త్వరలో చచ్చిపోతాం అనే భావన మనిషిలో విపరీతమైన మార్పులకు దారితీస్తుంది… ఒక కుదుపు… కరోనా మరణాల సీజన్‌లో చూశాం కదా… ఎన్ని ఉద్వేగాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని బాధాకర అనుభవాలు… కుటుంబాలకు కుటుంబాలే కుప్పకూలాయి… కరోనా విపత్తు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఫార్మా మాఫియా విశ్వరూపం, ఆసుపత్రుల నిలువుదోపిడీ… బంధాలు కకావికలం… అలాంటిది ఒక ఊరు, ఒక సమాజం, ఒక ప్రాంతం ధ్వంసం అయిపోతుంది అంటే అప్పుడు చెలరేగే ఎమోషన్ల మాటేమిటి..? ఉంటామో, పోతామో అన్నట్టుగా… ఉన్నప్పుడే తిందాం, తాగుదాం అన్నట్టుగా రెచ్చిపోవడమే కాదు… మనుషుల్లో వచ్చే ఎమోషనల్ మార్పులెలా ఉంటయ్..? బ్రహ్మాండమైన ప్లాట్ కదా… సరిగ్గా తీయగలిగితే వెండితెరకు ఎంత చక్కటి కథ… రొటీన్ చెత్తా సినిమా కమర్షియల్ కథల నడుమ ఎంత భిన్నమైన కథ… కదా… కానీ స్కైలాబ్ అనే సినిమా దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఆ కథను చక్కగా ఎంచుకున్నాడు… కానీ ప్రేక్షకుడిని అంతే బ్రహ్మాండంగా కనెక్ట్ కాగల సీన్స్ గానీ, కథనం గానీ లేకుండా పోయింది… ప్చ్, ఓ నిరాశ…
నిజానికి కొన్ని తడబాట్లు, పొరపాట్లు, తత్తరపాట్లు ఉన్నా సరే, రొటీన్ కథలకు భిన్నంగా వెళ్లే దర్శకులను, సినిమాలను మెచ్చుకోవాలని అనిపిస్తుంది… మెచ్చుకోవాలి కూడా… మన సినిమా మారాలి, ఇంకా మారాలి… ఈ సినిమాలో ఆకట్టుకునే పాయింట్ ఏమిటంటే నిత్యా మేనన్… మనకున్న మంచి తారల్లో ఒకరు… ఆమె ఆలోచన ధోరణి కూడా భిన్నం… కాస్త తాత్వికత, కాస్త ఆధ్యాత్మికత, కాస్త భిన్నత్వం, సగటు తారలకు కంట్రాస్టు ఆమె… ప్లస్ ప్రతిభ… మొదట్లో ప్లజెంటుగా తెర మీద కనిపించేది, కానీ బరువు పెరిగి, ఆమె దేహం మీద ఆమెకే అదుపు తప్పిపోయింది, సినిమాలు దూరమయ్యాయి… మళ్లీ ఇప్పుడు కాస్త చూడబుల్‌గా మారింది… ఆమె తెర మీద కనిపిస్తున్నంతసేపూ బాగుంటుంది… అంతే… ఇక సినిమాలో ఏమీ లేకుండా చేశాడు దర్శకుడు… (నిత్యలోని నటిని బలంగా ఆవిష్కరించగల చాలెంజింగ్ పాత్ర తన కెరీర్‌లో ఇప్పటికీ దొరికలేదు..)
Ads
మంచి పాత్ర దొరకాలే గానీ ఇరగదీసే సత్యదేవ్ హీరో… కానీ పాత్ర సరైంది దొరకలేదు… మిగతా నటీనటుల గురించి చెప్పడానికి పెద్దగా ఏమీలేదు… అసలు కథే దారితప్పాక, ఇక సంగీతం, సినిమాటోగ్రఫీ గట్రా అన్నీ శృతి కోల్పోతాయి… ఇక్కడా అదే జరిగింది… కథ గుడ్, పాయింట్ గుడ్… అప్పట్లో, అంటే 1978… అంతరిక్షంలో నియంత్రణ కోల్పోయిన ఓ స్కైలాబ్ ఎక్కడ పడుతుందో తెలియని దుస్థితి… ఇండియాలోనే పడుతుందని ప్రచారం… ఊళ్లకు ఊళ్లు భయంతో వణికిపోయాయి… అదెక్కడో పడిపోయింది, అదే ఏ హాలీవుడ్డు వాడయితే స్కైలాబ్‌ను ఓ ఊరిమీద పడేసేవాడు… ఆ బీభత్సాన్ని ఆవిష్కరించేవాడు… కానీ మన దర్శకుడికి ఆ ధైర్యం రాలేదు… కనీసం కథలో చెప్పిన ఆ ఊరిలో కొన్ని కుటుంబాల్లో చెలరేగిన ఎమోషన్స్ అయినా సరిగ్గా తెర మీదకు తీసుకొస్తే సినిమా కనెక్టయ్యేది… అంతా సాదాసీదాగా అనాసక్తంగా నడిపించాడు…
బడ్జెట్ కరుణించలేదేమో… లేకపోతే గ్రాఫిక్స్‌తో మస్తు హంగామా చేయదగిన కథ ఇది… కాకపోతే కథ మీద బాగా కసరత్తు జరిగి ఉండాల్సింది… అలాగని మొత్తం తీసిపారేయలేం… 70, 80 ప్రాంతంలో ఓ తెలంగాణ పల్లెకు మనల్ని తీసుకెళ్లగలిగాడు… స్థానిక యాస బాగా కుదిరింది… అదంత ఈజీ ఏమీ కాదు, కానీ దర్శకుడు బాగానే కష్టపడ్డాడు… ఈ ప్రయాసకు తోడు బలమైన ఉద్వేగాలకు సరిపడా కొన్ని సీన్లు గనుక పడి ఉంటే సినిమా ఇప్పుడు భలే క్లిక్కయ్యేది… ఎలాగూ థియేటర్లలో ఆసక్తిగా వెళ్లాలనిపించే సినిమాలు ఏమీ లేవు… అఖండ అందరికీ ఎక్కదు… ఈ గ్యాప్‌ను ఈ స్కైలాబ్ వాడుకోలేకపోయింది… అనామకంగా ఎక్కడో కూలిపోయింది… బ్యాడ్ లక్…!!
Share this Article