అగ్గి పుట్టిస్తా… గాయిగత్తర చేస్తా…. వంటి మాటలు విన్నాం, సారు గారు ఓ పెద్ద బలగాన్ని వెంటేసుకుని ఢిల్లీ వెళ్లారు, వచ్చారు… సమయానికి అగ్గిపెట్టె దొరకలేదు… అసలు రైతుసంఘాల్నే కలవలేదు, మంత్రులతో భేటీ లేదు, తీరా ఆ రైతునేత హైదరాబాద్ వచ్చి సారుకే సురకలు పెట్టి పోయాడు…… మరోవైపు ఫీల్డులో టీఆర్ఎస్ మీద విపరీతమైన ప్రెజర్ పడుతోంది… రైతులకు అన్నీ అర్థమవుతున్నయ్… యాసంగి వరిని కేంద్రం కొంటుందా లేదా తరువాత సంగతి, ఈ వానాకాలం పంట మొత్తాన్ని కొంటాను అంటోంది కదా, మరి ఈ ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదు అని ప్రశ్నిస్తున్నారు రైతులు… రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జవాబు లేదు… కుప్పల మీదే రైతులు ప్రాణాలు వదులుతున్నారు… వారాలకొద్దీ కుప్పల దగ్గరే నిరీక్షణ… కొనేవాడు లేడు, సమీక్షించేవాడు లేడు.., రేపు సరే, ఈరోజు మాటేమిటి..? ఈ వ్యతిరేకతను చల్లార్చడానికి, రైతును ఆదుకోవడానికి నిజమైన పరిపాలకుడిగా ప్రయత్నం చేయాల్సిందిపోయి, బీజేపీ వైపు నెట్టేసేందుకు నానా ప్రయత్నాలూ చేస్తోంది ప్రభుత్వం… డైవర్ట్ చేయడం… పోనీ, అందులోనైనా సీరియస్‌నెస్ ఉంటుందా..? ఉండదు..!
పార్లమెంటు సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం అని ఓ ప్రకటన, ఓ నిర్ణయం… ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం అని హెచ్చరిక… ఎంపీల బస్సుయాత్ర అని ఓ లీక్ వార్త… నిజంగా టీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వరి సమస్య మీద రాష్ట్రంలో పోరాడే స్థితి ఉందా..? మీడియా మీట్స్ కాదు, జనంలోకి వెళ్లే కాలమేనా ఇది..? అసలే రైతులు అగ్గిమండుతున్నారు… ఈ కోపం గురించి టీఆర్ఎస్ లీడర్లకూ తెలుసు… మరో ప్రచారాన్ని వదిలారు… ఎంపీల మూకుమ్మడి రాజీనామా, కేసీయార్ అంగీకరించగానే అందరమూ రెడీ అని విలేకరులకు వెల్లడి… ఎంపీలు అంటే… రాజ్యసభ ప్లస్ లోకసభా..? లేక కేవలం రాజ్యసభా..? లేక కేవలం ఎంపిక చేసుకున్న రెండోమూడో లోకసభ స్థానాలా..?
Ads
రాజ్యసభ విషయానికొద్దాం… ఆరుగురు… అందులో బండా ప్రకాశ్ రాజీనామా… ఆ వ్యూహం ఏమిటో తెలియదు… ఈటల అనే ముదిరాజ్‌ను వెళ్లగొట్టాం కాబట్టి ప్రకాశ్ అనే ముదిరాజ్‌తో భర్తీ చేయడమా..? మరి ఇది రాబోయే రోజుల్లో అన్ని కులాలకూ వర్తిస్తుందా..? ఆలోచనల్లోనే ఏదో తేడా కొడుతోంది… డి.శ్రీనివాస్ ఎలాగూ పార్టీకి దూరంగానే ఉన్నాడు, రాజీనామా చేయడు… ఇక నలుగురు… నలుగురి రాజీనామాలతో కేంద్రంపై పడే ప్రభావం ఎంత..? ఎలాగూ అవన్నీ మళ్లీ టీఆర్ఎస్ గెలుచుకునేవే… మరిక దాంతో ఒనగూరే ప్రచారం ఎంత..? ప్రయోజనం ఎంత..?
లోకసభకొద్దాం… అప్పట్లో సారు, కారు, పదహారు అంటూ ఒకటే హోరు… అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మేశాం కదా, ఈ ఎన్నికలూ అంతే అని బీరాలు పలికారు… (లోకసభ, అసెంబ్లీ ఒక్కసారి ఎన్నికలు జరిగితే ఏం జరిగి ఉండేది అనేది మరో చర్చ… నష్టం జరుగుతుందని తెలుసు కాబట్టే కేసీయార్ అసెంబ్లీకి ముందస్తు పాట అందుకున్నాడు)… తీరా ఏం జరిగింది..? నాలుగు బీజేపీ ఖాతాల్లో పడ్డయ్… మూడు కాంగ్రెస్ ఖాతాలోకి… రెండుమూడు స్థానాల్లో తృటిలో ఓటమితప్పింది… ఇప్పుడు ఆ 9 మంది రాజీనామాలు చేసి, ప్రజాక్షేత్రంలోకి వస్తారా..? నెవ్వర్..!! హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ట్రెండ్స్ చూస్తున్నారు, కల్లాల్లో ధాన్యం దుర్గతి చూస్తున్నారు, జనంలో వ్యతిరేకత ఉంది…
ఒకవేళ నిజంగానే కేసీయార్ గనుక లోకసభ ఎంపీ స్థానాల్లో ఉపఎన్నికలకు సై అంటే ముందుగా ఫుల్ ఖుషీ అయ్యేది రేవంత్, బండి సంజయ్… జజ్జనక జనారే, సమరానికి మేం తయ్యారే అని తక్షణం బరిలోకి దిగిపోతారు… ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది వేరే సంగతి… అసలే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఉపఎన్నికలు వస్తే ఇప్పుడున్న స్థితిలో ఆ వ్యతిరేకతలో ఇంకాస్త పెట్రోల్ పోసే చాన్స్ ఉంటుంది… కేసీయార్ ప్రభుత్వం వైఫల్యాల మీద సర్వత్రా చర్చ సాగుతుంది… రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్ అవుతుంది… ఆయా పార్టీల కొత్త రాష్ట్ర అధ్యక్షులుగా సంజయ్‌కు, రేవంత్‌కు ఫుల్లు వర్క్… సో, ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే… తీవ్ర నిర్ణయాలంటూ ఏమీ ఉండవ్… రాజీనామాలు అసలే ఉండవ్… ఉపఎన్నికలు వచ్చే సూచనలూ ఉండవ్… ఏదో నాలుగు రోజులపాటు మీడియాలో వార్తలు, చర్చలు… జస్ట్, దృష్టి మళ్లింపు…!! ఎందుకంటే… ఉపఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్‌కే ఎలా అగ్గిపెడతాయో కేసీయార్‌కే అందరికన్నా బాగా తెలుసు..!!
Share this Article