ఒక కాకి చనిపోతే… వందల కాకులు గుమిగూడతయ్… ఉమ్మడిగా కన్నీళ్లు పెట్టుకుంటయ్… అది కాకుల్లో కూడా కనిపించే సంస్కారం… జాతి సంస్కారం అనాలి దాన్ని..! అలాగే భారతీయ సమాజంలో కులం అనేది ఓ రియాలిటీ… కులం ప్రభావం లేని రంగం లేదు… అంగీకరించాల్సిన నిజం… ఎవరొచ్చినా రాకపోయినా ఓ మనిషి మరణిస్తే, అదీ ఆ కులానికి ఓ లెజెండరీ ఐకన్‌గా ఉన్న వ్యక్తి దూరమైతే… అప్పటిదాకా రకరకాల లబ్ది కోసం ఆయన చుట్టూ తిరిగి, ప్రదక్షిణలు చేసి, వాడుకుని, తీరా ఆ మరణానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించే సోయి లేని కులం దేనికి..? రోశయ్య అంత్యక్రియలు చూస్తే చటుక్కున తోచింది ఇదే… అంత బతుకు బతికీ, వైశ్య కులానికి ఓ ప్రతీకగా నిలిచిన ఆయనకు ఆయన పెంచి పోషించిన ఆర్యవైశ్య మహాసభ, దానికి అనుబంధంగా ఉన్న వందల సంఘాలు, ట్రస్టులు, హాస్టళ్లు, సత్రాలు ఎందుకు ఓ మంచి నివాళిని అర్పించలేకపోయాయి..? అంతర్జాతీయ మహాసంఘాలు, వాములు, ఐపీఎఫ్‌లూ, సంఘీలు, మహిళాసంఘాలు గట్రా ఏరి..? ఎక్కడ..? అసలు ఈ మహాసభ ఉనికికి సార్థకత ఏమిటి..? ఆ పెద్ద తలకాయల దిక్కుమాలినతనానికి విశ్లేషణ సాధ్యమేనా..?
ఓ రాజుగారి కుక్క చనిపోతే వేలాది మంది శ్రద్ధాంజలి ఘటిస్తారు, కానీ రాజుగారే మరణిస్తే పట్టించుకునేవాళ్లు ఉండరు… ఇక్కడా అదే సూత్రమా..? ఒక కాంగ్రెస్ పార్టీకి ఆయన కనిపించకపోవచ్చు, ఒక జగన్‌కు పట్టకపోవచ్చు, ఆయన గారు రాకపోవచ్చు, అంత్యక్రియలకు కేసీయార్ రాకపోవచ్చు, ఢిల్లీ ఆఫీసులోని సోనియాలకు, రాహుల్‌లకు తీరిక లేని ప్రజాసేవ బిజీ ఉండవచ్చు, సొసైటీని ఉద్దరిస్తూ ఉండవచ్చు, కానీ తను ఓన్ చేసుకున్న కులం స్పందన ఏమిటి..? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి… నిజానికి కులం కోణంలో ఓ మనిషి అంత్యక్రియల్ని విశ్లేషించడానికి సిగ్గేస్తోంది… కానీ మన సొసైటీ తీరు చెప్పడానికి, మన మనుషుల తత్వాన్ని వివరించడానికి ఇదొక ఉదాహరణ…
Ads
ప్రత్యేక ఆంధ్రా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించాడని ఇప్పటికీ పొట్టి శ్రీరాములును స్మరిస్తారు… (తెలంగాణకు సంబంధం లేదు)… కానీ కొన్నేళ్లుగా తమ కులానికి ఓ లెజెండరీ ఐకన్‌గా నిలబడిన వ్యక్తిని, ఆయన మరణాన్ని ఎందుకు పట్టించుకోలేదు..? ఆయనే పోయాక ఇక ఆయనతో పనేముందనే థర్డ్ గ్రేడ్ ఆలోచనవిధానమేనా..? ఆర్య వైశ్య మహాసభ సంతాపాలకు ఎందుకు పిలుపు ఇవ్వలేకపోయింది..? జిల్లాకు ఓ పది మంది ఎందుకు చివరి చూపుకు రాలేకపోయారు..? పోలీసులు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది, ప్రెస్, ఆయన బంధుగణం, ఏదో వచ్చాంలే అనిపించుకోవడానికి వచ్చిన కొందరు వీఐపీలు, అత్యంత స్వల్ప సంఖ్యలో వైశ్య మహాసభ మనుషులు… అంతే… కేవలం రోశయ్య కారణంగా జైలుపాలు గాకుండా తప్పించుకున్న పెద్ద తలకాయలేవీ..? ఇప్పటికీ సుకూన్‌గా, పదిలంగా గంజి తాగుతున్న వాళ్లేమైపోయారు..? అమరవాదులు ఏమైపోయారు..? అసలు రెండు రాష్ట్రాల మహాసభలు ఉన్నాయా..?
నిష్టురంగా ఉంది కదా… మళ్లీ చెబుతున్నా, కులం కోణంలో రోశయ్య వంటి వ్యక్తి అంతిమ ప్రస్థానాన్ని చూడటం కరెక్టు కాదు… కానీ కులంతో బ్రహ్మాండంగా ఐడెంటిఫై అయ్యాడు తను… ఒక కేవీపీకి ఏం పట్టింది..? రెండు రోజులూ యాభై మందిని వెంటేసుకుని అక్కడక్కడే తిరిగాడు… తనతో ఉన్న అనుబంధాన్ని మరిచిపోలేక కన్నీళ్లు పెట్టుకోవడం… అదొక ఎమోషన్… అది సొంత కులానికి ఎందుకు పట్టలేదు..? నిజంగా ఆయన ఎవరికీ సాయం చేయలేదా..? ఆయన వల్ల ఎవరూ లబ్ది పొందలేదా..? ఎవరి ఆత్మలకు వాళ్లు సమాధానం చెప్పుకోవాలి… ఈరోజు ప్రతీ కులం తమ సంఘటిత శక్తిని, ఉనికిని చాటుకోవడానికి ఏ సందర్భాన్ని కూడా విడిచిపెట్టడం లేదు… అస్థిత్వ ప్రకటన ఏది..? అసలు దానికి అర్థం తెలుసా..? మరి బాగా ఎన్‌లైటెన్ కులంగా చెప్పుకునే వైశ్యులకేమైంది..? సంఖ్యాపరంగా చిన్నకులాలు కూడా కులస్పృహను చాటుకుంటున్న రోజుల్లో ఫాఫం, రోశయ్య..!!
Share this Article