మీరు చదివిన శీర్షిక నిజమే… నేను తప్పు రాయలేదు, మీరు చదివిందీ తప్పు కాదు… 250 కుక్కపిల్లల ప్రతీకార హత్య జరిగింది… కుక్కపిల్లలను హతమార్చడం వరకూ వోకే, కానీ ప్రతీకారం ఏమిటి..? ఎవరు తీర్చుకున్నారు..? ఎందుకు ప్రతీకారం..? అసలు హంతకులు ఎవరు..? ఇదీ కథ… కాదు, వార్త…! ఓ బీభత్సమైన వార్త… తెలంగాణ పల్లెల్లో కోతుల విధ్వంసకాండ చూస్తూనే ఉన్నాం కదా… ఆ సమస్యకు పరిష్కారమే కనిపించడం లేదు… పంటలు, ఇళ్ల ధ్వంసం కొనసాగుతూనే ఉంది… కుటుంబనియంత్రణలు, పట్టుకెళ్లి అడవుల్లో వదిలేసిరావడం, కొండముచ్చులు… ఏ సొల్యూషన్ కూడా పనిచేయడం లేదు… అసలు ఈ సమస్య తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఉంది… మహారాష్ట్ర బీడ్ జిల్లాలో కూడా ఉంది…
ఆ జిల్లాలో మజలగాం అనే ప్రాంతం ఉంది… అక్కడ లవూల్ అనే ఓ పల్లె ఉంది… నెల రోజుల క్రితం కొన్ని కుక్కలు ఓ కోతిపిల్లను కరిచి కరిచి చంపేశాయి… ఆ హత్యకు కారణం తెలియదు, కుక్కలు ఓ సమూహంలా దాడి చేసి మరీ కోతిపిల్లను హతమార్చాయి… దీంతో అక్కడి వానర సమూహం అంతా భేటీ వేసింది… ప్రతీకార హత్యాకాండకు ప్లాన్ చేసింది… నిజం… అదే జరిగింది.., మనమూ కుక్కపిల్లలకు చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రణాళిక… కానీ చంపడం ఎలా..? కుక్కల ముఠాలకు పాఠం చెప్పడం ఎలా..? ఎలాగైనా చేయాలి… ఛలో, కదిలినయ్…
Ads
కుక్కపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, కోతులు ఓ గ్రూపుగా వెళ్లి రౌండప్ చేయడం, కాస్త బలిష్టంగా ఉండే ఆ కుక్కపిల్లలను అమాంతంగా ఎత్తుకుని… ఎత్తయిన చెట్ల కొమ్మల దాకా వెళ్లిపోవడం, అక్కడి నుంచి నేలకు గట్టిగా విసిరేయడం… ఆ దెబ్బకు చస్తే సరి, లేకపోతే మళ్లీ అదే రిపీట్… ఎత్తయిన బిల్డింగుల మీద నుంచి కూడా… నమ్మశక్యం కావడం లేదా..? నెల రోజుల్లో కనీసం 250 కుక్కల్ని, కుక్కపిల్లల్ని ఇలాగే చంపేశాయి… మూడు నాలుగు కుక్కల మంద కనిపిస్తే పదీపదిహేను కోతులు రౌండప్ చేయడం, చెదరగొట్టడం, ఓ కుక్కపిల్లని ఎత్తుకుపోవడం, హతమార్చడం… కొన్నాళ్లుగా వాటికి ఇదే పని…
అచ్చం మనుషుల్లో వర్గపోరాటంలాగే… ప్రస్తుతం లవూల్ అనే గ్రామంలో కోతులు ఒక్క కుక్కను కూడా వదిలిపెట్టలేదు… చంపేశాయి… ఇప్పుడు ఆ ఊళ్లలో కుక్క కనిపిస్తే ఒట్టు… అంతేకాదు, అడ్డం వచ్చిన మనుషులపైనా దాడులు, స్కూల్కు వెళ్లే పిల్లల మీద దాడులు… దీంతో ఠారెత్తిపోయిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు… ఈ రగలిపోతున్న పగలు, ప్రతీకారాల పర్వం నుంచి కాపాడండి బాబోయ్ అని మొత్తుకున్నారు… అటవీశాఖకు ఏమీ చేతకాలేదు… ఓ దఫా ఊరిని సందర్శించారు… అటవీ అధికారులకు కోతులు బెదురుతాయా..? కోతుల నిర్మూలన అటవీశాఖకు అయ్యే పనేనా..? ఒక్కటంటే ఒక్క కోతిని కూడా పట్టుకోలేకపోయారు… వాపస్ వెళ్లిపోయారు… అవమాన భారంతో మళ్లీ వచ్చారు… క్యాంప్ వేశారు… మొత్తానికి కొన్ని కోతుల్ని పట్టుకున్నారు… వాటిని ఏం చేయాలి ఇప్పుడు..? అది మరో సమస్య… ఎన్కౌంటర్ చేయలేరు, ఐనా వాళ్లు లా అండ్ ఆర్డర్ పోలీసులో, ఉగ్రవాద నిర్మూలన ప్రత్యేక బృందాలో కావు… కోర్టుల్లో కేసులు పెట్టలేరు… వాటికి జైళ్లు లేవు, విచారణ సమయంలో వాటిని ఎలా పోషించాలి..? కోర్టులో ఎలా హాజరుపరచాలి… ఇంతకీ ఏం చేయాలబ్బా..?!
Share this Article