Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మొత్తానికి రాహుల్‌తో కులం, గోత్రం, మతం అన్నీ చెప్పించేస్తున్నారు..!!

December 14, 2021 by M S R

………. By….. Nancharaiah Merugumala…….. రాహుల్‌ తో కులం, గోత్రం చివరికి మతం ఏంటో కూడా చెప్పిస్తారా? దారుణం!………. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన మూడేళ్లకు తాను దైవభక్తిగల హిందువునని నిరూపించుకోవడానికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రయత్నాలు మొదలయ్యాయి. 2017 డిసెంబర్‌ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన రాష్ట్రంలోని దేవాలయాలన్నీ చుట్టివచ్చారు. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కే.ఆడ్వాణీ రథయాత్ర ఆరంభించిన సోమనాథ ఆలయానికి వెళ్లి, జ్యోతిర్లింగాన్ని కూడా రాహుల్‌ దర్శించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవలేదుకాని బీజేపీకి చావుదప్పి కన్నులొట్టపడినంత పనైంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం బాగా పెరిగింది. ‘మృదు మధురమైన హిందుత్వ’ ను ఇలా అనుసరిస్తే మంచిదేననే నమ్మకం కాంగ్రెస్‌ నాయకత్వానికి కుదిరింది. అయితే, ఆలయ ప్రవేశ పట్టికలో రాహుల్‌ పేరు తర్వాత హిందూవేతరుడు అని రాశారనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నించే క్రమంలో రాహుల్‌ హిందువు కాదని వ్యాఖ్యానించింది. కొందరు కులం పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని బ్రాహ్మణులు, ‘మేం వైదికులం, నియోగులం, సారస్వతులం, దేశస్థులం,’ అంటూ తమ శాఖ లేదా ఉపకులం పేరు మాత్రమే చెబుతారు. తమ ‘శాఖే’ కులం పేరు సూచించే స్థాయిలో ప్రాచుర్యం పొందినప్పుడు ‘కాస్ట్‌’ పేరు చెప్పడం అవమానంగా ఈ బ్రాహ్మణులు భావిస్తారు. ఓ బ్రాహ్మణ స్త్రీకి మనవడైన రాహుల్‌ కూడా ఇదే పద్ధతిలో బీజేపీ ప్రశ్నకు నేరుగా జవాబివ్వకుండా, అంటే హిందువునని చెప్పకుండా తన కులం, ఇష్టదైవం ఏమిటో కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధుల ద్వారా చెప్పించారు.

రాహుల్‌ ‘జనేఊధారి బ్రాహ్మణుడు, శివభక్తుడు’
–––––––––––––––––––––––––––––

‘‘రాహుల్‌ గాంధీ జనేఊధారి (జంధ్యం వేసుకున్న) బ్రాహ్మణుడు, శివభక్తుడు. ఈ వివరాలు చాలా..?’’ అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, హరియాణా జాట్‌ నాయకుడు రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా దిల్లీలో ప్రకటించారు వెంటనే… జంధ్యం లేదా యజ్ఞోపవీతాన్ని హిందీలో జనేఊ అంటారు. జంధ్యం ధరించే బ్రాహ్మణుడు మరి హిందువేగా అనేది కాంగ్రెస్‌ నేత ఉద్దేశం. సూటిగా రాహుల్‌ హిందువు అనే మాట చెప్పకుండా నాలుగేళ్ల క్రితం ఇలా తప్పించుకున్నారు. తెలివైన బ్రాహ్మణులు, హిందువులు కాంగ్రెస్‌ లో ఉన్నంత మంది బీజేపీలో లేకున్నా, ఇలాంటి విషయాల్లో నెహ్రూ–గాంధీ కుటుంబంపై నిప్పులు కురిపించడానికి ఉత్కళ బ్రాహ్యణ వైద్యుడు సంబిత్‌ పాత్రా ఎలాగూ ఉన్నారు. ‘‘ఉజ్జయినీ శివుడి గుడికి పోతున్న రాహుల్‌ ను, ‘మీరు జనేఊధారీయా? అయితే ఎలాంటి జంధ్యం వేసుకున్న వ్యక్తి మీరు? మీ గోత్రం ఏమిటి?’ అని మేం అడగదల్చుకున్నాం,’’ అని పాత్రా చాలా పాత్రోచితంగా ప్రశ్నించారు. వెంటనే అప్పటి కాంగ్రెస్‌ మరో అధికార ప్రతినిధి, ఇప్పటి శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంకా చతుర్వేదీ, ‘బీజేపీ నేతల గోత్రం ‘మోదీయ’. కానీ, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ కార్యకర్తల గోత్రం మాత్రం ‘భారతీయం’, అని తెలివిగా జవాబిచ్చారు. రాహుల్‌ జనేఊధారీయేగాక శివభక్తుడు అని కూడా కాంగ్రెస్‌ వివరించింది. రాహుల్‌ గోత్రం ఏదో చెప్పనే లేదు. ఇందిర మనవడు ఇంతటితో ఆగకుండా తాను రామభక్తుడినని కూడా మధ్యప్రదేశ్‌ పర్యటనలో చెప్పారు. ఈ సమాధానంతో బీజేపీ, ప్రజలు సంతృప్తి చెందరనే భయంతో కాంగ్రెస్‌ అంతటితో ఆగలేదు.

rahul

Ads

2018 చివర్లో తనది దత్తాత్రేయ గోత్రమని పుష్కర్‌ ఆలయంలో వెల్లడించిన రాహుల్‌

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

బ్రాహ్మణులు ఎక్కువగా దర్శించే రాజస్తాన్‌లోని పుష్కర్‌ బ్రహ్మ ఆలయంలో దర్శనానికి పోయిన రాహుల్, ‘తాను కశ్మీరీ బ్రాహ్మణుడినని, తనది దత్తాత్రేయ గోత్రం,’ అని చెప్పారని ఆలయ పూజారి దీనానాథ్‌ కౌల్‌ పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. ‘దేశంలో ఉన్న అతి కొద్ది బ్రహ్మ ఆలయాల్లో ఘనమైనదైనదిగా భావించే ఈ గుడికి మోతీలాల్‌ నెహ్రూ, ముత్తాత జవాహర్‌ లాల్, ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీ, మేనకా గాంధీ, సోనియాగాంధీ కూడా వచ్చారు,’ అంటూ ఈ పూజారి వివరించారు. ఇలా రాహుల్‌ బ్రాహ్మణుడు అనడానికి అర్హత అయిన గోత్రం దత్తాత్రేయ అనీ, అది నెహ్రూ కుటుంబానిదేనని ఆ బ్రహ్మ గుడి పూజారితో ధ్రువీకరించేలా చేసి, ‘సర్టిఫికెట్‌’ సంపాదించారు కాంగ్రెస్‌ నేతలు. ఆ తర్వాత రాహుల్‌ గాంధీ హిందువా? కాదా? అనే వివాదం లేవనెత్తలేదు బీజేపీ. శివభక్తులైన కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో మూలాలున్న రాహుల్‌ గోత్రం కూడా చెప్పాక ఇక దానిపై చర్చ బావుండదని భయపడినట్టున్నారు హిందుత్వవాదులు.

బ్రాహ్మణాధిపత్యం ఉన్న తొలి పెద్ద పార్టీగా పేరుమోసిన కాంగ్రెస్‌ నేతనైన తనను హిందువు కాదని కాషాయ శిబిరం అనడంతో రాహుల్‌ కు కోపమొచ్చింది. బీజేపీ తొలి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మాదిరిగా తానూ బ్రాహ్మణుడననే విషయం తెలివిగా ఆయన నాలుగేళ్ల క్రితమే బహిరంగంగా ప్రకటించుకున్నా, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు ఫాయిదా లభించలేదు. దీంతో మళ్లీ ఇన్నాళ్లకు రాహుల్‌ ఆదివారంం తన పార్టీ పాలనలోని పెద్ద రాష్ట్రం రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌ మహార్యాలీలో తాను, మహాత్మా గాంధీ హిందువులమని చెప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ మళ్లీ దేశంలో అధికారంలోకి వస్తే హిందూ రాజ్యం తెస్తుందని, హిందుత్వ కాదని కూడా ఎంతో ఓపికగా హిందూ, హిందుత్వ అనే రెండు పదాల అర్ధాలకు ఉన్న తేడా వివరించారు. హిందువు అంటే, ‘భయం లేనోడు. అందర్నీ గౌరవించేటోడు, అన్నిటికీ మించి నిరంతర సత్యాన్వేషి, సత్యం కోసం ప్రాణాలు అర్పించేటోడు,’ అనే కొత్త అర్ధాలు చెప్పారు రాహుల్‌. ‘నేను హిందువును. హిందుత్వవాదిని కాదు. పవిత్ర భారతంలో హిందుత్వవాదులను తొలగించి హిందువుల రాజ్యం తేవాల్సి ఉంది,’ అని కూడా రాహుల్‌ స్పష్టంచేశారు.

ఇందిరమ్మ మనవడి మతం, కులం, గోత్రం బలవంతంగా చెప్పిస్తారా? ఎంత ధైర్యం?

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

దేవుడిని నమ్మని జవాహర్‌ లాల్‌ నెహ్రూ తాను హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన విషయం తన పుస్తకంలో రాసుకున్నారు. ఆయనకు జంధ్యం కూడా ఉండేది కాదని జనం నమ్ముతారు. అలాంటిది నెహ్రూ మరణించిన ఐదు దశాబ్దాల తర్వాత ఆయన మునిమనవడితో కాషాయ శిబిరం మొదట తన కులం, గోత్రం చెప్పించి ఆఖరికి మతం కూడా ఒకరకంగా బలవంతంగా చెప్పించడం భారత ప్రజాస్వామ్యం నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. భగవంతుడిని నమ్మకపోయినా, కులం, మతాలను వదిలేసుకున్నా ‘ హిందూ కుటుంబంలో పుడితే చాలు–ఎవరైనా హిందువే ’ అని కేరళ హైకోర్టు 20 ఏళ్ల క్రితమే తీర్పు ఇచ్చింది. కేరళలో మార్క్సిస్టు నేత ఈకే నయనార్‌ ముఖ్యమంత్రిగా ఉండగా వామపక్ష, ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్‌) పాలనలో మన తిరుపతితో పోటీ పడే స్థాయి ఉన్న గురువాయూరు దేవస్థానం (దేవసోం) బోర్డు చైర్మన్‌గా ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యే నియామకాన్ని హైకోర్టులో ఆరెసెస్‌ సవాలు చేసింది. ‘నేను నాస్తికుడినైనా గురావాయూరప్పను ఆరాధించే కోట్లాది మంది ప్రజల కోసం కృష్ణాలయం నిర్వహణ, దేవసోం ఉద్యోగుల బాగోగులు చాలా శ్రద్ధతో, నిష్ఠగా చేస్తున్నాను. నేను దేవసోం పాలకమండలి అధ్యక్షునిగా ఉండడం ఏ మాత్రం ధర్మవిరుద్ధం కాదు,’ అని ఆ కమ్యూనిస్టు మార్క్సిస్టు నేత హైకోర్టుకు విన్నవించుకున్నారు. అంతేగాని పదవి కాపాడుకోవడానికి తాను దైవభక్తి, పాపభీతి ఉన్న హిందువునని అబద్ధమాడలేదు.

కేరళలోని వాయనాడు జనం దయతో పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ తనకు ఎంత ఇష్టం లేకున్నా మలయాళ మార్క్సిస్టుల నుంచి మతం విషయంలో కొంతైనా నేర్చుకుంటే దేశానికి శ్రేయస్కరం అంతేగాని, అయ్యప్ప సామి దర్శనానికి శబరిమల ఎక్కడానికి మహిళలను అనుమతించకూడదనే సంప్రదాయ, ఛాందస వాదనకు మద్దతుగా– కాషాయ కూటమి పక్కన హస్తం పార్టీని చేర్చితే రాహుల్‌–ప్రియాంకలకు వచ్చే రాజకీయ ప్రయోజనం శూన్యం. ఇకనైనా బీజేపీని అనుకరించే ఎత్తుగడలకు కాంగ్రెస్‌ ముగింపు పలికితే మంచిది. పేరుకు పార్టీ జాతీయ అధ్యక్షుడైన హిమాచలీ బ్రాహ్మణుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా నాయకత్వాన నడిచే బీజేపీలో పెత్తనమంతా గుజరాత్‌ కు చెందిన మోద్‌ గాంచీ (తేలీ లేదా గాండ్ల) ప్రధాని నరేంద్ర మోదీ, జైన గృహ మంత్రి అమిత్‌ షాలదే. వారు తాము హిందువులనీ, దేశభక్తులమని పదే పదే చెప్పుకోకుండానే రాహుల్‌ గాంధీతో శివస్తుతి చేయిస్తున్నారు. మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీతో లౌకికతత్వం గురించి, దేశభక్తి గురించి ఉపన్యాసాలిప్పిస్తున్నారు. మహ్మదలీ జిన్నాను ఈ బడా భారతీయ ముస్లిం నేత అవకాశం వచ్చినప్పుడల్లా దూషించేలా చేయగలుగుతున్నారు. దేశంలో ఎన్నాళ్లు నడుస్తుందో మరి ఈ గుజరాతీ ద్వయం పెత్తనం? ఎప్పటికొస్తుందో రాహుల్‌ గాంధీ చెబుతున్న ‘ హిందువుల రాజ్యం ’?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions