.. ఫిలాసఫీ చాలామందికి ఇష్టం. ఒకరకంగా మహా తపస్సు తరవాత అయ్యే జ్ఞానోదయం తాలూకు ఆనంద విస్పొటనంలో ప్రపంచం, సకల ప్రాణులూ జీవ నిర్జీవులూ ఈ చరాచర సృష్టి, అనంత విశ్వం, విశ్వంలోని శూన్యం.. అన్నింటినీ తనలో కలిపేసుకునే కాలం, అన్నీ తానే అనిపించే అద్వైత స్థితిని తెలిపే సాహిత్యం… కానీ ఈ పాట పెట్టిన సినిమా, సినిమా కథ ప్లస్ సందర్భం అంతా అందుకు విరుద్దం… కాన్సర్‌తో చావబోతున్న హీరోతో దీనంగా పాడించి.. ఒక సానుభూతి పాటని చేసేశారు. సినిమా పర్పస్ సాల్వ్ అవుతుంది కాని.. ఆ సాహిత్యం పర్పస్ అది కాదు… ఎక్టసీ ఇవ్వాల్సిన పాట ఏడుపు పాట అయిపోయింది. ఒకానొక మిత్రుడు దీన్ని ఏడుపుగొట్టు పాట కింద లెక్కేశాడు.
Ads
అలాగే … జానూ సినిమాలో లైఫ్ ఆఫ్ జానూ పాట, మళ్ళీ సీతారామశాస్త్రి గారే రాశారు. తమిళ మాతృకలో హీరో ఒంటరివాడా కాదా, పెళ్లైందా లేదా అనేట్టు మచ్చుకయినా కనపడకుండా… చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నాడూ అన్నట్టుగా ఉంటుంది. ప్రకృతిలో మమేకమై, ఇంటెన్స్‌గా జీవించే మనిషిగా పరిచయం అవుతాడు. తరవాత కథలో అతడి ఒంటరితనం… లవ్ స్టోరి వస్తుంది.. అదే తెలుగు సినిమాకి వచ్చేసరికి….. నేను ఒంటరిని అని అడక్కండీ.. అంటూ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లాగా ధ్వనిస్తుంది.. ఐతే రాసిన సాహిత్యం ఉద్దేశ్యం అది కాదు. కాని కథాపరంగా ఆ ఉద్దేశ్యం వచ్చేసింది. అలాగే ఆ ట్యూన్, ఆ టోన్ కూడా ఒక నైరాశ్యత కలిగి ఉండటం వల్ల మాతృకలోని ఉద్దేశ్యం ప్రకటన కాలేదు తెలుగులో… !! మీరేమంటారూ..??
Share this Article