ఇది సోషల్ మీడియా యుగం… సినిమాలు, సీరియళ్లు, ఓటీటీ కంటెంట్, టీవీ రియాలిటీ షోలు, పార్టీలు ఏది చెబితే అది గుడ్డిగా తలూపి ఆహా ఓహో అనడానికి జనం సిద్ధంగా లేరు… అన్నీ చర్చకు వస్తుంటయ్… బట్టలిప్పి బజారులో నిలబెట్టి ఆడుకుంటయ్… అఫ్కోర్స్, కొన్నిసార్లు అది ఎక్స్ట్రీమ్కు వెళ్లి దుర్వినియోగమవుతున్నా సరే, వ్యక్తులు తమ అభిప్రాయాల్ని వ్యక్తీకరించడానికి వేదికలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు… ప్రత్యేకించి బిగ్‌బాస్ వంటి టీవీ రియాలిటీ షోలు జనాన్ని మాయ చేయడానికి వోటింగు అంటయ్… కానీ ఆ వోటింగ్ రిజల్ట్ చెప్పవ్… ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా, ప్రేక్షకుడికి నిజాలు చెప్పే సోయి లేకుండా, ప్రేక్షకుడి తీర్పు పట్ల గౌరవం లేకుండా మరి వోటింగ్ దేనికి..?
సో, కంటెస్టెంట్లు హౌజులోకి వెళ్లేముందే వేలు, లక్షలు చెల్లించి సోషల్ మీడియా టీమ్స్ ఏర్పాటు చేసుకుంటయ్… ప్రమోషన్ చేసుకుంటయ్… అవి వోటింగ్‌ను, పాజిటివ్ ప్రచారాన్ని ఆర్గనైజ్ చేస్తుంటయ్… ఎవడైతే మంచి టీం ఏర్పాటు చేసుకోగలడో వాడే తోపు… కాదు… ఎవడైతే ఆయా రియాలిటీ షోల క్రియేటివ్ టీమ్స్ పెద్ద తలకాయల్ని ఆర్గనైజ్ చేసుకోగలడో వాడే తోపు… బిగ్‌బాస్ షో దగ్గరికే వద్దాం… తెలుగులో సీజన్ అయిదు పూర్తికావొస్తోంది కదా… మునుపెన్నడూ లేని రీతిలో బదనాం అయిపోయింది… ఫిక్సింగ్ ప్రచారాలు జనంలోకి వెళ్తున్నాయి… తెలుస్తున్నాయి… జనం చెవుల్లో రఫ్లీషియా పూలు పెడుతున్నారు కదరా అనే తిట్లు, శాపనార్థాలు కూడా పెడుతున్నారు ప్రేక్షకులు…
Ads
అవును, అలాంటివి చూడకపోతే సరి, చూడటం దేనికి, తిట్టిపోయడం దేనికి అంటుంటారు కొందరు… చూడకపోతే ఎలా..? మాట్లాడకపోతే ఎలా..? అక్కడ పెట్టబడే కోట్లకుకోట్ల ఖర్చు చివరకు వసూలయ్యేది జనం జేబుల నుంచే… యాడ్స్ ఖర్చు, ఆయా చానెళ్ల సబ్స్క్రిప్షన్ కాస్ట్ చెల్లించేది మనమే… మరి ఆ ‘సరుకు’పై విశ్లేషణ లేకపోతే ఎలా..? బిగ్‌బాస్ ఫినాలే వస్తోంది… ఇక ముఖ్యఅతిథి రాక, హంగామా, డ్రామా, మెలోడ్రామా, ఫేక్ పొగడ్తలు గట్రా ముంచెత్తుతయ్… (ఓ వార్త చూస్తే నవ్వొచ్చింది, షోకు ఎవరెవరో సినిమాల ప్రమోషన్ కోసం వస్తుంటారు, టీవీలు-సినిమాల సెలబ్రిటీలు వస్తుంటారు, కానీ ఎంపీ సంతోష్ ఎందుకొస్తున్నాడో అర్థం కాలేదు… కాదు, కాదు… తనను నాగార్జున ఎందుకు తీసుకొస్తున్నాడో, ఫాఫం, ఆయన అవసరమేమిటో తెలియదు… రావడం తప్పు కాదు, పిలవడం తప్పు కాదు, కానీ అసాధారణం, ఆశ్చర్యకరం… రాబోయే రోజుల్లో నాయకులు, ఇతర రంగాల వారిని కూడా షోకు తీసుకొస్తారన్నమాట… లేదా సంతోష్‌కు మాత్రమే దక్కిన గౌరవమేమో…)
సరే, ఇక ఫైనలిస్టులు ఖరారైనట్టే… కాజల్ వెళ్లిపోతోంది, కాబట్టి మిగిలేది అయిదుగురు, అందులో సన్నీ, శ్రీరాంచంద్ర ఆల్రెడీ ఫైనలిస్టులుగా ప్రకటించబడ్డారు… ఇక మిగిలిన మానస్, సిరి, షణ్ముఖ్‌లను ఆదివారం ప్రకటిస్తారు… అయితే ఎవరేమిటి..? ముందే చెప్పుకున్నట్టు బిగ్‌బాస్ టీం తాము అనుకున్నవాళ్లను హీరోగా చేస్తారా..? ప్రజాభిప్రాయానికి గౌరవమిస్తారా..? ఈ టీం చెప్పినట్టు విని ఇప్పటికే నాగార్జున తన పరువు పోగొట్టుకున్నాడు… బయట జనానికి కనిపించేది నాగార్జునే కదా, తన షో ఇది అనుకుంటారు… ఈసారి ఫైనలిస్టుల్లో ఓ వెగటు జంట ఉంది… షణ్ముఖ్, సిరి… ఓ లవ్ ట్రాక్ అనేది పెద్ద ఇష్యూ కాదు, వాళ్ల ఫీల్డ్‌లో హగ్గులు, ముద్దులు పెద్ద విషయమేమీ కాదు… కానీ ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నారు… లోపల ఈ వేషాలు… (బిగ్‌బాస్ టీం చెప్పినట్టుగా ఓ స్క్రిప్టెడ్ షో చేస్తున్నా సరే, ప్రేక్షకులు అసహ్యించుకుంటున్నారు)… నేను కాదు, నా షన్నూను విన్నర్‌గా చూడాలని ఆటగత్తెను ఫినాలే దాకా తీసుకురావడమే ఓ విచిత్రం… నిజంగా జనం సిరికి వోట్లేస్తున్నారా..? ఇదీ డౌటనుమానం…
ప్రత్యేకించి షణ్ముఖ్ కేరక్టర్ మీద అనుకోకుండా ఓ ట్వీట్ కనిపించింది… (లైఫ్ ఓ జిందగీ అని పేరుంది వీడియో మీద)… సిరి మీద ఎలా అరుస్తాడో, ఎలా అనుమానిస్తాడో, ఎలా ట్రీట్ చేస్తాడో కొన్ని సీన్స్ ఒక్కచోట క్రోడీకరించి ఉన్నాయి ఆ వీడియోలో… నిజమే, సిరి మీద తనకున్న హక్కేమిటి..? షన్నూ కరుస్తున్నా సరే, ఆమె ఎందుకలా మీదమీదపడిపోతోంది… కొంపదీసి బయట జరిగే ప్రచారాలకు తగినట్టే షణ్ముఖ్‌ను విజేతను చేయడం లేదు కదా… ఫాఫం, నాగార్జునను పిచ్చోడిని చేయడం లేదు కదా బిగ్‌బాస్ టీం… సన్నీ కాస్త ఎక్సెంట్రిక్ కేరక్టర్…
https://twitter.com/vamccrishnaa/status/1469164164195119104?t=KOCpVhORGNgR3DwIa-O7Sg&s=04&fbclid=IwAR1WE56dFgssC1TqCTpqr4XsoUjY2fnH6pZYxzN0UROSXHbe3pCqdVh-yFI
ఇక మిగిలేది ఇద్దరు… మానస్, శ్రీరాంచంద్ర… మొదటి నుంచీ హౌజులో హుందాగా, బ్యాలెన్స్డ్, మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తున్నారు… మొదట్లో శ్రీరాంచంద్రకు హమీదాతో, మొన్నమొన్నటిదాకా ట్రాన్స్‌జెండర్ ప్రియాంకతో మానస్‌కు లవ్ ట్రాకుల్ని చూపించారు… అవీ కడుపులో నుంచి వచ్చిన ప్రేమలు ఏమీ కావు, జస్ట్, షోకు ఓ రొమాంటిక్ టచ్ కోసం ఆడబడిన ఎమోషన్స్… ఐనాసరే, వాళ్లు చిల్లరగా బిహేవ్ చేయలేదు… ప్రియాంకతో మానస్‌తో కొన్నిసార్లు ఏవో పరుష వాక్యాలు చెప్పించినా సరే, అవి జనంలోకి పెద్ద నెెగెటివ్గా పోలేదు… దానికి కారణం మానస్ బిహేవియర్ తీరు… వీళ్లద్దరిలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారా..? లేక ఎనర్జీ, యాక్టివ్ కోణంలో సన్నీ బెటర్ అని ఫిక్స్ అవుతారా…? ఏమో ఇదే జరగవచ్చునేమో… ఆల్రెడీ జరిగిపోయిందేమో… ఏమో…
(అసలు ఈ టీంలో చేరడం శ్రీరాంచంద్ర స్టేచర్‌కు కరెక్టు కాదనే అభిప్రాయం కూడా జనంలో ఉంది… గతంలో కల్పన కూడా వచ్చి నాలుగైదు వారాల్లో వెళ్లిపోయింది… నిజానికి వాళ్ల మీద జనంలో ఉండే అభిప్రాయం వేరు, హౌజులోకి వచ్చి చేజేతులా చెడగొట్టుకోవడమే… మరీ షన్ను, సిరిల సరసన నిలబడటం ఏమిటి శ్రీరాంచంద్రా..? బయటికి వచ్చాక ఒక్కసారి నీకునువ్వే మనోమథనం చేసుకో… బిగ్‌బాస్ వాడు విసిరేసే డబ్బుల కోసమా..?)… ఇప్పుడు వోటింగుల్లో సన్నీ టాప్‌లోకి వచ్చాడని అంటున్నారు, కానీ అది బయట సైట్ల అనఫిషియల్ పోల్స్… బిగ్‌బాస్ లెక్కలు వేరు… సో, ఈసారి విజేత ఎవరనేదాన్ని బట్టి ఈ షో క్రెడిబులిటీ, రాబోయే రోజుల్లో దానికి పాపులారిటీ ఆధారపడి ఉంటాయి… అసలే ఈసారి సీజన్ రేటింగ్స్ దయనీయంగా పడిపోయి, షో నిర్వాహకులకు చుక్కలు చూపించాయి కదా…!!
Share this Article