మే 2, 2011… అఫ్ఘనిస్థాన్‌లోని ఓ సైనిక స్థావరం నుంచి హెలికాప్టర్లు పైకి లేచాయి… పాకిస్థాన్ సరిహద్దులు దాటేశాయి… ఓ పేద్ద ఇంటిపై గద్దల్లా వాలాయి… అందులో నుంచి మిడతల దండులా వెల్ ట్రెయిన్డ్ అమెరికన్ నేవీ సీల్స్ దిగారు… వేగంగా కొన్ని గదుల్లోకి దూసుకుపోయారు… అడ్డం వచ్చినవాళ్లను అక్కడికక్కడే షూట్ చేశారు… టార్గెట్ పర్సన్ కనిపించాడు… పట్టుకున్నారు… ఎక్కడికో సమాచారం వెళ్లింది శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా… ఎక్కడి నుంచో ఈ ఆపరేషన్ ‘చూస్తున్న’ వాళ్లు గుర్తించారు… ఫినిష్ అన్నారు… క్లోజ్ రేంజ్లో తుపాకులు పేలాయి… టార్గెట్ అక్కడికక్కడే మరణించాడు… అరగంటపాటు సాగిన ఆ ఆపరేషన్ అనంతరం, ఆ శవాన్ని తీసుకుని హెలికాప్టర్లు వెనక్కి తిరిగాయి… శవాన్ని ఎక్కడో ఎవరికీ తెలియని సముద్రం మధ్యలో సమాధి చేసేశారు…
ఎస్… ప్రపంచ నంబర్ వాంటెడ్ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన రోజు జరిగింది ఇదే… అమెరికా చెప్పింది కూడా అదే… జనం చదివింది కూడా అదే… కానీ ఆ కీలకమైన ఆపరేషన్ వెనుక ఇజ్రాయిల్ ఉంది… వరల్డ్ నంబర్ వన్ గూఢచార సంస్థ మొసాద్ ఉంది… అదే ఇప్పుడు బయటపడిన మరో ఇంట్రస్టింగు విషయం…
Ads
ఎవరో చెప్పింది కాదు… 2017 వరకు సీఐఏ చీఫ్‌గా ఉన్న జాన్ బ్రెనన్ స్వయంగా చెప్పాడు… ఇజ్రాయిలీ న్యూస్ డెయిలీ హరీజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెబుతూ… మొసాద్ పేరు మాత్రం ప్రస్తావించకుండా… ఈ లాడెన్ ఆపరేషన్ గురించీ, ఇజ్రాయిల్ సహాయం గురించీ చెప్పుకొచ్చాడు… ఆ సమాచారాన్ని బట్టి…
నిజానికి అప్పటికి పదేళ్లుగా లాడెన్ పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడు… అబ్బే, లాడెన్ ఆచూకీ మాకు తెలియదు అంటూ పాకిస్థాన్ ప్రపంచానికి చెబుతూ వచ్చింది… ఒకవైపు అమెరికా నుంచి ఉగ్రవాద నిరోధక నిధులు దండుకుంటూనే, మరోవైపు లాడెన్‌ను దాచుకుంది… ఆ ఏరియా పేరు అబొటాబాద్… లాడెన్ ఉండే ఆ రహస్య నివాస స్థావరం కూడా పాకిస్థాన్ సైనిక స్థావరానికి దగ్గర్లోనే ఉండేది… పెద్ద గోడలు, ఎలక్ట్రిక్ వైరింగు… ఎప్పుడూ పెద్దగా అలికిడి ఉండకుండా జాగ్రత్తలు… తగు రక్షణ ఏర్పాట్లు…
సమాచార సేకరణలో, గూఢచర్యంలో, టార్గెట్‌ను వేటాడటంలో ఇజ్రాయిలీ ఇంటలిజెన్స్ సంస్థ మొసాద్ ప్రపంచంలోనే నంబర్ వన్… అమెరికన్ గూఢచార సంస్థ సీఐఏ లాడెన్ ఆచూకీ తీయడంలో నానా తిప్పలూ పడుతూ… ఇజ్రాయిల్ సాయం కోరింది… మొసాద్ ఏజెంట్లు రంగంలోకి దిగారు… కొన్నిరోజులకే లాడెన్ ఉనికి దొరికిపోయింది… ఖచ్చితమైన భౌగోళిక అనవాళ్లతోసహా సీఐఏకు చేరవేశారు… బయటికి చెప్పడం లేదు గానీ, లాడెన్ ఆపరేషన్ నిజానికి ఓ సంయుక్త ఆపరేషన్ అంటారు…
లాడెన్ ఆపరేషన్ అయ్యాకే అమెరికా ఇక పాకిస్థాన్‌ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది… ఇండియాకు దగ్గర కాసాగింది… దాంతో పాకిస్థాన్ చైనాకు ఇంకా దగ్గరయింది… పాకిస్థాన్ ఎంత రోగ్ కంట్రీయో తెలిసీ చైనా ఎంటర్టెయిన్ చేస్తోంది… ఇటు ఇండియా, అటు మధ్య ఆసియా కోణంలో చైనాకు పాకిస్థాన్ అవసరం… అయితే పాకిస్థాన్ అనే ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయ్యే ఉగ్రవాదం జింజియాంగ్ ప్రావిన్స్ మీదుగా చైనాలోని మరికొన్ని ప్రాంతాలకూ విస్తరిస్తే గానీ చైనాకు ఆ సెగ ఏమిటో తగలదు, తెలియదు…!!
Share this Article