ఎందుకు చేయలేడు..? బాలయ్య మనసు పెడితే ఖచ్చితంగా చేయగలడు… శంకరాచార్య పాత్రను సమర్థంగా పోషించి, మెప్పించగలడు… మరీ ఆమధ్య తను సొంతంగా ‘‘శివశంకరీ శివానందలహరి’’ అనే పాట పాడి తెలుగు రాష్ట్రాల్ని కల్లోలితం చేసినట్టు గాకుండా… ఏ మంచి దర్శకుడో దొరికితే శంకరాచార్యుడిని కళ్ల ముందు ఆవిష్కరించగలడు… ఏం..? ఇంతకుముందు భైరవద్వీపంలో ఓ గూనివేషం గుర్తు లేదా..? కాకపోతే బాలయ్య మనసైతే మల్లి, లేకపోతే ఎల్లి టైపు… తను ముందుగా ఆ పాత్రను ప్రేమించాలి, జీవించాలి… ఇప్పుడు శంకరాచార్య పాత్ర తన ప్యాషన్ అంటున్నాడు కాబట్టి లీనమై చేయగలడు… నెత్తుటిలో ఎన్టీయార్ వారసత్వం ఉంది కాబట్టి జీవించగలడు కూడా…
(బాలయ్యతో ఆ సినిమా చేయాలని ఉందని రీసెంటుగా నిర్మాత కల్యాణ్ చెప్పాడు తెలుసు కదా… బాలయ్య దగ్గర ఆల్‌రెడీ ఆ ప్రపోజల్ కూడా ఉంది… తనకు హిందుత్వ మీద గాఢమైన అభిమానం ఉంది… పెరిగింది… అఖండలో అది ఆవిష్కృతమైంది కూడా… శంకరాచార్య పాత్రను గనుక బాలయ్య ప్రిస్టేజియస్‌గా తీసుకుని చేస్తే, పాన్ ఇండియా తరహాలో మార్కెట్ చేసుకోగలిగితే అది బాలయ్య జీవితంలో, కెరీర్‌లో ఓ మొమరబుల్ మూవీ అవుతుంది…) ఎటొచ్చీ సమస్య బాలయ్య ఫ్యాన్స్… బాలయ్య చుట్టూ అల్లుకున్న ఓ మాయ ఇమేజీ… టిపికల్ తెలుగు హీరో సుప్రిమసీ… కమర్షియల్ ఫార్ములా… వాటిని అధిగమించి, అవి బ్రేక్ చేసి ఈ సినిమా చేయడానికి… సగటు వెగటు కమర్షియల్ వాసనల్లేకుండా ఆ మూవీ తీయడానికి నిజంగానే కల్యాణ్ ముందుకొస్తాడా..? ఎహె, తనకు ఆ టేస్ట్ లేదుపో అంటారా,..?
Ads
అసలు బాలయ్య సాత్వికం, రౌద్రం, బీభత్సం, కారుణ్యం… ఏ పాత్రయినా చేయగలడు… కానీ బోలెడు సమీకరణాలుంటయ్… చివరగా శ్రీరామరాజ్యం మినహాయిస్తే… మిగతా సినిమాలన్నీ ఒక టైపు… కథానాయకుడు, మహానాయకుడు నాన్నను నివాళి కమ్ పొలిటికల్ ఇంట్రస్టు కోసం చేసినవి… శాతకర్ణి సినిమా బాగుంటుంది, కానీ అందులోనూ కత్తియుద్ధాలు, హీరోయిజం… ఇక అఖండలో ఆకాశమే హద్దు హీరోయిజానికి… (పొరపాటున బోయపాటితో శంకరాచార్య తీయించరు కదా… పాపం శమించుగాక… అమంగళం ప్రతిహతమవుగాక)… మన హీరోలే కాదు, బేసిక్‌గా సౌతిండియన్ హీరోలు అంటేనే ఇమేజీ బందీలు, ఫార్ములా బాధితులు… అవి దాటి బయటికి రాలేరు, ఫ్యాన్స్ రానివ్వరు, కమర్షియల్ లెక్కలు రానివ్వవు… కాస్త నాగార్జున ఒక్కడే నయమేమో…
అఫ్‌కోర్స్, తను కూడా మీసాలతోనే అన్నమయ్య అయ్యాడు… ఇద్దరు భామలతో రొమాన్స్ గీతాలు, స్టెప్పులు… సరిపోనట్టు మోహన్‌బాబుతో వెకిలి రాజు పాత్ర… కాకపోతే క్లైమాక్సులో అదరగొట్టేశాడు… శ్రీరామదాసు అయినా సరే, స్నేహతో సరస శృంగార గీతాలు, కిందామీదా పడటాలు… తెలుగు హీరో ఎప్పుడూ మారడు… అంతెందుకు, అంతటి చిరంజీవి కూడా శ్రీమంజునాథలో శివుడి వేషంలోనూ స్టెప్పులు వేస్తాడు… వేయిస్తారు, నిజానికి ఇలాంటి భిన్నమైన, పౌరాణిక, ఉదాత్త పాత్రల విషయంలో చిరంజీవికి చెప్పుకోదగిన పాత్ర లేదు ఇప్పటికీ…! ఇవన్నీ సరే, మరి అఖండ రేంజులో మళ్లీ ఓ హిట్ కావాలని బాలయ్య కోరుకోవడం సహజం… కానీ శంకరాచార్యుడి కథ దానికి నప్పదు, ఆ ఆశల్లో ఇమడదు కదా… ఎలా..?
అంతటి ఘనమైన హైందవ ధర్మోద్ధారకుడి కథ నిజంగా స్పూర్తిదాయకంగా తీయాలంటే బాలయ్య ముందుగా పూర్తిగా తన ఇమేజీ బంధనాలను తెంచుకోవాలి… ఫార్ములా కమర్షియల్ లెక్కలను ధ్వంసం చేయాలి… చేయగలడా..? శంకరాచార్యుడికి కూడా అఖండ, అఘోరా తరహాలో సూపర్ హీరో ఫైట్లను పెట్టలేరు కదా… సరసమైన కంటెంటు సాధ్యం కాదు కదా… చేయాలంటే బాలయ్య తమ నాన్నను గుర్తుచేసుకోవాలి,.. ఆయన వీరబ్రహ్మేంద్రస్వామి పాత్రను ఎలా పోషించాడో ఓసారి నెమరేసుకోవాలి… ప్రేక్షకుడు ఏ సోకాల్డ్ కమర్షియల్ లెక్కల్నీ పట్టించుకోడు… సినిమా తనకు కనెక్ట్ కావాలి, అంతే, చూస్తాడు, బ్రహ్మరథం పడతాడు… ఎటొచ్చీ ఈ వయస్సులో తన కెరీర్‌ను సార్థకం చేసుకునే మంచి పాత్రల ఎంపిక ఎలాగో తను ఆలోచించుకోవాలి… ఎలాగూ నటవారసుడు లేడు… ఇంకెన్నాళ్లో తన కెరీర్ సాగదు… సమయం లేదు బాలయ్యా… తరుణం ఇదే…!!
Share this Article