నో డౌట్… అల్లు అర్జున్ నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కాడు… పుష్ప సినిమా తనలోని నటుడిని మరింత బాగా ఎక్స్పోజ్ చేసింది… ఆ మాస్ లుక్కు, ఆ చిత్తూరు యాస, తన బాడీ లాంగ్వేజీ పూర్తిగా ఓ భిన్నమైన బన్నీని చూపిస్తాయి… నిజానికి సినిమా అంతా తనే కనిపిస్తాడు… అవున్లెండి, తెలుగు సినిమాల్లో హీరోలు తప్ప మిగతావాళ్లు ప్రముఖంగా కనిపించకూడదని కదా అలిఖిత సూత్రం… వాస్తవంగా ఈ సినిమా మీద సూపర్ హైప్ ఏర్పడటానికి కారణాలు… అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ కావడం, అంతకుముందు సుకుమార్ తీసిన రంగస్థలం సూపర్ హిట్ కావడం, పుష్పలోని పాటలు జనానికి బాగా ఎక్కేయడం, బన్నీ ఓ భిన్నమైన కేరక్టర్లో కనిపిస్తుండటం… కానీ మ్యాజిక్ అన్నిసార్లూ రిపీట్ కావాలనేమీ లేదుగా… 2004 ఆర్య నుంచీ సుకుమార్, బన్నీల నడుమ అనుబంధం ఉంది… బన్నీని ఓ డిఫరెంట్ హీరోగా నిలబెట్టిందే సుకుమార్… దేవిశ్రీప్రసాద్ సరేసరి… కానీ ఆ కాంబినేషన్ ఈసారి అంతగా వర్కవుట్ కానట్టుంది…
రంగస్థలంలో రాంచరణ్ హీరోయిజం తాలూకు భ్రమ బట్టలన్నీ విప్పిపారేసి.., ఓ చెవిటి, గ్రామీణ, బోర్ ఆపరేటర్ పాత్రలోకి అచ్చంగా ఒదిగిపోయడు… సేమ్, సమంత కూడా పలుచోట్ల మేకప్ కూడా లేకుండా కనిపించింది… వర్తమాన తెలుగు హీరో అంటే ఇలాగే మడతనలగని ఫైవ్ స్టార్ టైపులో ఉండి, ఓ రెండు స్టెప్పుల డాన్సులు, రెండు ఫైట్లు చేస్తే చాలుననే సంప్రదాయ, ఛాందస భావనల్ని ఈ పాత్ర బద్దలు కొట్టింది… పుష్ప విషయంలో కూడా సుకుమార్ అదే ట్రై చేశాడు… కానీ రాంచరణ్ పాత్ర మీద ప్రేక్షకుడికి సానుభూతి, ప్రేమ ఏర్పడుతుంది, అన్న మీద ప్రేమ, అందరితోనూ కలుపుగోలుతనం.., గుంభనంగా ఉంటూ, తనను తాను పూర్తిగా డౌన్ ప్లే చేసుకుని, అంతిమంగా విలన్ మీద కోపాన్ని తీర్చుకోవడం… కానీ పుష్పలో బన్నీ పాత్రకు ఉదాత్తత లోపించింది… ఎంతసేపూ కలప స్మగ్లింగులు, గ్రూపులు, ఎత్తుగడలు, డిష్యూం డిష్యూం…
Ads
ఎందుకో గానీ రష్మిక పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది… ఆమె పాత్రకు ఎలాగూ ఏ ప్రాధాన్యమూ లేదు… ఒకటీరెండుచోట్ల అవకాశమున్నప్పుడు కాస్త మెరిసింది గానీ ఓవరాల్‌గా ఆమె పాత్ర సోసో… నిజానికి ఈ సినిమాలో పాటలు కూడా రంగస్థలం సినిమా పాటల స్థాయిలో ఆల్రెడీ హిట్… ప్రత్యేకించి ఊ అంటావా మావా, ఊఊ అంటావా మావా అనే ట్యూన్, ఇంద్రావతి టోన్ చెవుల్లో చాలాసేపు గింగురుమంటూనే ఉంటుంది… సమంత కూడా బాగా నర్తించింది… మనకు తెలిసిన సమంత వేరు, ఈ ఐటమ్ సమంత వేరు… కాకపోతే సినిమా నేపథ్యానికి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం దేవిశ్రీప్రసాద్ పెద్దగా కాన్సంట్రేట్ చేసినట్టు అనిపించదు…
పాటలు, ఫైట్ల, బన్నీ డిఫరెంట్ లుక్కు మీద పెట్టిన శ్రద్దను దర్శకుడు కథ మీద, కథనం మీద పెట్టినట్టు లేడు… ప్రత్యేకించి చివరి అరగంట, క్లైమాక్స్ సినిమాకు పెద్ద మైనస్ అయిపోయాయి… ఈ దెబ్బకు బన్నీ పడ్డ శ్రమంతా వేస్టయినట్టయింది… పైగా సుదీర్ఘమైన రన్ టైమ్… ఎడిటింగ్ నైపుణ్యం కనిపించలేదు… పేరుకు మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్‌ను పెట్టారు… బహుశా మలయాళ మార్కెట్ కోసమేమో… కానీ తన పాత్ర ఎందుకు పెట్టారా అన్నట్టుంది… (సినిమా రెండో పార్టులో ఇరగదీస్తాడేమో…) సునీల్ పాత్ర గురించి చెప్పుకోవాలి… ఇన్నాళ్లూ తను హీరో వేషాలు వేస్తున్నా సరే కమెడియన్ సునీలే కనిపించేవాడు… కానీ ఈ పాత్ర కొత్త సునీల్‌ను చూపించింది… అనసూయ పాత్ర వేస్టు, వేస్టున్నర… నెగెటివ్ షేడ్స్ ఉన్న కథానాయకుడి పాత్ర అయితే దానికి బలమైన, కన్విన్సింగ్ జస్టిఫికేషన్, అంతిమంగా ఓ మార్పు గట్రా చూపించేవాళ్లు గతంలో… ఇప్పుడదంతా ఏమీ లేదు… గొడ్డలి చేత్తో పట్టుకుంటే… తగ్గేదేలే…!!
Share this Article