చిన్న చిన్న ఇష్యూస్ మీద పోరాటానికి శక్తియుక్తులు వెచ్చిస్తే, పెద్ద పెద్ద ఇష్యూస్ మీద పోరాటం మీద ఫోకస్ పోతుంది అనేది ఓ సహజసూత్రం… అదేసమయంలో దీనికి విరుద్ధసూత్రం కూడా వినిపిస్తుంది… ఏ చిన్న విషయమూ వదిలేయొద్దు, అప్పుడే స్పిరిట్ కంటిన్యూ అవుతుంది అని…! స్థూలంగా చూస్తే మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్ విషయంలో రాజాసింగ్ వైఖరి, హెచ్చరిక, పోలీస్ కేసు చిన్న విషయమే కదా అనిపిస్తుంది, దాన్ని రచ్చ చేయడం అవసరమా అనిపిస్తుంది… నిజానికి తను చెప్పిందంట్లో తప్పుందా..? ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ల విషయంలో వ్యాఖ్యలు చేసి, మనోభావాలు దెబ్బతీశాడా..? అసలు తప్పు ఎక్కడ జరిగింది..? ఎందుకు హిందూ సంఘటన శక్తులు కోపగిస్తున్నాయి..? ఒక్కసారి ఈ దిగువ వీడియో చూడండి… టీవీ9 క్లిప్పింగే…
‘‘ఏ ట్యూనయినా క్రియేషనే కదా… ఆ ట్యూన్‌లో ఐటం సాంగ్ పెట్టవచ్చు, ఓ భక్తి పాటను కూడా పెట్టవచ్చు..’’ అంటూ రింగరింగ అనే పాట ట్యూన్‌లో ‘‘రింగ రింగ దగ్గర స్వామి స్వామి’’ అని పెట్టేస్తే భక్తి పాట అవుతుందంటూ ఓ ఫ్లోలో చెబుతూ పోయాడు… పాడి వినిపించాడు… అలాగే తాజా హిట్టయిన ‘‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’’ పాటను కూడా ఓ ఉదాహరణగా తీసుకున్నాడు… ప్రసాదం, పూలు, కొండ పదాల్ని వాడుతూ ‘‘ఊ అంటావా స్వామీ, ఊఊ అంటావా స్వామీ’’ అని మారిస్తే అది భక్తి పాట అయిపోతుంది కదా అంటూ ఓ క్లారిఫికేషన్ తరహాలో చెబుతూ పోయాడు… నిజానికి తను చెప్పిన కంటెంటు తప్పు కాదు… వాడే పదాలు, సాహిత్యం, భావాన్ని బట్టి అది ఐటం సాంగా..? భక్తి పాటా..? చూడాలి తప్ప ట్యూన్ బట్టి కాదు కదా… అయితే..?
Ads
డీఎస్పీ ఎక్స్‌ప్రెస్ చేసిన తీరు బాగాలేదు… పక్కా ఐటమ్ సాంగ్ ‘‘ఊ అంటావా’’ ట్యూన్‌లో ప్రసాదం, కొండ, మొక్కు, పూలు వంటి పదాల్ని వాడి, పాడి వినిపించిన తీరు కొంచెం వెకిలిగానే అనిపించింది… అసలు తన వ్యక్తీకరణ తీరుకన్నా తను చెబుతుంటే అక్కడే ఉన్న హీరో బన్నీ, ఆ పక్కనే ఉన్న ఎవరో లేడీ (బహుశా వీరోయిన్ కావచ్చు), వేదిక మీద ఉన్నవాళ్లు, ఆహుతుల్లో కొందరు పకపకా నవ్వడం, ఆ వీడియో చూస్తున్నవాళ్లకు దేవుళ్లను వెకిలి చేస్తున్నట్టుగా అనిపించింది… (ఉద్దేశపూర్వకం కాదు, కానీ డీఎస్పీ తీసుకున్న ఉదాహరణ, భక్తిపాటలకు ఆ ఐటం ట్యూన్స్ వర్తింపజేసి పాడిన తీరు బాగాలేదు… (వేదిక మీద డైరెక్టర్, నిర్మాతలు ఉన్నారా వీడియోలో క్లారిటీ లేదు..) అందుకే వేదిక మీద మాట్లాడేటప్పుడు సందర్భశుద్ధి, డొక్కశుద్ధి, మేధోశుద్ది, వాక్శుద్ధి, వ్యక్తీకరణశుద్ధి అవసరమంటారు పెద్దలు… ఇది కొన్ని టీవీ చానెళ్లలో పదే పదే ప్రసారం చేయడంతో రాజాసింగ్ వంటి హిందూ నేతలకు కోపమొచ్చింది…
తను పోలీస్ కమిషనర్‌కు కంప్లయింట్ పెట్టాడు… ఫలానా పాట హిందూ దేవుళ్లను అవమానించేలా ఉంది, అందుకని సదరు మ్యూజిక్ డైరెక్టర్ మీద చర్య తీసుకోవాలని కోరాడు… బయట ఎలా తిరుగుతావో చూస్తాం అన్నాడు… నిజానికి ఆ ఐటం పాట హిందూ దేవుళ్లను కించపరిచేది కాదు… అది పక్కా మాస్ ఐటం సాంగ్… ఎవతో ఓ కాసుల ఆటగత్తె ‘‘మగాళ్లందరిదీ వక్రబుద్ధే, ఎలా ఉన్నా వదలరు సుమీ’’ అని ఆత్మమథనంతో అదోతరహా స్టెప్పులేస్తూ, అన్నీ చూపిస్తూ, కవ్విస్తూ.., చంద్రబోస్ మాటల్లో అదో టైపు శోకాలు పెడుతుంది… ఇదొక క్రియేటివ్ పైత్యం… మళ్లీ అదో వివాదం… మగభావాలు దెబ్బతిన్నాయని ఓ కేసు… అవునూ, రాజాసింగ్… ఆ వేదిక మీదే హీరో, హీరోయిన్, డైరెక్టర్ (?) తదితర పెద్ద తలకాయలన్నీ కూర్చుని పకపకా నవ్వాయి కదా… అది కదా కించపరచడం, మనోభావాల్ని దెబ్బతీయడం అంటే… ఒక్క డీఎస్పీని మాత్రమే బుక్ చేస్తే ఎలా భయ్యా..?!
Share this Article