ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో కొణిజేటి రోశయ్య కన్నుమూశాడు..! నిజానికి చాన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం కుదురుగా లేదు… వార్ధక్యంతోపాటు వచ్చే సమస్యలే… ప్రతిసారీ ఒక ప్రశ్న కదలాడుతూ ఉంటుంది మన మెదళ్లలో…! ఆయన ఎన్‌జీరంగా శిష్యుడు, ఫిఫ్టీస్‌లోనే కామర్స్‌లో డిగ్రీ.., ఆంధ్రా ఉద్యమం… సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకుంటాడు, చదువుతాడు, పరిస్థితులకు సరిగ్గా అన్వయిస్తాడు… కాస్త వ్యంగ్యాన్ని రంగరించి, ప్రత్యర్థుల మీదకు వదిలేస్తాడు… ఇక జవాబు ఏమివ్వాలో తెలియక ఎదుటోడు గిరగిరా కొట్టుకోవాలి… 15 సార్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తను ఆర్థికమంత్రి… ఒక దశలో వరుసగా ఏడుసార్లు…!! కాంగ్రెస్ సీఎంలు ఎవరైతేనేం, ఆర్థికం అనగానే రోశయ్యే… ఏ క్లిష్టమైన సబ్జెక్టు అయినా సరే, ఫైల్ రోశయ్య దగ్గరికి పంపించబడేది… అంతటి సీనియర్, అంతటి పరిణతి ఉన్న రోశయ్య ఓ బలమైన లీడర్‌గా ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు… ఇదీ కాస్త ఇంట్రస్టింగ్ ప్రశ్న…
అందరివాడిలా ఉండాలి, గ్రూపులు లేవు… ఎవరితోనూ కక్షల్లేవు… పొలిటికల్ కరప్షన్, అక్రమ సంపాదనలో కక్కుర్తి లేదు… వారసత్వాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు లేవు… ఆయన అచ్చంగా ఓ సగటు షావుకారు… దేనికైనా లెక్క ఉండాలి, ఖర్చులో పొదుపు ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ప్రతి పైసా ఖర్చుకు ఏదైనా పనికొచ్చే ప్రయోజనం ఉండాలి… చివరకు డబ్బులు ఏట్లో వేసినా ఎంచి వేయాలనేవాడు… వర్తమాన రాజకీయ అపసవ్య పోకడలకు దూరం… అనవసర వివాదాల్లో వేళ్లు, కాళ్లు, తల దూర్చేవాడు కాదు… రాజకీయంగా వేర్వేరు క్యాంపుల్లో ఉన్నా సరే, ఇతర పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలే ఉండేవి, వ్యక్తుల్ని గౌరవిస్తాడు, గౌరవం ఆశిస్తాడు… సో… నో ఫ్యాక్షన్స్… సీఎం ఎవరైనా సరే, ఎస్ సార్… దీంతో ఆయన ఎప్పుడూ రెండో శ్రేణిలోనే ఉండిపోయాడేమో… అఫ్‌కోర్స్, వైఎస్ మరణించినప్పుడు ఓ తాత్కాలిక సర్దుబాటుగా ముఖ్యమంత్రిని చేశారు తప్ప ఆయనపై హైకమాండ్‌కు పెద్ద ఆశలేమీ లేవు… ప్రేమ అంతకన్నా లేదు… ఆయన కులం కూడా ఆయనకు ప్రతికూలం అయ్యిందేమో… కుర్చీ అనగానే ఇక్కడ ఎంతసేపూ ఆ రెండు కులాలే కదా… వేరేవాళ్లకు చాన్సేముంది..?
Ads
ఎడాపెడా అప్పులు తేవడం, ప్రజలకు ఉదారంగా పంచిపెట్టడం పట్ల ఆయన విముఖుడు… సంక్షేమ వ్యతిరేకేమీ కాదు, కానీ ఖజానా నుంచి ఖర్చయ్యే ప్రతి పైసాకు దీర్ఘకాల ప్రయోజనాలు ఉండాలనే ధోరణి… వైఎస్ పథకాలను కూడా పలుసార్లు ఆంతరంగికంగా వ్యతిరేకించేవాడు… కానీ తప్పనిసరై ఆ పథకాలకు ఎలాగోలా డబ్బు సర్దేవాడు… మంచి ఆర్థికవేత్త వంటి పెద్ద పదం అక్కర్లేదేమో గానీ… రోశయ్య ఓ మంచి, సమర్థుడైన ఫైనాన్స్ మేనేజర్…
సోనియా జగన్‌ను ఓ తలనొప్పిగా భావించడం, తనకు వైఎస్ వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి కావాలంటూ జగన్ పట్టుపట్టడం, సొంత పార్టీ ప్రయత్నాల్లో పడటం, ఈలోపు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తెలంగాణ ఇష్యూను ఓ డైవర్షన్ టాక్టిస్‌లా తెరపైకి తీసుకురావడం, జగన్ మీద కేసుల వల విసరడం… ఈ తెలుగు రాజకీయ కీలక సంధి దశలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓ ప్రేక్షకపాత్రే పోషించాల్సి వచ్చింది… హైకమాండ్ చెప్పగానే అయిదే నిమిషాల్లో ప్రెస్‌మీట్ పెట్టేసి, తాను సీఎం పోస్ట్ నుంచి వైదొలుగుతున్నట్టు చెప్పేశాడు… దీనికి ఆయన సీఎం కుర్చీ మీద కూర్చున్న క్షణం నుంచే రెడీగా ఉన్నాడు… కాంగ్రెస్ వ్యవహారాలన్నీ ఔపోసన పట్టినవాడే కదా… కానీ అణకువ- విధేయత ఆయన బలం… అదే ఆయన బలహీనత కూడా… పార్టీ మారలేదు… ఆయన ఎవరి వాడూ కాదు, సేమ్ టైం, ఎవరికీ దూరం కాదు… ఏది వస్తే అది రానీ అనుకునే నైజం… అందుకే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయలేదు ఎప్పుడూ…! రాజకీయాల్లోని అవలక్షణాల్ని, విలువల రాహిత్యాన్ని, ప్రమాణాల పతనాన్ని ఎట్‌లీస్ట్, తనకు పూసుకోకుండా, వీలున్నంతలో స్వచ్ఛంగానే బతికి, వెళ్లిపోయిన సేటు గారూ… వీడ్కోలు..!!
Share this Article