పుష్ప… ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నయ్… తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తరక్తం అన్వేషణలో ఉంది… పాతబడిన నీటిని బయటికి పంపేసి, కొత్తనీటిని నింపుకునే పనిలో పడింది… సింగర్స్ విషయంలో సంగీత దర్శకులు కొత్త సింగర్స్‌కు, ఫోక్ సింగర్స్‌కు కూడా ఎలా మంచి చాన్సెస్ ఇస్తున్నారో మనం మొన్న ఇంద్రావతి, మౌనిక వంటి ఉదాహరణలతో చెప్పుకున్నాం కదా… వాళ్లు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు… ఊ అంటావా ఊఊ అంటావా పాట మామూలు హిట్ కాదు కదా… సేమ్, నటీనటులకు సంబంధించి కూడా ఇండస్ట్రీ సీరియస్‌గానే కొత్త నెత్తుటి కోసం వెతుకుతోంది… ఇదొక కొత్త ట్రెండ్… వెండితెరకు కొత్తదనం అద్దడమే కాదు, వెలుగులోకి రాకుండా ఉన్న మెరిట్‌ను పైకి లేపడం…
రకరకాల వెబ్ సీరీస్ వస్తున్నయ్, షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నయ్… టీవీ సీరియళ్లు సరేసరి… వాటిని జాగ్రత్తగా గమనిస్తున్న దర్శకులు కొందరు వాటిల్లో తమకు కావల్సిన ‘‘మెరిట్’’ పసిగడుతున్నారు… పికప్ చేసుకుంటున్నారు… చాన్సెస్ ఇస్తున్నారు… వెబ్ సీరీస్ అదనపు ప్రయోజనం అన్నమాట ఇది… వెబ్ సీరీస్ చాలామంది కడుపు నింపుతున్నయ్, ఇదుగో ఇలా అవకాశం, అదృష్టం కలిసొస్తే వెండితెరకు ఎక్కిస్తున్నయ్… ఓ మంచి ఉదాహరణ… జగదీష్ ప్రతాప్ బండారి… వరంగల్ కుర్రాడు… చాలామంది రివ్యూయర్లకు తన పేరు తెలియక ‘‘బన్నీ ఫ్రెండ్ కేశవ పాత్ర చేసిన ఆర్టిస్టు బాగా చేశాడు’’ అని రాస్తున్నారు… నిజమే, సినిమాలో ప్రధానంగా మెరిశాడు…
Ads
ఫోటో చూశారుగా… తనే… సినిమాలో బన్నీని వదిలేయండి, తన కెరీర్‌లో ఇంకో మెట్టు ఎక్కాడు… జబర్దస్త్ పాత్ర పడింది… సునీల్ విలనీ కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు… రావు రమేశ్‌ను వాడుకోలేకపోయారు… చివరకు రష్మిక కూడా డల్ అనిపించింది… బొచ్చెడు పాత్రలు వస్తుంటయ్, పోతుంటయ్… కొన్ని సినిమా అయ్యాక అసలు గుర్తే ఉండవ్… కానీ అందరూ ఏకాభిప్రాయంతో చెప్పింది కేశవ పాత్రలో ఈ కొత్త కుర్రాడు బాగా చేశాడు అని..! తనను కొత్త పోరడు అనే వెబ్ సీరీస్ చూసి, పికప్ చేసుకున్నారు… తనే కాదు, సునీల్ బామ్మర్ది వేషం వేసిన తిరంగదాస్ నాగరాజును కూడా… తనది నల్గొండ జిల్లా… ఐటీ జాబ్ వదిలేసి మరీ సినిమా ప్యాషన్‌గా చేసుకున్నాడు… ఇలా సుకుమార్ కొందరిని స్వయంగా ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేసుకున్నాడు… (చిన్న చిన్న పాత్రలు చేసుకునే దయానందరెడ్డి అలియాస్ దయ… అనగా రష్మిక తండ్రి… తనకు కూడా కాస్త పెద్ద పాత్రే దక్కింది ఈ సినిమాలో…)
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కావల్సినంత మెరిట్ ఉంది… యాక్షనే కాదు, సినిమాకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ… ఎటొచ్చీ వాళ్లను వెతికిపట్టుకోవడం, సరిగ్గా ఆ మెరిట్ వాడుకోవడం అవసరం… కొందరు దర్శకులే చేస్తున్నారు ఈ పని… వర్మ కూడా తన పాత్రలకు సరైన వాళ్లను భలే పట్టుకుంటాడు, కానీ దురదృష్టం ఏమిటంటే ఆ సినిమాలూ నడవవు, వాటిల్లో పనిచేసినవాళ్లను మళ్లీ ఎవరూ దేకరు… పిలవరు… అదొక చిత్రమైన క్యాంపు… కొత్త నీరు రావాలి సరే, మరి పాత అనుభవం మాటేమిటి..? వాళ్ల ఉపాధి మాటేమిటి..? సినిమాల్ని నమ్ముకున్నవాళ్లే కదా అంటారా..? తప్పదు… పాత, కొత్త కలయికతోనే సినిమాను రంగరించాలి… మెల్లిమెల్లిగా పాతదనం ఓ పక్కకు తొలగిపోతూనే ఉంటుంది… కాలం చెప్పేది కూడా అదే..!! ఇంతకూ ‘‘కేశవ’’ ఏమంటాడంటే… ‘‘రెండేళ్లుగా పుష్ప టీంతో జర్నీ చేస్తున్నా, ఇప్పుడు సినిమా విడుదలయ్యాక బోలెడు కాల్స్, అభినందనలు, సోషల్ మీడియా గ్రీటింగ్స్… ఆనందంగా ఉంది సార్… చేయగలనా లేదా అనే బెరుకు ఉండేది మొదట్లో… బన్నీ, సుక్కు సార్లు భలే ఎంకరేజ్ చేశారు…’’
https://www.canva.com/design/DAEpWZaXqBU/Jk2YCLuiPcV1xbeRvqBZgw/view?website#2:cover about jagadish pratap
Share this Article