హఠాత్తుగా చూస్తే… ఇది సాక్షి పత్రికేనా అనిపించింది..! ఫస్ట్ పేజీలో బ్యానర్‌గా రైతుల కష్టాల గురించిన గ్రౌండ్ రిపోర్ట్… అదీ ప్రస్తుతం తెలంగాణ రైతాంగాన్ని అరిగోస పెడుతున్న ప్రభుత్వ వైఫల్యం గురించి..! అరె, ఏమిటిది..? పొరపాటున ఇంకేదో పత్రిక చూశామా అనిపించింది… కొన్నేళ్లుగా అది నమస్తే సాక్షి అనిపించుకుంటోంది కదా… కాదు, అంతకుమించి..! అవసరమైతే జగన్ మీద నాలుగు రాళ్లు పడ్డా సరే గానీ మా కేసీయార్ మీద మాత్రం ఈగ కూడా వాలడానికి వీల్లేదు అన్నంతగా దాసోహం… జనం కోణం ఏనాడో విస్మరించింది… ఎలాగూ జగన్ కూడా పత్రికను పెద్దగా పట్టించుకోవడం లేదు, పట్టించుకునేవాళ్లు ఎవరూ లేరు కాబట్టి, దశ-దిశ విడిచి ప్రయాణం సాగుతోంది… కానీ ఏమిటిలా హఠాత్తుగా…
ఈనాడు ఎలాగూ ఉచ్చపోసుకుంటోంది… అది జనాన్ని విడిచిపెట్టి చాలా కాలమైంది… ఏదో కరోనా మీద, ఒమైక్రాన్ మీద నలుగురి ఊరూపేరు తెలియనివాళ్ల బైలైన్ ఇంటర్వ్యూలను అచ్చేసి, జనం మీదకు వదిలేస్తోంది… ప్రజాసమస్యలు అనే కోణం జాన్తానై… అప్పుడప్పుడూ ఆంధ్రజ్యోతి కాస్త పాత్రికేయ స్పృహను కనబరుస్తోంది… నమస్తేకు ఎలాగూ సర్కారు డప్పు తప్పదు, సమస్యలకు తప్పుడు బాష్యాలూ తప్పవు… ఫాఫం, దాని ఏడుపు, దాని బాధ దానికే తెలుసు… ఇంగ్లిష్ పత్రికల రిపోర్టర్లు అప్పుడప్పుడూ పాత్రికేయ పరిమితుల్లో సర్కారు వైఫల్యాల్ని, జనం సమస్యల్ని ఎత్తిచూపిస్తూనే ఉన్నారు… ఎటొచ్చీ సాక్షే ఇన్నాళ్లు దిక్కూదివాణం లేని పడవలా మారిపోయింది… కేసీయార్ వైఫల్యాల మీద ఏదైనా వార్త వస్తే, జనం సమస్య ఏదైనా ఫోకస్ చేస్తే… జగన్ కొలువు పీకేస్తాడా..?
Ads
నిజానికి కేసీయార్ క్యాంప్, టీఆర్ఎస్, సర్కారు, పింక్ మీడియా కేంద్రప్రభుత్వాన్ని బదనాం చేస్తూ, తమ వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేలా చేస్తున్నయ్… మరోవైపు వానాకాలం ధాన్యానికి ఏ ఇబ్బందీ లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు..? రేయింబవళ్లూ కుప్పల మీదే రైతులు జాగారం చేస్తున్నారు… ప్రాణాలు పోతున్నయ్… మీడియాలో రావల్సినంత ఫోకస్ రాలేదు… టీవీలకు ఎలాగూ జనం పట్టరు… వాటిని ఈరోజుల్లో పాత్రికేయ వేదికలు అనలేం కొన్నికోణాల్లో… కనీసం ప్రింట్ మీడియా జనం అవస్థల్ని, అసలు కారణాల్ని వెలుగులోకి తేవాలి కదా… ఇప్పుడు సాక్షి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేసింది, నెట్‌వర్క్ సాయంతో కొన్ని కేస్ స్టడీలు తీసుకుని పబ్లిష్ చేసింది… కానీ అదైనా లోపల పేజీల్లో బలంగా ప్రజెంట్ చేయగలిగిందా అంటే అదీ లేదు… పోనీలే, మాదీ పత్రికే అనే సోయి కలిగింది, సంతోషం… అభినందనలు… (లూజ్ సేల్స్ పడిపోయాయనీ, జనం సాక్షి కొనడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదనీ, కాపీలు పడిపోతున్నాయని కొంపదీసి వాళ్లకు కూడా అర్థమైపోయిందా ఏం..?) మొదట్లో వెలుగు అనే బీజేపీ అనుకూల పత్రిక జనం ఇష్యూస్ బాగానే ఫోకస్ చేసేది, ఈమధ్య ఏమైందో అదీ చల్లబడిపోయింది… అవునూ, జనమెవరూ చదవని ఒకటీరెండు చిన్నపత్రికల్ని వదిలేయండి, తెలంగాణలో వామపక్ష పత్రికలు కూడా ఒకటీరెండు ఉన్నట్టున్నయ్ కదా, అవి కూడా జనం నుంచి ఎందుకు దూరదూరంగా ఉంటున్నయ్..?!
Share this Article