నయీం..! పోలీసులే స్వయంగా ఓ విషపుమొక్కను పెంచి పోషిస్తే, అదెలా ఓ భూతాలచెట్టుగా మారుతుందో.., ఆ కొత్తరకం మాఫియా ఎంత అరాచకంగా ఉంటుందో చెప్పే పేరు అది… రాజ్యం పాలుపోసిన పాము, ఆ రాజ్యాన్నే ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే కేరక్టర్ అది… అధికారులు, వ్యాపారులు, నాయకులు ఎవరైతేనేం, అందరికీ వణుకు… తను ఏది చెబితే అదే చెలామణీ… ఇక మామూలు ప్రజల గురించి చెప్పేదేముంది..? చిన్నప్పటి నుంచీ తనది క్రిమినల్ నేచర్… క్రుయల్… తనను నక్సలైట్లు వాడుకున్నారు, చివరకు తన చేతుల్లోనే కీలక నాయకులనూ కోల్పోయారు… పోలీసులు వాడుకున్నారు, చాలామందిని కోవర్టులను తయారు చేసుకున్నట్టే నయీంను కూడా పికప్ చేశారు, ఆ నక్సలైట్ల మీదకే వదిలారు… మరోవైపు కొందరు తన సాయంతోనే కోట్లకుకోట్లు సంపాదించారు…
ఇక ఎదురేముంది..? ప్రభుత్వాలు వస్తుంటయ్, పోతుంటయ్, నయీం అల్టిమేట్ అన్నట్టుగా పెరిగాడు… చివరకు ఏకంగా పెద్ద కుర్చీకే ధమ్కీలు ఇచ్చే స్థాయికి ‘ఎదిగితే’.., అధికారం గనుక కోపంతో కళ్లు తెరిస్తే, అంతిమంగా ఏం జరుగుతుందో, ఆ పోలీసుల తూటాలే ఎలా దేహంలో దిగబడతాయో చెప్పడానికి తన జీవితమే ఓ పెద్ద ఉదాహరణ… నిజానికి నయీం డైరీస్ సినిమా తీసిన నిర్మాత సీఏ వరదరాజు ధైర్యవంతుడు… దర్శకుడు దాము బాలాజీ తెలివైనవాడు… నక్సలైట్లు-పోలీసుల నిజవ్యవహారాల తీరు తెలిసినవాడు… జైళ్లు, ఎన్కౌంటర్లు, కోవర్ట్ ఆపరేషన్లు, పోలీసుల అవినీతి, యాంటీ నక్సల్ ఆపరేషన్లు రియలిస్టిక్ ధోరణిలో చిత్రీకరించాడు… కానీ కొన్నిచోట్ల దారితప్పాడు…
Ads
ఎలాగంటే..? నయీం సంఘవిద్రోహ శక్తిగా మారడానికి ఏదో ఎమోషనల్ స్టోరీని జస్టిఫికేషన్‌గా చూపించడం జనానికి నచ్చదు, నయీం పట్ల ఆ కాస్త సానుభూతి కూడా అనవసరం… సోదరిపై చేయివేసిన నక్సల్‌ను పీపుల్స్‌వార్ శిక్షించకపోవడంతో నయీం బ్రదర్స్ స్వయంగా శిక్ష అమలు చేయడం, దాంతో పార్టీ నయీంను దూరం పెట్టడం, ఆ తరువాతే నయీం పోలీసుల చేతిలో ఆయుధంగా మారాడనేది నిజమో అబద్ధమో కాదు ఇక్కడ… అది యాంటీ సెంటిమెంట్… దర్శకుడి స్థానికత తెలియదు గానీ, భువనగిరి ప్రాంతాల ప్రజానీకంతో పరిచయం, జనాభిప్రాయం మీద అవగాహన ఉన్నవాడయితే ఈ ఎపిసోడ్, ఈ జస్టిఫికేషన్ సినిమాలో ఉండేది కాదు…
మరొకటి బెల్లి లలిత పాత్ర చిత్రీకరణ తీరు… ఇప్పుడు ఈ వివాదమే సినిమాను హైకోర్టుకు లాగింది… కోర్టు చిత్రప్రదర్శనపై స్టే ఇవ్వడమే కాదు, దర్శకనిర్మాతలకు, సెన్సార్ బోర్డుకు కూడా నోటీసులు జారీచేసింది… దర్శకనిర్మాతలు ఆ సన్నివేశాల్ని తొలగిస్తామంటూ క్షమాపణలు కూడా చెప్పారు… లలితను ముద్దాడటం, ఆమె నయీం అంటూ పడిచచ్చిపోవడం, ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని అనుకోవడం నిజమా కాదా అనే చర్చను కాసేపు వదిలేద్దాం… రకరకాల ప్రచారాలు ఉంటయ్… వాటిని అలాగే చిత్రీకరించడం సరైందిగా అనిపించడం లేదు… బెల్లి లలితకు సొసైటీలో ప్రజాగాయనిగా మంచి పేరుంది…
ఆమె పీపుల్స్‌వార్ యాక్టివిస్టే కావచ్చు… ఆమెను నయీం కిరాతకంగా ముక్కలుముక్కలుగా హతమార్చి, అనేకచోట్ల పడేసిన పైశాచికం మీద జనంలో కోపం, ద్వేషం, ఏవగింపు ఉంది… అలాంటప్పుడు వాళ్లిద్దరినీ ప్రేమికులుగా, పైగా లలితను నయీంను పిచ్చిగా ఇష్టపడ్డటుగా చిత్రీకరించడం యాంటీ సెంటిమెంట్… ఆమె నయీం, పోలీసులు చూపిన ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగలేదు కూడా… పైగా అంతగా తనంటే ఇష్టపడే లలితను అంత రాక్షసంగా హతమార్చాల్సిన అవసరం ఏమిటి..? ఇప్పుడు మనం చెప్పుకునే అంశం నిజానికి నయీం డైరీస్ సినిమా రివ్యూ కాదు, లలిత వివాదంపై దర్శకనిర్మాతల క్షమాపణల ఎపిసోడ్ గురించి కాదు… జనంలో సానుభూతి ఉన్న వాళ్లను, ప్రజాపోరాటాల్లో అమరులైనవాళ్లను, వాళ్ల నిజ కేరక్టర్లకు భిన్నంగా ప్రొజెక్ట్ చేయాలనుకోవడం కరెక్టేనా..? అలాగే విలనీకి కూడా జస్టిఫికేషన్ ఇవ్వడం కరెక్టేనా..?
ఇప్పుడు నయీం డైరీస్ పరిణామాల్ని చూస్తున్నాం కదా… ఇక అందరి దృష్టీ దర్శకుడు వేణు ఊడుగుల మీదకు మళ్లుతోంది… సాయిపల్లవి మీదకు మళ్లుతోంది… ఎందుకంటే..? చాలారోజులుగా షూటింగు జరుపుకుంటున్న విరాటపర్వం సినిమాలో సాయిపల్లవి పాత్ర కూడా బెల్లి లలిత పాత్రే అనే ప్రచారం ఉంది… అది నిజమో, కాదో వేణు చెప్పడం లేదు, ఆ సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు… వేణుకు కూడా పీపుల్స్‌వార్ ఉద్యమం తీరూతెన్ను మీద అవగాహన ఉంది… అందుకే బెల్లి లలిత పాత్రను తను ఎలా చిత్రీకరించాడనే ఆసక్తి క్రియేటవుతోంది ఇప్పుడు… లలిత కేరక్టరైజేషన్ అనుచితంగా ఉంటే ఊరుకునేది లేదని ఆ ఫ్యామిలీ ఈ నయీం డైరీస్ వివాదం ద్వారా చెబుతూనే ఉంది… రేప్పొద్దున విరాటపర్వంలో కూడా అలాగే ఉంటే ఇదే రిపీటవుతుంది… నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు అసలే పక్కా కమర్షియల్, వివాదాలంటే విముఖుడు… తన లెక్కలు వేరు… ఇంతకీ వేణూ, తాజా వివాదాల్ని ఫాలో అవుతున్నవ్ కదా..!? ఎలాగూ రీషూట్ల మీద రీషూట్లు నడుస్తున్నయ్ కదా, ఓసారి ఇదీ సరిచూసుకో… అవసరమైతే పనిలోపనిగా రీషూట్ చేసుకోవచ్చు…!!
Share this Article