ఎవరేమైనా అంటే చాలు… చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటూ ఓ హెచ్చరిక జారీ… కానీ భక్తుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా పనిచేయాలనే సోయి కనిపించని టీటీడీ తీరు ఇక ఎప్పుడూ మారదేమో…. ఒక్క ధర్మనిరతుడు, వెంకన్న మీద అమితమైన భక్తిప్రపత్తులు, భక్తుల పట్ల ప్రేమ ఉన్నవాళ్లు పగ్గాలు చేపడితే ఎంత బాగుండు అనే భావన భక్తుల్లో కలిగితే అందులో తప్పుపట్టాల్సింది ఏముంటుంది..? మారాల్సింది సదరు టీటీడీ ఉన్నతాధికారులు… సిబ్బంది… ఎవరో వస్తారు, నాలుగు రోజులు ఉంటారు, పోతారు… ఎక్కడెక్కడి నుంచో పలు వ్యయప్రయాసలకు గురై వచ్చే భక్తుల ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి, దిద్దుకునే ప్రయత్నం చేయాలి… కోట్ల మంది భక్తుల ఆరాధ్యక్షేత్రం అది… అమితమైన ఆధ్యాత్మిక భావన వాళ్లను అక్కడి దాకా తీసుకొస్తుంది… సో, భక్తుల పట్ల, వాళ్ల అభిప్రాయాల పట్ల సానుకూల భావన ఉండాలి… ఎంతసేపూ సెలబ్రిటీల సేవలోనే మునిగితేలితే ఎలా..? ఓ భక్తురాలి ఆవేదన సోషల్ మీడియాలో ఇలా కనిపించింది…
Aruna Mallapragada……….. ఈమధ్య తిరుమల వెళ్ళి వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నాము . తిరుమల ఎందుకో కళా విహీనంగా వుంది.. నిశ్శబ్దంగా ఏ దైవ సంకీర్తన కూడా వినిపించకుండా మూగపోయి వుంది… కర్ణపేయంగా వినిపించే భక్తి గీతాలు అసలే లేవు… ఆలయం మారుమూలలా ప్రతిధ్వనించే అన్నమయ్య గీతాలు, త్యాగరాజ కీర్తనలు ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి, బాలమురళి తదితర సుస్వరాలు మూగపోయాయి.. మాడ వీధులలో కళకళలాడుతూ కనువిందు చేసే ముత్యాల ముగ్గులు లేవు. తిరుమలలో సుప్రభాత వేళ నినదించే వెంకటేశ్వర సుప్రభాతం కూడా మా కాటేజ్ కి వినిపించలేదంటే ఆశ్చర్యమూ, ఆవేదనా ఒకేసారి కలిగాయి.. అంతకంటే బాధ కలిగించే విషయం, మేము శ్రీవారి దర్శనం కోసం వేచివున్న అయిదవ నంబరు హాలులో గోడమీద పెద్ద ఛాయాచిత్రం శ్రీ వేంకటేశ్వరునిదీ అమ్మవారిదీ అలంకరించి వుంది.. దారుణం ఏమిటంటే శ్రీవారి రూపం కనిపించకుండా ఒక పనిచేయని ‘టివీ’ అడ్డుగా పెట్టారు.. ఎంత ఆవేదన కలిగిందంటే, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలోనే ఆ ఆరాధనా మూర్తికే అవమానం జరిగినట్లుగా అనిపించింది.. టివిని ఆ ఫోటో కనిపించకుండా ఎందుకు పెట్టినట్లు .. అదేమైనా మామూలు చిత్రమా ? ఆ ఆలయ కర్తా కర్మా క్రియా అయిన శీవారి చిత్రం.. మన ఆరాధ్య దైవం అంటే అంత నిర్లక్ష్యమా .. దాదాపు మూడు గంటలపైన ఆ హాలులో వున్నాము . చివరకు ఆవేశం, క్రోధం అణుచుకోలేక అక్కడున్న ఎంప్లాయీస్ కి కంప్లైంట్ చేసాను.. కానీ వారి హృదయం, చెవులు రెండూ బూజుపట్టి మూసివున్నాయి..
Ads
నా అభ్యర్ధనకు వారు ‘చూస్తాం చేస్తాం’ అనే రెండు మాటలతో జవాబిచ్చారు.. చూసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారన్న ఆశ నాకు లేదు . ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల ఆలయ కర్త కర్మ క్రియ అయిన, ఆ సంస్ధాన అధిపతి శ్రీ వేంకటేశ్వరునికీ , ఆ శ్రీనివాసునికే తీరని అపచారం అవమానం జరిగినట్లు నా కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. మొదట ఆలయ యాజమాన్యం వారి ఈ నిర్లక్ష్య ప్రవర్తనకి సమాధానం చెప్పాలి.. దైవం మీద భక్తి శ్రధ్ధలు లేనపుడు వారు ఏం సేవ చేస్తారు .. కేవలం జీతం నాలుగు డబ్బుల కోసం తప్ప…. అంతేకాదు, ఆ హాలులో పనిచేయని ఈ సిబ్బందితో పాటు అలాంటిదే ఒక గోడ గడియారం కూడా వుంది .. దానికి ఒక చిన్న బాటరీ కూడా వేయలేనంత తీరికలేని పని చేస్తున్నారు టిటిడి ఎంప్లాయీస్ … అన్ని గంటలు భక్తులు వేచివున్న హాలులో కనీసం వారు కూర్చునేందుకే బెంచీలు కూడా లేవు.. పెద్దవారు క్రింద కూర్చోలేని వారు కూడా కూర్చోలేక నిలబడలేక ఇబ్బంది పడ్డారు.. ఇవన్నీ చూస్తే ఎంతో భక్తితో దర్శనానికి వచ్చే భక్తుల హృదయాలు మండిపోవా.. ఆలయ యాజమాన్యం భక్తుల చేతిలోనే వుండాలి అనే డిమాండ్ న్యాయమైనది కాదా…!!
Share this Article