….. By….. Bharadwaja Rangavajhala……. టైటిల్స్ పడేప్పుడు పాటలు బాపు సిన్మాల్లో… టైటిల్స్ అని సదువుకున్నోళ్ళు అంటారుగానీ… మాబోటి పామరులు పేర్లు పడటం అంటారు కదా… ఆ పేర్లు పడేప్పుడు… పాట పెడతారన్న మాట. అలా ముత్యాల ముగ్గులో శ్రీరామ జయరామ సీతారామా … అంటూ… అంతకు ముందు పలుకే బంగారమాయెరా అంటూ అందాలరాముడులోనూ … మధ్యలో మేలుకో శ్రీరామా అంటూ శ్రీ రామాంజనేయ యుద్దంలోనూ, పేర్లు పడేప్పుడు వచ్చే నేపధ్య గీతాలు బాలమురళితో పాడించారు బాపు రమణలు… ఇలా పేర్లు పడేప్పుడు పాట పెట్టడం బాపు గారికో సరదా…
ఇది కొంతకాలం సాగింది. నిజానికి ఇలా పేర్లు పడేప్పుడు వచ్చిన పాటలు అంటే… ఇతర దర్శకులవి కూడా కలిపి ఓ జాబితా తయారు చేయాలి మన పరిశోధకులు. ఇలా మూడు పాటలు బాలమురళీ పాడారు. సాక్షిలోనేమో డప్పుల మోత పెట్టి సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేశారు. త్యాగయ్యలోనూ శ్రీ గణపతినీ అని బాలసుబ్రహ్మణ్యంతో ఓ పాట, అదేలెండి, బాబూ కీర్తన పాడించారు. నాకు మాత్రం … తూర్పు వెళ్లే రైలులో వేగుచుక్క పొడిచిందీ పాటంటే ఇష్టం. భలే ఉంటుంది. లోకంలోని వెలుగూ నీడా లోతులు చెప్పాలీ, రేపటి రూపును లోపలి కళ్లకు నేడే చూపాలీ … అంటూ సాగుతుంది, అదీ బాలూనే పాడారు.
Ads
ఇక స్నేహం సినిమాలో అయితే … ఎగరేసిన గాలిపటాలూ … దొంగాటా దాగుడు మూతలూ … అంటూ పీబీ శ్రీనివాసు పాడిన పాత జ్ఞాపకాలను కెలికే గీతం. వెంటాడే గీతం… హంటింగ్ మెలడీ అంటారు కదా సదూకున్నోళ్ళు అదన్నమాటండి. ఇక గోరంత దీపంలోనేమో కొండంత వెలుగు గీతం… సరే గానీ … పెళ్ళీడు పిల్లలులో పరువపు వలపుల సంగీతం వాడుకున్నారు. సరే, ఆ యొక్క పెళ్లి పుస్తకంలో శ్రీరస్తూ శుభమస్తు కూడా ఉందనుకోండి. రాధా కళ్యాణంలో మంత్రాలు అర్ధాల బోధనతో పని కానిచ్చేసారు.
పెళ్లి మంత్రాలకు సంబంధించిన ఏ అనుమానం ఎప్పుడు వచ్చినా రాధా కళ్యాణం సిన్మా పేర్లు చూస్తూ వినండి అంతే… అర్ధం అయ్యిందా..? అంచేత ఏవిటంటే… అలా బాలమురళితో పేర్ల పాటలు పాడించుకున్న బాపు రమణలు పక్కన స్వగతంబు అంటూ ఆంధ్రజ్యోతి వారపత్రికలో వారం వారంలో ఒక పేజీడు అవీ ఇవీ చెప్పిన డాక్టర్ తంబు. ఈ తంబుడు గోరింటాకు తదితర సినిమాల్లో తెరమీద కనిపిస్తాడు కూడాను. విశాఖలో తీసే సినిమాలకు సహకారం అందించేవాడు. నేడు బాపుగారి జయంతి కదా… అంచేత ఒక్కసారి ఆయనతో సహా నలుగురికీ దణ్ణం పెట్టేస్తే బాగుంటుందని … ఇలా …
Share this Article