కాశీ అనగానే ఒక్కొక్కరికీ కడుపు మంట దేనికో అర్థం కాదు… అదొక మహాస్మశానం… అక్కడే మరణించాలనీ లేదా అంత్యక్రియలు అక్కడే జరిగిపోవాలనీ లేదా చచ్చేలోపు ఒక్కసారైనా కాశి వెళ్లిరావాలనీ సగటు హిందువు కోరిక… అస్థికల నిమజ్జనానికీ అదే, పుణ్యస్నానాలకూ అదే… అత్యంత ప్రాచీననగరం ఎప్పుడూ వైరాగ్య, ముక్తిసాధన భావనలకు వేదిక… హైందవ కర్మలకు ప్రతీక… మొన్న ప్రధాని మోడీ ఏమన్నాడు..? ‘‘నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్‌ను తరిమికొట్టిన ధైర్యం ఇది’’ అన్నాడు… అవునా..? కాశి ప్రజలు ఓ బ్రిటిష్ గవర్నర్ జనరల్‌ను తరిమి కొట్టారా..? ఎంత స్పూర్తి..? మరి మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు కనిపించలేదు మనకు ఇన్నేళ్లూ..? అసలు మనం పిల్లలకు బోధిస్తున్న సిలబస్ మన దేశపు చరిత్రేనా..? ఇంతకీ ఈ తిరుగుబాటు కథేమిటి..?
ఘోడే పర్ హౌదా, హాథీ పర్ జీన్, కాశీ సే భాగా వారన్ హేస్టింగ్స్ అని ఓ ప్రసిద్ధ సామెత… ఆ సామెత వెనుక కథే ఈ తిరుగుబాటు కథ… నిజానికి మనం ఇన్నేళ్లుగా చదువుకుంటున్న సిపాయిల తిరుగుబాటు ఆంగ్లేయలపై తొలి తిరుగుబాటు కాదు… ఈ కాశి ప్రజల తిరుగుబాటే ఆంగ్లేయుల మీద ప్రజల మూకుమ్మడి మొదటి తిరుగుబాటు… ఇది 1781 నాటి కథ మరి… 1194 వరకూ కాశి పట్టణానిది ఓ ప్రభ… అప్పటి కనౌజ్ పాలకులే కాశికి కూడా పాలకులు… ఓసారి ముస్లిం రాజుల చేతుల్లో ఓడిపోవడంతో కాశి ఢిల్లీ సుల్తానులు, మొఘల్స్ అధికార పరిధిలోకి వచ్చింది… క్రమేపీ 18 శతాబ్దం నాటికి అవధ్ నవాబ్ పాలనలోకి వచ్చింది…
Ads
అప్పట్లో మన్సా రామ్ అనే భూమిహార్ బ్రాహ్మణుడు గంగాపూర్‌కు జమీందారుగా ఉండేవాడు… అది కాశీకి దగ్గరలోనే ఉండేది… తను అవధ్ నవాబు నుంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు… తరువాత బల్వంత్ సింగ్ రాజయ్యాడు… ఆయన వారసుడిగా మనమడు మహిప్ నారాయణ్ సింగ్ పగ్గాలు చేపట్టాల్సి ఉంది… కానీ ఈలోపు బల్వంత్ సింగ్ రెండో భార్య, రాజ్‌పుత్ స్త్రీ, ఆమె కొడుకు చేత్ సింగ్ కలిసి అవధ్ నవాబుకు భారీగా లంచాలు చెల్లించి రాజ్యాధికారం తమదే అని ప్రకటించుకున్నారు… 1771లో చేత్ సింగ్ కాశీకి రాజు అయిపోయాడు… కానీ బ్రిటిష్ పాలకులు ఊరుకోరు కదా, ఏదో ఓ సాకు చూపి, వారసులను గద్దె దింపి, తాము పాలకులు కావడం ఆనాటి వాళ్ల నీతి… ఇక్కడా సందు దొరికింది వాళ్లకు…
1781…. వారెన్ హేస్టింగ్స్ మద్రాస్ రాజు హైదర్ అలీతో యుద్ధం చేయాల్సి వచ్చింది… దాంతో 1778లో, 1779లో అదనపు చెల్లింపులు చేయాల్సిందిగా చేత్ సింగ్ ను ఆదేశించాడు… అంతేకాకుండా 2000 మందితో ఓ సైనిక దళాన్ని పంపాల్సిందిగా కూడా కోరాడు… కొంతకాలం మౌనంగా ఉన్న చేత్ సింగ్ చివరకు ఒక వెయ్యి మందితో దళాన్ని పంపించాడు. ఇది వారెన్ హేస్టింగ్స్ కు ఆగ్రహం తెప్పించింది… దాంతో చేత్ సింగ్ కు గుణపాఠం నేర్పేందుకు 500 మంది దండుతో కాశీపై దండయాత్రకు బయలుదేరాడు… అప్పుడంతా అదే పాలన శైలి కదా వాళ్లకు… (నిజానికి ఈ హేస్టింగ్స్ ఓ పెద్ద విఫల పాలకుడు, బ్రిటిషర్లకే ఈయనపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు..)
వారెన్ హేస్టింగ్స్ వారణాసి చేరుకున్నాడు… కబీర్ చౌడాలో బస… చేత్ సింగ్ మర్యాదకు ఆయనను కలిసేందుకు ప్రయత్నించాడు… హేస్టింగ్స్ తిరస్కరించాడు. అంతేకాదు, చేత్ సింగ్ పై అరెస్ట్ వారెంట్ జారీచేశాడు.., 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు… ఆగస్టు 16న చేత్ సింగ్ ను అరెస్టు చేయనున్నారనే సమాచారం వ్యాపించింది… అది కాశీ ప్రజలను కదిలించింది… ప్రజలంతా కూడా చేత్ సింగ్ బస చేసిన శివాలా భవనానికి వెల్లువెత్తారు… నిజానికి అప్పటికే చేత్ సింగ్ గృహనిర్బంధంలో ఉన్నట్టు లెక్క… కాపలాగా కొంతమంది బ్రిటిష్ సైనికులు కూడా ఉన్నారు… ఇంకేం..? ప్రజలకు, బ్రిటిష్ సైనికులకు మధ్య గొడవ జరిగింది.
ఆ సమయంలో చేత్ సింగ్ తెలివిగా తన తలపాగాను తాడులా ఉపయోగించి తప్పించుకున్నాడు… అదే సమయంలో ప్రజలు, రాజు సైనికులు కలిసి బ్రిటిష్ సైనికులను తరిమివేశారు… దాంతో వారెన్ హేస్టింగ్స్ ఆ రాత్రికి రాత్రి ఏనుగుపై సమీపంలోని చునౌడ్ కోటకు పారిపోయాడు. ఏనుగుపై కాదు, మహిళల పల్లకీలో దొంగచాటుగా జనం కళ్లుగప్పి పారిపోయాడు అనే ప్రచారం కూడా ఉంది… ఏదయితేనేం… 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సమరానికి 76 ఏళ్లకు ముందే బ్రిటిషర్లపై ఓ స్పూర్తిదాయక తిరుగుబాటు అన్నమాట… మరి మన ప్రజలకు ఇలాంటి పాఠాలు ఎందుకు చెప్పడం లేదు సార్ మనం..?!
Share this Article