పునీత్ రాజకుమార్ అలియాస్ అప్పు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు… తన డ్రీమ్ ప్రాజెక్టు గంధదగుడి టీజర్‌ను రిలీజ్ చేశారు… ఇది పునీత్ సొంత సినిమా… నిజానికి నవంబరులోనే రిలీజ్ కావల్సిన సినిమా… అప్పు హఠాన్మరణంతో ఆగిపోయింది… వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, దర్శకుడు అమోఘవర్ష కూడా ఈ సినిమాలో నటించాడు, షూటింగ్ చాలావరకూ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు అప్పు చనిపోయాడు… ఇప్పుడిక సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు… అప్పు చివరి సినిమా కాబట్టి సహజంగానే రాజకుమార్ కుటుంబ అభిమానులు ఆ టీజర్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు… అయితే ఆ టీజర్ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి..?
గతంలో తెలుగు, తమిళ సినిమాలతో పోలిస్తే కన్నడ సినిమాల స్థాయి మరీ నాసిరకంగా ఉండేది… పైగా అవి ఇతర భాషల్లోకి వెళ్లేవి కావు, తమ భాషలోకి ఇతర సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ అనుమతించేవాళ్లు కాదు… చుట్టూ గిరిగీసుకున్నది కన్నడ ఇండస్ట్రీ… ఇప్పుడు రోజులు మారాయి… నిజం చెప్పాలంటే కన్నడ సినిమా కూడా బాగా మారింది… కేజీఎఫ్ సంచలనం తెలిసిందే కదా… పాన్ ఇండియా అనేసరికి నిర్మాతలు కన్నడంలోకి కూడా డబ్ చేసి, స్ట్రెయిట్ సినిమాగా కర్నాటకలో రిలీజ్ చేసేస్తున్నారు… కన్నడ సినిమాల్లో కూడా నాణ్యత, నవ్యత బాగా పెరిగింది… గంధదగుడి టీజర్ చూస్తుంటే భలే ముచ్చటేసింది… దట్టమైన అడవిలో, ఆ డొంకల్లో పడి ఇద్దరు నడుస్తున్నారు… అండర్ వాటర్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని ఏదో వెతుకుతున్నారు… ఆ అడవిలో ఏదో అన్వేషిస్తున్నారు…
Ads
సహజంగానే దర్శకుడు అమోఘవర్ష ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి తను ఈ సినిమా కోసం తీయించుకునే కెమెరా యాంగిల్స్, సీన్స్ భిన్నంగానే ఉంటయ్… ఈ టీజర్ చెబుతున్నది ఏమిటంటే..? ఓ డిఫరెంట్ సినిమా అని…! ‘‘అప్పు ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పినా తన కళ్లల్లో మెరుపు కనిపించేది…’ అని గుర్తుచేసుకున్నాడు కేజీఎఫ్ స్టార్ యష్… ‘అప్పు డ్రీమ్ ప్రాజెక్టు’ అని పునీత్ భార్య అశ్విని ట్వీట్ చేసింది… పునీత్ మొదటి టీజర్ విడుదల చేసినప్పుడు… ‘‘దశాబ్దాల క్రితం ఓ కథ పుట్టింది… మన నేల వైభవం, మన మూలాలు ప్రపంచమంతా విస్తరించిన ఘనత… భావి తరాలకు స్పూర్తిని ఇస్తూనే ఉంటయ్, మనం మరోసారి చరిత్రను వెనుతిరిగి చూసుకుందాం ఓసారి’’ అన్నాడు ఓ ట్వీట్‌లో… దాంతో అసలు ఈ సినిమా కథ ఏమిటనేది మిస్టరీగా మారింది…
పునీత్ నాన్న, ఒకప్పటి కన్నడ ఐకన్ స్టార్ రాజకుమార్ అప్పుడెప్పుడో 1973లో గంధదగుడి పేరుతో సినిమా తీశాడు… ఆ పేరుకు అర్థం చందనం అని..! అందులో అడవుల రక్షణ, వన్యమృగరక్షణ, సవాళ్లు అనేదే కథ… తరువాత పార్ట్-2 పేరిట రాజకుమార్ కొడుకు శివ, పార్ట్-3 పేరిట ఇంకెవరో కూడా తీసినట్టున్నారు… పునీత్ కూడా అడవుల సంరక్షణ గురించి, కర్నాటక అటవీసంపద గురించి ఓ డాక్యుమెంటరీ తీసినట్టున్నారు అని కొన్ని పత్రికలు ఏవేవో రాసేశాయి కానీ… ఓ స్టార్ హీరో ఓ డాక్యుమెంటరీ తీస్తూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కలలు కంటాడా..? ఖచ్చితంగా ఇది ఫీచర్ ఫిలిమే, కాకపోతే ఏదో కొత్త తరహాలో ప్రయోగం చేసి ఉంటారు… అందుకే కథను ఎక్కడా లీక్ కానివ్వడం లేదు… అందుకే ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది అందరికీ… మరణించిన అప్పు డ్రీమ్ ప్రాజెక్టు కాబట్టి, తన మరణానంతరం విడుదల అవుతోంది కాబట్టి, తన చివరి సినిమా కాబట్టి సహజంగానే ఓ ఎమోషనల్ బాండ్ కూడా ఏర్పడుతుంది కదా…!!
Share this Article