నిజానికి యాంకర్ అనసూయ చేసిన తప్పేమీ లేదు… అడ్డంగా పిల్లిమొగ్గలు వేసి, చేతులు కాల్చుకుని, అరెరె అని నాలుక కర్చుకుని… హడావుడిగా ఖండనలు, వివరణలు రాసుకుని నిట్టూర్చింది మీడియాయే… సోషల్ మీడియా ట్రాపులో గానీ, ఆ ట్రాకులో గానీ పడొద్దు మెయన్ స్ట్రీమ్ మీడియా అని బలంగా చెప్పడానికి ఇదొక ఉదాహరణ…
ఈమధ్య చాలా మంది సెలబ్రిటీలకు ఓ కొత్త జాఢ్యం పట్టుకుంది… ఉదాహరణకు సోషల్ మీడియాలో ఓ వేలు, వేలికి ఉంగరం కనిపించేలా ఓ పోస్టు పెడుతుంది ఒకామె… అదేమిటో చెప్పదు… భావకవిత్వంలా చాలా లోతు, క్రియేటివ్ పోస్టు అన్నట్టుగా కవరింగు, కలరింగు… దాంతో ఇక కొన్ని సైట్లు, యూట్యూబర్లు గబగబా కథలు అల్లేస్తారు… ఆమెకు పెళ్లి ఫిక్సయింది, నేడో రేపో ముహూర్తం అని వండేస్తారు కథలు… వాటికి ఆ క్షణానికి అది వార్త… కావల్సింది మసాలా… అంతే… మధ్యాహ్నానికి మరో వార్త చూసుకుంటారు… ఆ తిప్పలు వేరు…
Ads
కానీ మెయిన్ స్ట్రీమ్ కథ వేరు కదా… క్రెడిబులిటీ అంటూ ఒకటి ఏడుస్తుంది… అది కాపాడుకోవాలి… అదే దెబ్బతింటే పాఠకులు, ప్రేక్షకులు అస్సలు దేకరు ఇక… అందుకని జాగ్రత్తగా ఉండాలి…
అనసూయ కథే తీసుకుందాం… వాడి మీద, వీడి మీద అరుస్తూ, కేసులు పెడతానని బెదిరిస్తూ… ఎప్పుడూ ఏదోరకంగా సోషల్ మీడియా వివాదాల్లో ఉండటం ఆమెకు అలవాటు… అది స్ట్రాటజీ… ప్రచారంలో ఉండే ఎత్తుగడ… సోషల్ మీడియా ఎప్పుడు, ఎలాంటి వార్తలు ఎగబడి రాస్తుందో తనకు తెలుసు… అందుకే ఓ ఫోటో అలా వదిలింది… కోలీవుడ్ రారమ్మంటోంది అనేది ఆమె భావన… కానీ తనను తాను అద్దంలో చూసుకుంటున్నట్టు ఓ మసాలా ఫోటో పెట్టేసరికి… సిల్క్ స్మిత బయోపిక్ చేస్తోంది, సూపర్ పాత్ర, రంగమ్మత్త అదిరిపోతుంది, అసలే అనసూయ, అందులోనూ స్మిత పాత్ర, ఇక చూసుకో నాసామిరంగా అన్నట్టుగా ఎవడో ఫస్ట్ ప్రచారం స్టార్ట్ చేశాడు…
ఇంకేముంది..? అనసూయ వార్త కదా… కాదు, సిల్క్ స్మిత వార్త కదా… ఇక అందరూ అందుకున్నారు… ఆల్రెడీ తమిళంలో సిల్క్ స్మిత మరో బయోపిక్ ‘అవల్ అప్పధితాన్’ ప్రకటించి ఉన్నారు కదా, అందులో ఆమే హీరోయిన్ అంటూ మొదలుపెట్టేశారు… అనసూయ ఇవన్నీ చదివి పకపకా నవ్వుకుంది.., బిడ్డా, మళ్లీ పడ్డారురా మీరంతా నా ట్రాపులో అనుకుంది… మస్తు ప్రచారం… ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో కూడా తనకు బాగా తెలుసు… అందుకే ఒకరోజు ఆగి, తరువాత తాపీగా అబ్బే, నేను స్మిత పాత్రి పోషించడం లేదోయ్ అని చెప్పి, నా తప్పేమీలేదు అని చేతులు, పోస్టులు దులిపేసుకుంది… మధ్యలో ఆమె వలకు చిక్కి బకరా అయిపోయిందెవరు..?
ఇక్కడ బకరా అయ్యింది మెయిన్ స్ట్రీమ్… సోషల్ మీడియాలో ఏదో రాగానే, అయ్యో, మనం మిస్సవుతామేమో అన్నట్టుగా తమిళం, హిందీ, ఇంగ్లిషు, తెలుగు, కన్నడ, మళయాళ మీడియా మొత్తం ఈ వార్త కవర్ చేసింది… ఎవడు కన్ఫరమ్ చేశాడు, ఎవడు చెప్పాడు అంటే ఎవరి వద్దా జవాబు లేదు… అందరూ బ్బెబ్బే అనేశారు… ఇదుగో ఇలా కవర్ చేసుకుని, మొహం దాచుకోవాల్సి వచ్చింది…
పోనీ, తెలుగు పత్రికలు, టీవీలను వదిలేద్దాం… తమిళ మీడియాకు ఏం పుట్టింది… సదరు కొత్త స్మిత బయోపిక్ నిర్మాతలు అందుబాటులో ఉండేవాళ్లే కదా… ఓమాట అడిగి చూడాల్సింది… ఎందుకంటే… సిల్క్ స్మిత పాత్ర పోషించడం అంటే అల్లాటప్పా యవ్వారం కాదు… పైగా అనసూయ అస్సలు సూట్ కాదు… ఆమె ఓ సాదాసీదా నటి… నిజానికి ఆమె నటి కాదు, జస్ట్, యాంకర్… ఓ పిచ్చిపాటకు డాన్స్ చేయడం వేరు… మొత్తం కథను, సినిమాను అనేక ఎమోషన్స్ పండిస్తూ మోయడం వేరు… అనసూయ ఆ రేంజ్ నటి కాదు… పైగా విద్యాబాలన్ ఆల్రెడీ దంచికొట్టిన ఆ పాత్రకు మళ్లీ అనసూయ వంటి సోసో తారలు ఆనుతారా..? ఏక్తాకపూర్ మొత్తం చూపించేసింది సినిమాలో… ఇంకా మిగిలిపోయిన పిప్పి కథేమీ లేదు… అసలు ఈ కొత్త తమిళ మూవీ పట్టాలెక్కుతుందా లేదా అనేదే పెద్ద డౌట్… మరి నిజం ఏమిటి..? ఆమె ఏదో తమిళ సినిమాలో విజయ్ సేతుపతితో ఏదో సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తున్నట్టుంది… ఏదో ఓ ఫోటో పెట్టేసి, కాస్త ప్రచారం కోరుకుంది… సో, ఆమె తప్పు లేదు… మీడియా స్వయంకృతం… లెంపలేసుకొండి అర్జెంటుగా…!!
Share this Article