————————
పాశ్చాత్య బాణీలో సంగీతం నేర్పే దాసు:-
Ads
“ఆపేయ్… ఆపేయ్.. అదే మీకూ నాకూ ఉన్న వ్యత్యాసం, పూర్వం ఎప్పుడో పడవల్లో పోయేప్పుడు పాడిన పాట, కట్టిన రాగమూను అది. ఇప్పుడు… బస్సులు, రైళ్ళు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు అన్నీ వచ్చేశాయా! లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడు వచ్చిందో, అలాగే సంగీతంలో కూడా రావాలి…
బ్రోచేవా రెవరురా
నినువినా…. రఘువరా….
నన్ను బ్రోచేవా రెవరురా….
నినువినా…. టటటటా….
రఘువరా…..టటటటా….
నీ చరనామ్….. భుజములనే…….
విడజాల….. కరుణా…. ల….వాల……..
బ్రోచేవా రెవరురా….
ఓ చతురా… ననా… దివందిత……… నీకు పరా….కేల……. నయ్యా!
ఓ చతురా… ననా… దివందిత…”
దాసు సంగీతప్రయోగాలకు శంకరశాస్త్రి సమాధానం:-
“అక్షరాల్ని నీ ఇష్టమొచ్చినట్లు విరిచేసి, భావాన్ని నాశనం చెయ్యడమే నటయ్యా నీ ప్రయోగం? దాసూ.. ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం వుంది, శ్రుతి వుంది, స్వరం వుంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండివుంది దాసూ… తాదాత్మ్యం చెందిన ఒక మహా మనిషి గుండె లోతుల్లోంచి గంగా జలంలా పెల్లుబికిన గీతమది, రాగమది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృత తుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చెయ్యకయ్యా! మన జాతి గర్వించ దగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని అపభ్రంశం చెయ్యకు”
తెలుగు సినిమా ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన శంకరాభరణంలో జంధ్యాల రాసిన మాటలివి. అప్పట్లో దానవీరశూరకర్ణ, శంకరాభరణం లాంటి సినిమా డైలాగులను టేప్ రికార్డార్లలో మళ్లీ మళ్లీ వినడం ఒక అభిరుచి. టైమ్ పాస్. సరదా. అలాకూడా తెలుగు భాష సామాన్యుల్లో బతికి బట్టకట్టి బలుసాకే కాకుండా తోటకూర, చుక్కాకులాంటి భాషా పోషకవిలువలను నాలుకమీద రుచికయినా చప్పరించిన రోజులవి. నలభై ఏళ్లు గిర్రున తిరిగి…ఇప్పుడు సినిమా డైలాగుల బుల్లెట్ దిగి ప్రేక్షకుడి గుండె గాయమై ఆ గాయమే పాడుకోలేని పాడుగేయమై మిగిలిన రోజులివి. అయినా మన చర్చ భాష, సంగీత, సంప్రదాయాల గురించి కాదు కాబట్టి…నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని అరిస్తే మమ్మీ అని ఈజిప్టు సమాధిసంకేత ఇంగ్లీషు పిలుపు పిలవలేదే? అని ఆ తల్లి గుండెలు బాదుకునే రోజులు కాబట్టి ఆ విషయం ఇక్కడ అనవసరం.
దాసు- శంకరాభరణం శంకర శాస్త్రి సంభాషణను ప్రస్తుత కరోనా వ్యాక్సిన్ తయారీకి అన్వయించుకుందాం. సాధారణంగా వ్యాక్సిన్ ఆవిష్కరణకు ఎన్నో ప్రయోగాలు, పరీక్షలు, వివిధ దశలు, జాతీయ- అంతర్జాతీయ వైద్య మండళ్ల అనుమతులు…ఆపై అతిశీతల వాతావరణంలో భద్రపరచి రవాణా, పంపిణీ… ఇలా మొత్తం ప్రక్రియకు ఏళ్లకు ఏళ్లు పడుతుంది. ఇదంతా శంకరాభరణంలో దాసు మాస్టారు చెప్పినట్లు- ఎప్పుడో పూర్వం పడవల్లో ప్రయాణించేప్పుడు చేసిన ప్రయోగాలవి. కనుక్కున్న వ్యాక్సిన్లు అవి. ఇప్పుడు బస్సులు, కార్లు, రైళ్లు, జెట్లు, రాకెట్లు అన్నీ వచ్చేసి అన్నిట్లో వేగం పెరిగింది కదా? వ్యాక్సిన్ ఆవిష్కరణ, తయారీ, పంపిణీలో కూడా వేగం పెరగాలి. పెరిగింది కూడా.
ఇంత హడావుడిగా తయారు చేసిన వ్యాక్సిన్ వందకు వంద శాతం ఫలితాలు ఇవ్వకపోవచ్చు అని కొందరు పెదవి విరుస్తున్నారు. అవసరం లేనివారికి వ్యాక్సిన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని కొందరు భయపడుతున్నారు. పదిహేడేళ్లలోపు వారికి అసలు వ్యాక్సిన్ అవసరమే లేదని వైద్యులే చెబుతున్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాలు వికటించి ఆ వ్యాక్సిన్ వేసుకున్నవారు హరీమన్నారు అని వార్తలొస్తున్నాయి. మన భారతీయ వంటింట్లో వాడే పసుపు, అల్లం, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఇంగువ, లవంగం, యాలకులులాంటి ద్రవ్యాలే అద్భుతమయిన వ్యాక్సిన్లని ఆరంగంలో తలపండినవారే చెబుతున్నారు.
వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో? ఎంతవరకు సక్రమంగా పనిచేస్తుందో? స్పష్టత లేకపోయినా రోజూ పేపర్, టీవీలు , సామాజిక మాధ్యమాల నిండా వ్యాక్సిన్ వార్తలే. ఎవరికి ఫాయిదా, ఎవరికి నష్టం, ఎవరికి ముందు, ఎంత శాతం ఫలితం..? అయోమయం, గందరగోళం…
ఏ చెట్టూ లేనిచోట ఆముద వృక్షమే మహా వృక్షం!
గుడ్డికన్నా మెల్ల మేలు!
నడిసంద్రంలో కొట్టుకుపోతున్నవేళ గడ్డిపోచ కూడా ఒడ్డుకు చేర్చే ఆశాపాశమే!
బ్రోచేవారెవరురా?
నిను వినా వ్యాక్సినా!
రఘువరా!
టకటక పంపరా!
చకచక వేయరా!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article