పర్లేదు, పనీపాటా లేని సంవాదాలకు, వివాదాలకే కదా సోషల్ మీడియా, మీడియా, వెబ్ మీడియా, ట్యూబ్ మీడియా, టీవీ మీడియా ఎట్సెట్రా ఉన్నవి… అందుకే ఇదీ మాట్లాడుకుందాం… అకస్మాత్తుగా ‘పురుషుల సంఘం’ ఒకటి పుట్టుకొచ్చింది… అడవిలో సింహాలు తమ మనోభావాల రక్షణకు ఓ అసోసియేషన్ పెట్టుకున్నాయనేట్టుగా ధ్వనిస్తోంది… రాబోయే పుష్ప అనే సినిమాలో ఊ అంటావా మామా, ఊఊ అంటావా అనే పాట దురుద్దేశ పూరితమనీ, మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారన్న అర్థం వచ్చేలా ఉందనీ, ఆ పాటలో పదాలతో ఆ అర్థమే వస్తోందనీ, ఆ పాట నిషేధించాలనీ ఆరోపిస్తూ కోర్టుకెక్కింది… అసలు ఈ సంఘం జన్మసందర్భం, పుట్టినతేదీ, సంవత్సరం ఏమిటో… ఇప్పటిదాకా ప్రత్యేకించి ఓ కులం, ఓ వర్గం, ఓ మతం, ఓ కుటుంబం గట్రా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ గగ్గోలు పెట్టడం చూస్తున్నాం… అసలు ఏ వివాదాన్ని గోకుదామా అని వేచిచూసే ఉపాధిజీవులూ బోలెడు మంది ఉన్నారు… కానీ ఇప్పుడు ఏకంగా మగజాతి మనోభావాలే దెబ్బతిన్నాయనడం అసాధారణం… అనూహ్యం… ఇంకా ఈ మనోభావాలు దెబ్బతినే ట్రెండ్ ఏ రేంజుకు పోనుందో కదా…
నిజమే, చంద్రబోస్ ఈమధ్య తానేం రాస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు, కానీ ఫాఫం, వస్తున్న చాన్సులే అరకొర… ఏదో పొట్టపోసుకుంటున్నాడు… ఐటం సాంగు రాయమని సుకుమార్ చెప్పాడు, దేవిశ్రీప్రసాద్ ట్యూన్ చెప్పాడు… అప్పట్లో ఏదో పాట వచ్చిందిగా, గుడివాడ వెళ్లాను, గుంటూరు పోయాను, ఏలూరు, నెల్లూరు, ఎన్నెన్నో చూశాను, ఏడ బోయినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు, చచ్చినోళ్లు, ఆటకు వచ్చినోళ్లు… అని ఆట చూడవచ్చిన మగాళ్లను ఒకటే ఆడిపోసుకుంటుంది, ఇక ఒళ్లు విరుపులు, కళ్ల పిలుపులు గట్రా కామనే… అసలు ఐటమ్ సాంగ్ అంటేనే దానికో కేరక్టర్ ఉంటుంది… చంద్రబోస్ కూడా ఫాఫం, ఆ రూల్ తప్పకుండా, గీత దాటకుండా, ఆడది ఎట్లున్నా సరే మగాళ్లది వంకరబుద్ది మాత్రం మారదు అన్నట్టుగా ఒకటి గీకిపడేశాడు… మరి రాసిందేమో చంద్రబోస్, వాయించిందేమో దేవిశ్రీప్రసాద్, డాన్సాడించిందేమో గణేష్ ఆచార్య, సినిమా తీసిందేమో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, హోల్ మొత్తం బాధ్యత వహించాల్సిందేమో సుకుమార్… వాళ్లేమైనా రుషులా..? పు-రుషులే కదా..? అవునేమో, పురుష్ పుట్టుకలై ఉండి, పురుష్ జాతిని ఇంత బదనాం చేస్తారా అనే కోపమే ‘పురుషుల అసోసియేషన్’కు ఎక్కువగా వచ్చినట్టుంది… ఫెమినిజం, ఫెమినిస్టులు తరహాలో ఇక పురుష్ జాతి కూడా మెనిజం, మెనిస్టుల అంటూ ఉద్యమించడానికి ఇది శ్రీకారం అన్నమాట… దానికి పరోక్షంగా దోహదపడుతున్నది చంద్రబోసుడే అన్నమాట…
Ads
ఫాఫం, నిర్మాత డబ్బులిస్తానన్నాడు… సమంత యాక్ట్రెస్… ఇప్పుడు నేను అక్కినేని ఫ్యామిలీ సభ్యురాలిని కాను, ఏ పాత్రయినా సరే, ఎంత బోల్డయినా సరే అని చెప్పడానికి ఈ ఐటం సాంగ్ అక్కరకొస్తుందిలే అనుకున్నట్టుంది… సరేనన్నది… ఏవో నాలుగు స్టెప్పులు డాన్సింది… ఆమె తప్పేముంది..? ఆ పాటకు అట్లాగే డాన్సాలి… ఇంద్రావతి మళ్లీ ఎల్ఆర్ఈశ్వరి పుట్టింది అన్నట్టుగా భలే పాడింది… ఆ పాట అలాగే పాడాలి, నిర్మాత డబ్బులిచ్చాడు, డీఎస్పీ చాన్స్ ఇచ్చాడు, ఆ గొంతు దేవుడిచ్చాడు… తప్పేముంది..? పోనీ, పాట మీద పడి ఏడుస్తున్నవాళ్లు, పుష్ప నిర్మాత ఇచ్చిన డబ్బులో సగం ఇచ్చినా సరే, అదే చంద్రబోస్ మరో పాట రాసిస్తాడు… ఈసారి పురుష్ పాట… ‘‘ఊ అంటావా పోరీ, ఊఊ అంటావా పోరీ… మీ ఆడబుద్దే వంకరబుద్ది… ఒక్కసారి రుచి మరిగితే చాలు, ఇక సలసల కోరికతో మరిగిపోతారు… వెంటపడతారు, పైపై పడతారు, కైపెక్కీ ఎక్కీ కసికసిగా ఆటాడేస్తారు… ఈ లోకానికి అసలు వైరస్ ఆడదే, అదుగదుగో ఆ ఆడదే’’ అన్నట్టుగా తక్షణం రాసి ఇచ్చేస్తాడు… పోనీ, రాహుల్ సిప్లిగంజ్‌తో పాడించేద్దాం అంటారా..? వోకే..!! ఎటొచ్చీ ఓ మాంచి మగ సమంతుడు కావాలి…!!
Share this Article