RRR …. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఆ సినిమా యూనిట్ రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్, ఆలియా, రాజమౌళి సహా ముఖ్యులు రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషన్ ప్రెస్మీట్లు, ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు… సహజం… బాహుబలి తరువాత వస్తున్న మరో భారీ సినిమా కాబట్టి, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొంటున్నాయి కాబట్టి ఆ సినిమాలోని కేరక్టర్ల మీద ఆసక్తి కూడా క్రియేటవుతోంది… అంతేకాదు, రాజమౌళి తీసుకున్న కథ మీద, ఆయా పాత్రల చిత్రీకరణ మీద వివాదాలు కూడా రాజుకుంటున్నాయి… గిరిజనులు బాగా ఆరాధించే రెండు పాత్రల్ని రాజమౌళి తన కాసుల వేట కోసం క్రియేటివ్ లిబర్టీ పేరిట కమర్షియలైజ్ చేశాడనీ, వాళ్ల చరిత్రను భ్రష్టుపట్టించాడనేది ప్రధాన విమర్శ…
పలుచోట్ల ప్రెస్మీట్లలో విలేకరులే ఆ సినిమా హైపులో ఊగిపోతున్న తీరు కనిపిస్తోంది… జస్ట్, చెప్పింది రాసుకోవడం లేదా వాళ్లే ప్రశ్నల పేరిట ప్రశంసలు కురిపించడం చిరాకెత్తిస్తోంది… కనీసం సమాజంలో వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానాలు రాబట్టాలనే కనీస ప్రయత్నం చాలాచోట్ల కనిపించడం లేదు… ఓచోట ఓ రిపోర్టర్ అయితే రాజమౌళి కాలంలో తాము పుట్టడం, జర్నలిస్టుగా ఉండటం తన జన్మకు సార్థకత అన్నట్టుగా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో కూడా వెక్కిరింపులకు గురైంది… అదొక ఉదాహరణ కావచ్చు, కొన్ని చర్చకు రాకపోవచ్చు… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? రాజమౌళి ఏం తీసినా, ఎలా తీసినా టేక్ ఫర్ గ్రాంట్ అనుకోవాలా..? అద్భుతం అని పాత్రికేయమే ముందస్తుగా చప్పట్లు కొట్టేయాలా..? ప్రేక్షకుడి పాత్ర వేరు, అభిమాని పాత్ర వేరు, జర్నలిస్టు పాత్ర వేరు… ఈ బేసిక్స్ ఏమయిపోతున్నయ్..?
Ads
సరే, కొందరిని అలా వదిలేస్తే… తెలుగులోనే కొందరు విలేఖరులు సరైన ప్రశ్నలు సంధించిన తీరు కూడా బాగుంది… దిగువ టీవీ5 వీడియో క్లిప్ లింక్ ఉంది గమనించండి… ఒకరిద్దరు సరైన ప్రశ్నలు అడిగారు… నిజానికి రాజమౌళే సరైన స్పష్టత ఇవ్వలేకపోయాడు అనిపించింది… ఓ విలేఖరి చెప్పినట్టు మొత్తానికి ‘‘పెద్ద కన్ఫ్యూజన్’’ క్రియేట్ చేశాడు… ఒకాయన అడిగాడు… ‘‘మీరు కుమరం భీం చరిత్ర అన్నారు కదా, జోడేఘాట్లో ఏమైనా షూట్ చేశారా..? ఆయన పోరాటం గురించి అధ్యయనం చేశారా..? ఆ ప్రాంతాలకు వెళ్లి మాట్లాడారా..?’’ దీనికి రాజమౌళి జవాబుగా ‘‘మేం తీసింది బయోపిక్ కాదు, చరిత్ర కాదు’’ అన్నాడు… మరి అల్లూరి, కుమరం పాత్రలే అని మొదట్లో ఇదే రాజమౌళి చెప్పుకున్నాడు… వాళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉండేది అనే అంశమే తన సినిమా కథ అన్నాడు అప్పట్లో… ఇప్పుడేమో చరిత్ర కాదు, బయోపిక్ కాదు అంటున్నాడు…
మరో విలేకరీ అదే ప్రస్తావించాడు… ‘‘రెండు వేర్వేరు టైమ్ జోన్లకు సంబంధించినవాళ్లు ఎలా కలిశారు..? అసలు బ్రిటిష్ సైన్యంలో అల్లూరి పనిచేయడం ఏమిటి..? జనరల్ డయ్యర్లా కనిపిస్తున్నాడు, ఇదేం కన్ఫ్యూజన్..?’’ దానికీ రాజమౌళి జవాబులు క్లారిటీ ఇవ్వలేకపోయాయి సరికదా మరింత అయోమయాన్ని ఆవిష్కరించాయి… ‘‘ఈ కథ ఇక్కడ నడిచింది కాదు, ఢిల్లీలో సాగుతుంది’’ అనేది ఒక జవాబు… సో వాట్..? కథ ఢిల్లీలో జరిగితే ఒరిజినల్ కథ మారిపోతుందా..? మారిపోవాలా..? అసలు ఇద్దరు చారిత్రిక వ్యక్తులు ఢిల్లీలో కలవడమే కల్పన… మరీ అల్లూరి బ్రిటిష్ సైన్యంలో పనిచేయడం అనేది గొప్ప గందరగోళపు ఆలోచన… ఎంత క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నా మరీ ఇంత వక్రీకరణా..? ఈ సందేహం అందరికీ వస్తుంది కదా సహజంగానే…
అందుకే తెలివిగా రాజమౌళి ‘‘ఇది జస్ట్, ఓ కల్పన, ఆ కాలంలో ఆయా ప్రాంతాల గిరిజనుల మానసిక స్థితి మీద, వ్యక్తిత్వాల మీద అధ్యయనం చేసి తీసిన సినిమా’’ అని చెప్పుకొచ్చాడు… తెల్లదొరల పాలనలో తిరగబడ్డ అల్లూరిని ఆదే తెల్లదొరల సైనికుడిగా చూపించడం అంటేనే యాంటీ సెంటిమెంట్… చరిత్రకు ద్రోహం చేయడమే కదా… సో, ఈ వివాదానికి అదే క్రియేషన్ సాకుతో ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నించాడు రాజమౌళి… చరిత్ర కాదు, బయోపిక్ కాదు, జస్ట్, కల్పనే కదా అంటున్నాడు… మొదటి నుంచీ రెండు ఫిక్షనల్ కేరక్టర్స్ అని చెబితే వోకే, కానీ అలా జరగలేదు, సినిమాకు ఓ హైప్, ఓ పవిత్రత కోసం ఆ రెండు పేర్లు వాడుకోవడం, తీరా ఇప్పుడు అబ్బెబ్బే, అవి ఓన్లీ రెండు కల్పనాత్మక పాత్రలు, ఆ కథ కూడా అంతే అంటున్నాడు… అంతేతప్ప, ఇప్పటికీ ఆ పాత్రలకూ అల్లూరికీ, కుమరం భీమ్కూ సంబంధం లేదనడం లేదు… మొత్తానికి సమర్థన, స్పష్టత లేని రాజమౌళి ఆలోచనల్లాగే… ప్రస్తుతానికి ప్రేక్షకుడికీ అంతా అయోమయమే… సినిమా చూడాలిక, సారు గారు తన కథను ఎలా జస్టిఫై చేసుకున్నాడో… అన్నట్టు సార్, బాహుబలి రెండో పార్ట్లాగే ఈ ట్రిపుల్ ఆర్ సినిమాకూ తదుపరి భాగం ఉంటుందా..? వాళ్లిద్దరూ కలిసి ఓ పార్టీ పెట్టినట్టో, అధికారం పంచుకున్నట్టో రాసేయరు కదా… ఏమో… రాసేయగలరు, తీసేయగలరు…!! అదేమంటే, ఫిక్షనే కదా అనొచ్చు… అంతేనా..?! అవునూ, యోగ చేస్తే యోగి అవుతాడా… వావ్, ఏం చెప్పారు సార్..? ఈ సినిమా కథ అంత అద్భుతం…!!!
Share this Article