వ్యవసాయాధికారులు పరేషన్ అయిపోతున్నారట… అరె, ఈమాత్రం పని చేతకాదా..? వాళ్లను రైతులకు వ్యవసాయ జ్ఞానం నేర్పించాలని ఏమైనా బాధ్యతలు ఇచ్చామా..? పంటల మార్పిడి వైపు పరుగులు పెట్టించామా..? ప్రత్యామ్నాయ పంటల మీద ప్రణాళికలు వేయమన్నామా..? అసలు మాకే వ్యవసాయం మీద ఓ పాలసీ లేదాయె, వాళ్లకు పనిచెప్పిందెక్కడ..? చేయించుకున్నదెక్కడ..? రాక రాక మాకూ ఓ ఆలోచన వచ్చింది… ఇలాగే గాలికి వదిలేస్తే ఫాఫం, వాళ్ల దేహాలూ జంగుపట్టిపోతాయని… యంత్రాలైనా సరే, అప్పుడప్పుడూ నడిపించాలి, లేకపోతే బ్యాటరీలు డౌనై, బేరింగులు జామైపోయి, చెయిన్లు బిగదీసుకుపోయి డిశ్చార్జ్ అయిపోవా..? సో, చూడండి సార్లూ, జస్ట్, మీ పరిధిలో ఎన్ని కోతులు ఉన్నయో లెక్క పెట్టి చెప్పండి అని ఓ చిన్న పని అప్పగించాం… కొందరికి ఇవన్నీ అర్థం కావు, తిట్టేస్తారు, నిందిస్తారు, ఆడిపోసుకుంటారు…
జస్ట్, నంబర్ చెప్పమని ఆదేశిస్తే బాగుండదు కదా… నోటికొచ్చిన లెక్క రాసేస్తరు… అందుకని ఎన్నికోతులు, ఎన్ని గుంపులో చెప్పాలన్నాం… పంట నష్టం అంచనా వేయమన్నాం… అసలు కోతులు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నాయో పసిగట్టి, నిఘావేసి నిగ్గుతేల్చాలన్నాం… అంటే గుట్టల మీదా..? చెట్ల మీదా..? రోడ్ల పక్కనా..? పాడుబడ్డ ఇండ్లల్లోనా..? ఎక్కడ ఉంటున్నయ్..? కొందరు రైతులు కోతులను కంట్రోల్ చేస్తున్నారు కదా, ఎట్లా చేస్తున్నారో కూడా డిటెయిల్డ్గా చెప్పాలన్నాం… అవే చిట్కాలు ఇతర రైతులకూ చెప్పామనుకొండి, బస్, సమస్య ఖతం… మా సదుద్దేశాలేమో మీడియాకు సమజ్ కావు, ఏదేదో రాసి కాలబెడతరు… ఏదో ఆలోచించకుండా సర్క్యులర్లు జారీ చేయం కదా, ఆమాత్రం పాలనజ్ఞానం తెలియదా వీళ్లకు..?
Ads
ఇంకో సంకల్పం కూడా ఇందులో దాగుంది… ఇప్పుడు రాష్ట్రంలో బొచ్చెడు గ్రీనరీ పెరిగింది కదా… ఎటుచూసినా అడవులు, చెట్లు… అసలు ఇన్నేళ్లుగా ప్రతి జిల్లాను కాలేశ్వరం జలాలతో ఓ అమెజాన్ అడవిగా మార్చాం కదా… మరి కోతులు వెళ్లిపోవాలి కదా… ఊళ్లు వదిలేయాలి కదా… ఎందుకు పోవడం లేదు..? ఊళ్లల్లో ఏ రుచి మరిగినట్టు..? అది తేలాలి కదా… లేకపోతే ఇంత గ్రీనరీకి ఇక సార్థకత ఏమున్నట్టు..? అరె, భాయ్… రైతుబంధు లెక్కలు, పంట లెక్కల నమోదు, రైతు భీమా బాధలు ఎప్పుడూ ఉండేవే కదా… పైగా అన్నింటికీ ఈ కోతుల సమస్యతోనే లంకె ఉన్నదాయె… అదుగో, ఆ తక్లీఫ్ ఖతం చేస్తే తప్ప రైతులు సమస్యలు పోవు…
ష్, మళ్లీ ఎవరితోనూ గట్టిగా అనకండి.., వరిగోస, అరిగోస అని మోడీని తిడుతున్నం, బీజేపిని తిడుతున్నం, ఈ కోతుల సమస్యకూ ఆ కోతిమూకే కారణమని తిట్టలేం, ప్చ్, దీనికీ ఏదో లంకె వెతకాలి, ఢిల్లీ మీదకు నెట్టేయాలె… అందుకే ముందుగా ఈ లెక్కలు తీయాలి..!! ఛలో ఇక కదలండి… లెక్క పక్కాగా ఉండాలి సుమా… కోతులెన్నో, కొండెంగలెన్నో, తోకల సగటు పొడవెంతో… ఏదీ వదిలిపెట్టొద్దు… సరేనా..?! ఈ పనైపోయాక కోతులకు వేసక్టమీ బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తే సరి..!! ఈమధ్య పనితగ్గినట్టు, కొంచెం ఫ్రీగా కనిపిస్తున్నరు… ఎలాగూ రెవిన్యూ వాళ్లను ఇన్వాల్వ్ చేయలేం, వాళ్లు చాలా బిజీ కదా… ‘‘లెక్కేసుకోవడమే’’ వాళ్లకు పెద్ద పని అయిపోయింది… ఏం చేస్తం..? మరీ తప్పదు అనుకుంటే పంతుళ్లను రంగంలోకి దింపడమే… రెండేళ్ల నుంచి పనీపాటా లేదు కదా…!!
Share this Article