గతంలోలాగా కాదు… ఇప్పుడు సినిమాల్లో గానీ, టీవీల్లో గానీ, ఓటీటీల్లో గానీ ఏదైనా లాజిక్కు రాహిత్యాలు దొరికితే వదిలిపెట్టడం లేదు నెటిజనులు… ప్రత్యేకించి సబ్జెక్టు మీద అవగాహన ఉన్నవాళ్లు నవ్వుతూనే తమ ఫేస్‌బుక్ వాల్స్ మీద ప్రస్తావిస్తారు, బట్టలు విప్పేస్తారు… ప్రత్యేకించి దర్శకులు, కథా రచయితలు… అనగా స్క్రిప్టు రైటర్లు ముందుగా వర్తమాన ప్రాపంచిక విషయాల మీద అవగాహన పెంచుకోవడం అవసరం… లేకపోతే నవ్వులపాలే… డ్రామా, మెలోడ్రామా కోసం కథ చిత్రీకరణలో పాల్పడే అతిశయోక్తులు గట్రా వేరు… కానీ బేసిక్ నాలెడ్జ్‌కు భిన్నంగా ఇష్టారాజ్యంగా తీసిపారేయడం వేరు… ఉదాహరణకు మిత్రుడు Shaik Karemulla తన వాల్ మీద షేర్ చేసుకున్న ఈ రెండు ఉదాహరణలు చూడండి… ఈ దర్శకులకు జనం నవ్వుకుంటారనే సోయి కూడా లేదు…
కనీస లాజిక్కులు లేకుండా సినిమాలు తీస్తున్న దర్శకులు… పుష్ప సినిమాలో ఒక ఎస్పీని, అంటే ఐపీఎస్ అధికారిని ఓ స్మగ్లర్, అంటే హీరో అల్లు అర్జున్ చడ్డీ మీద నిలబెడతాడు. తర్వాత తాను బట్టలు ఊడదీసి, చడ్డీ మీదే ఉంటాడు. ‘నేను చడ్డీ మీద ఉన్నా పుష్పనే. కానీ నువ్వు చడ్డీ మీద ఉంటే కుక్క కూడా పట్టించుకోదు’ అంటాడు. చిత్తూరు జిల్లాలో కోట్లకు పడగలెత్తిన బడా స్మగ్లర్లు కూడా పోలీసుల చేత చడ్డీ కూడా లేకుండా థర్డ్ డిగ్రీ మర్యాదలు చేయించుకున్న వాళ్లే. చిన్న పెద్దా తేడా లేకుండా ఎర్రచందనం స్మగ్లర్ల మీద పిడి యక్డ్ నమోదు చేశారు. స్మగ్లర్లు అంటే దొంగలే. హీరోలు అవ్వరు. సినిమా కథ కోసం కాసేపు హీరో అనుకున్నా.. ఒక ఐపీఎస్ అధికారి బట్టలు ఊడదీయడం ఓవర్ యాక్షన్. ఐపీఎస్ కాదు కదా.. ఏ స్మగ్లర్ అయినా సరే కనీసం ఒక కానిస్టేబుల్ ను అలా చేసి, బయటపడమని చెప్పండి…
Ads
అఖండ సినిమాలో కలెక్టర్ హోదాలో హీరోయిన్ కార్యాలయానికి తొలిసారి వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పాత్ర పూర్ణ రిసీవ్ చేసుకుంటుంది. ‘ మీ వద్ద శిక్షణ పొందాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు’ అని కలెక్టర్ అడిగితే, ‘ఇక్కడ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్నాను’ అంటుంది పూర్ణ. బ్యూరోక్రాట్ వ్యవస్థ మీద కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా ఈ సన్నివేశం చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వాస్తవానికి సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉంటారు. అంటే కలెక్టర్ హోదా దాటుకుని, కెరీర్‌లో ముందుకు వెళ్లి ఉంటారు. కానీ ఇక్కడ కలెక్టర్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్ర స్థాయి అధికారి. రాష్ట్ర రాజధానిలో పనిచేస్తారు. జిల్లాలో ఏం పని…? అందులోనూ కలెక్టర్ కింద…!!! బోయపాటి లాంటి సీనియర్ దర్శకుడు, బాలకృష్ణ వంటి అగ్ర హీరో సినిమాలో ఇలాంటి లాజిక్ లేని సీన్ పెట్టడం దారుణం. (లాజిక్ లేని సీన్లు బోయపాటి సినిమాల్లో చాలానే ఉంటాయి లెండి)
Share this Article