- ఒక కొత్త నంబర్ ఫోన్‌లో సేవ్ చేసుకున్నా… తరువాత కాసేపటికే ఆ పేరు, అకౌంట్ ఫేస్‌బుక్‌లో ‘people you may know’ జాబితాలో పదే పదే కనిపించింది…
- ఈమధ్య ఏదో పని అవసరమై ఒక వ్యక్తితో చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చింది… అంతకుముందు పరిచయం కూడా లేదు… ఆ వ్యక్తి పేరు, అకౌంట్ ఫేస్‌బుక్ ‘యు మే నో’ జాబితాలోకి వచ్చేసింది…
- ఏదైనా ఊరికి వెళ్తున్నారా..? మీకు ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు సమీపంలోని మిత్రుల వివరాలు అందుతూనే ఉంటయ్…
- లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించి ఎవరితోనైనా మాట్లాడారా..? కాసేపటికి బోలెడు మంది ఏజెంట్లు మీ నంబర్‌కు కాల్ చేస్తూనే ఉంటారు…
- మీకు ఈ రాత్రి కంపెనీ ఇస్తాను, మీకు లాటరీ వచ్చింది అనే యాడ్స్, కాల్స్ మాత్రమే కాదు… టెంపరరీ కంపానియన్‌షిప్ రేట్లతో సహా వాట్సప్ కాల్స్… ఫోటోలు… ఆఫర్లు, అడ్రెస్సులు…
- చివరకు బ్రాలు, అండర్ వేర్ల యాడ్స్ కూడా…
ఒక్క ముక్కలో చెప్పాలంటే… మన బతుకులు స్మార్ట్ ఫోన్లలో చిక్కుబడిపోయాయ్… ఇది కృత్రిమ మేధ యుగం… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మనల్ని దట్టంగా కమ్మేస్తోంది… మనిషిని కార్పొరేట్ టెక్ ట్రేడర్స్ లోబరుచుకున్నారు ఎప్పుడో… మనకు సంబంధం లేకుండానే మన ఆలోచనలు చదవబడుతున్నయ్, మన అభిరుచులు రికార్డవుతున్నయ్, మన కదలికలు నమోదవుతున్నయ్.., మనం మనంగా లేం, మనం చెప్పుకునే ప్రైవసీ ఓ పెద్ద భ్రమ… గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేయగానే, అలాంటి ప్రొడక్ట్‌కు సంబంధించిన యాడ్స్ మనపై దాడిచేస్తయ్, మనం చదివే సైట్లలో అవే యాడ్స్, మెయిల్స్, వాట్సప్ మెసేజులు… GPS ఆఫ్ చేసినా సరే, కొన్ని యాప్స్‌కు ఎనేబుల్ చేయకతప్పదు… బ్యాక్ గ్రౌండ్ డేటా ఆఫ్ చేసినా సరే, ట్రాకింగ్ ఆగదు…
చివరకు ఫోన్ కాల్స్ కూడా విశ్లేషించబడుతున్నాయంటే, ఫోన్ నంబర్స్ మొత్తం స్కాన్ చేయబడుతున్నాయంటే, మన ఫోన్ల స్మార్ట్‌నెస్ వెనుక, కనిపించని యాప్స్ వెనుక ఎన్నెన్ని కథలో… ఐనా పెద్ద ఆశ్చర్యమేముంది..? బయటికి అడుగు పెడితే చాలు, లక్షల కెమెరాలు, జీపీఎస్ పరికరాలతో చివరకు అంతరిక్షం నుంచి కూడా నిఘా… మన బొంద ప్రైవసీ… బతుకు బజారులో బరిబాతల నిలబడ్డట్టుగా లేదా..?! ఫెగాసస్ లైఫ్..! అంతెందుకు… ఎవరైనా దోస్త్‌తో కలిసి, రహస్యంగా ఎక్కడైనా బార్‌లో కూర్చుని ఏదేని కొత్త విషయం మీద బాతాఖానీ కొట్టండి… మీరు బిల్లు కట్టి బయటికి వచ్చేలోపు ఆ ఫోన్ కాల్స్ ట్రాక్ చేయబడి, ఆ యాడ్స్ మిమ్మల్ని పలకరిస్తయ్… పక్కా… కారణం :: స్మార్ట్ ఫోన్లు..!!
Ads
అసలు మన కాల్స్ ఎవరో వింటున్నారు అనేదే ఆశ్చర్యంగా ఉంటోంది… పోనీ, రోబోటిక్ సిస్టమ్సే వింటున్నాయ్ అనుకుందాం, వాటిని విశ్లేషించి, అవసరమైన నంబర్లు, పేర్లు సేకరించి, రికార్డు చేసి, డేటా ప్రిజర్వ్ చేసి, కార్పొరేట్ యాడ్స్‌కు అమ్మేసుకుంటున్నాయ్… ఇవన్నీ నిజాలే… మనమేమో ఇంకా మన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయ్యింది, ఫేక్ ఖాతా క్రియేటైంది, ఎవడో డబ్బు అడుగుతున్నాడు, ప్లీజ్ ఎంటర్‌టెయిన్ చేయకండీ అని రిక్వెస్టులు పెట్టుకునే దగ్గరే ఆగిపోయాం… సమస్య దానికి అనేక రెట్లు సీరియస్… రేప్పొద్దున నీ భావప్రాప్తి స్థాయిని, వ్యవధిని, టేస్టును కూడా అనలైజ్ చేసి కొన్ని డ్రగ్స్ సజెస్ట్ చేసే యాడ్స్ వస్తే…. హాశ్చర్యపోకండి… మన బతుకులు మనవి కావు… మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్లవి…!!
Share this Article