అరె, ఏందిర భయ్, ఈ రాతలు..? గుయ్యా గుయ్యా, ఒకటే ఒర్లుతరు… అవునుర భయ్, గా గల్వాన్ల అమరులైన జవాన్లకు పరిహారం ఇస్తమని మా సారు చెప్పిండు, చెప్పిండంటే చేసుడే, చేస్తడు, చేసి తీరతడు… తలకాయ కోసుకుంటడు కానీ మాటతప్పడు… ఆ సంతోష్ ఫ్యామిలీకి 5 కోట్లు ఇచ్చిండా లేదా..? ఆయన భార్యకు మంచి కొలువు ఇచ్చినమా లేదా..? మరి మిగతా 19 మందికి మాత్రం ఎగ్గొట్టిండు అని రాసుడేంది..? 17 నెలల నుంచీ సీఎం ఆఫీసు చుట్టూ ఆర్మీ తిరుగుతున్నా సరే, పట్టించుకునేటోడు లేడు అని ఇష్టమొచ్చినట్టు రాస్తరా ఏంది..? అరె, ఎగ్గొట్టుడు కాదు… ఇస్తం, జెర జేబుల డబ్బులు ఎన్నున్నయో చూస్కుని ఇస్తం, ఇస్తం అన్నాక ఏడ బోతము, ఇస్తం… ఇయ్యక తప్పుతదా..?
ఇస్తూనే ఉంటం… దళితబంధు మల్ల స్టార్ట్ చేస్తం కదా, ఆ చెక్కులతోనే వీళ్లకూ చెక్కులు ఇస్తం… బీసీ బంధు కూడా పెడతం, ఆ చెక్కులూ ఇస్తుంటాం కదా, వాటితోపాటు ఇవీ ఇస్తం… ఢిల్లీల బైఠాయించి ప్రాణాలు పోయిన 700 మందికి కూడా పరిహారాల చెక్కులిస్తమని సారు చెప్పిండు కదా… అవి కూడా ఇస్తం, అవి ఇచ్చినప్పుడే ఈ జవాన్ల చెక్కులూ ఇస్తం… ఇస్తం అన్నాక ఇక ఎనుకకు పోవుడే లేదు… దళితులకు మూడెకరాలు, అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు… ఒక్కసారే అయిపోతదా… ఇస్తూనే ఉంటం… ముందుగాల గీ సెక్రెటేరియట్ కట్టుడు అయిపోనీ, ఇది అర్జెంటు కదా… ఉన్నదేమో దబ్బదబ్బ కూలగొడితిమి, జెర తొందరగా కట్టుకోవాలె కదా…
Ads
ఈమాత్రం దానికి ఏదో పైసలు ఎగ్గొట్టిండు అన్నట్టు రాస్తే ఎట్ల..? దేశంల ఇంకెవడైనా సీఎం ఇంత భారీ ప్రకటనలు చేసిండా..? లేదు కదా… జవాన్లకు, కిసాన్లకు అండ ఎవరు..? మా సారే కదా… మాకు ఇక్కడ సరిగ్గా గతి లేకపోయినా సరే, దేశమంతటా అందరినీ ఉద్దరిస్తున్నమా లేదా..? గా మోడీ ఒక్కడే అన్నింటికీ అడ్డుపడుతుంటడు భయ్యా, వాళ్లు చేయరు, ఎవరినీ చేయనివ్వరు… అందుకే తక్లీఫులు వస్తుంటయ్, అన్నిటినీ జెర చూసుకుంటూ, ఒక్కొక్కటీ చేసుకుంటూ పోతం… ఎవరికీ ఎగ్గొట్టం… మా సారు అసలే నియ్యతికి నిలువెత్తురూపం… ఇగ ఏం రాసుకుంటరో రాసుకొండ్రి, పొండ్రి…
Share this Article