కరోనా వైరస్‌కన్నా మీడియా ఎక్కువ ప్రమాదకరం… ఈవిషయంలో ఇప్పుడు ఎవరికీ సందేహమే అక్కర్లేదు… డ్రగ్ మాఫియాకు ఊతం ఇస్తూ, జనంలో భయాందోళనల్ని పెంచుతూ, ఫలితంగా ప్రమాద తీవ్రతను పెంచుతూ, ఏది తోస్తే అది రాసేస్తూ మీడియా చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు… మళ్లీ ఓ వేవ్ రావాలి, రాకపోతే రప్పించాలి, జనం మీద పడాలి, వేక్సిన్లు అమ్మాలి, బూస్టర్లు వేయాలి, పిల్లలకూ టీకాలు కుచ్చేయాలి అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం డ్రగ్ రాకెట్ విశ్వప్రయత్నం చేస్తోంది… దానికి మీడియా మద్దతు… లేకపోతే ఏమిటీ పైత్యం..? కొత్తగా డెల్మిక్రాన్ అనే వైరస్ కూడా పుట్టుకొచ్చిందనీ, ఇది ఇంకా ప్రమాదకరమనీ ప్రచారం మొదలుపెట్టింది…
నిజానికి ఒమైక్రాన్ వైరసే డేంజర్ కాదు… చిన్న చిన్న సింప్టమ్స్‌కు చికిత్స చేస్తే సరిపోతోందనీ… ఇన్‌ఫెక్షన్లు, ఆక్సిజన్ల స్థాయికి వెళ్లడం లేదనీ ఒమైక్రాన్‌కు చికిత్స చేస్తున్న మన దేశ వైద్యులు కూడా చెబుతున్నారు… నిజానికి ఈ ఒమైక్రాన్‌తో కరోనా పీడ విరగడ అవుతుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి… ఒమైక్రాన్ వ్యాప్తి ధాటి ఎక్కువ, కానీ తీవ్రత తక్కువ… మరి ఈ డెల్మిక్రాన్ కథేమిటి..? అకస్మాత్తుగా రెండు రోజుల నుంచే ఈ పేరు వినిపిస్తోంది… ఈ పేరుతో ఇంకా భయాందోళనల్ని రెచ్చగొట్టడం..! మొన్న కొన్ని చానెళ్లు ఎయిడ్స్ వైరస్ నుంచి కొత్త వైరస్ పుట్టుకొచ్చిందనీ, మళ్లీ ఎయిడ్స్ విజృంభణ ఖాయమనీ కథనాలు కుమ్మిపారేశాయి… బేస్‌లెస్ ప్లస్ బాధ్యతారాహిత్యం…
Ads
ఏదో స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డైన్స్ మేథమెటికల్ ట్రెండ్స్ చెప్పినట్టుగా… అక్టోబరు, నవంబరు నెలల్లో థర్డ్ వేవ్ అన్నారు, రాలేదు… ఈసారి డిసెంబరు నుంచి లక్షల మంది చచ్చిపోతారు అని ప్రచారం మొదలుపెట్టించారు… కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ల పేరిట ఫిబ్రవరి వేవ్ అంటూ కొత్త గ్రాఫులు ప్రచారంలోకి తెచ్చారు… అసలు వైరస్ వేవ్స్‌కు మేథమెటికల్ ఈక్వేషన్స్, ప్రిడిక్షన్స్ ఏమిటి..? పాండెమిక్ ట్రెండ్స్ ఏమిటి..? అసలు వీళ్లకు ఏం తెలుసని ఈ ప్రచారాలకు ప్రభుత్వం అనుమతిస్తోంది..? వాళ్ల పిచ్చి వాదనలకు మీడియా మద్దతు ఏమిటి..? ఘోరం ఏమిటంటే ఎస్బీఐ వంటి బ్యాంకులు కూడా ఈ వేవ్ ప్రిడిక్షన్లలో పాలుపంచుకోవడం… అసలు వాళ్లకేం పని..? వాళ్ల వైద్యార్హత ఏమిటి..?
spike అంటే హఠాత్ పెరుగుదల, spike అంటే ముల్లు (వైరస్ ముళ్లు)… ఎవరో ఓ డాక్టర్ మాట్లాడుతూ కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆల్‌రెడీ డెల్టా ఉన్న రోగుల్లో ఒమైక్రాన్ కూడా కనిపిస్తోందనీ, ఈ twin spike (రెండు వైరస్‌ల వ్యాప్తిలో పెరుగుదల) కొత్త ప్రమాదాన్ని సూచిస్తోందనీ అన్నాడు… దానికి ఇక డెల్టా ప్లస్ ఒమైక్రాన్ పేర్లను కలిపేసి, దానికి డెల్మిక్రాన్ అని నామకరణం చేసేసి ప్రచారం మొదలుపెట్టింది మీడియా… కనీసం ఓసారి క్రాస్‌చెక్ చేసుకుందామనే సోయి కూడా లేదు… WHO గానీ, అమెరికాలోని USCDC గానీ, మన దేశ ICMR గానీ దీన్ని ప్రస్తావించడం లేదు… అసలు సింపుల్‌గా చెప్పాలంటే ఈ డెల్మిక్రాన్ అనే కొత్త వైరస్ లేదు… రాలేదు… ఒకవేళ వచ్చినా ఆ పేరు పెట్టరు… ఎందుకంటే..?
గ్రీక్ అల్ఫాబెట్స్ చార్ట్ ఇది… వాటి పేర్లను వైరస్ వేరియెంట్లకు పెడుతున్నారు… ఒకవేళ డెల్టా, ఒమైక్రాన్ అక్రమ సంబంధంతో కొత్త సంతానం పుట్టుకొచ్చినా సరే, వీటిలో ఏదో ఒక పేరు పెడతారు, అంతేతప్ప ఇలా డెల్మిక్రాన్ అంటూ హైబ్రిడ్ పేర్లు పెట్టరు… ఇవేమీ లైగర్ టైపు నామకరణాలు కావు… ఏదో కప్ప, తీట, లోటా అని పేరు ఖరారు చేస్తారు… మన తెలుగు మీడియా కూడా తక్కువేమీ కాదు… ఎడాపెడా గీకిపారేస్తున్నారు… అసలు ఒమైక్రాన్ వైరస్‌కు అంత సీన్ లేదనీ, మామూలు జ్వరచికిత్సతో నయం అయిపోతుందనే డాక్టర్ల వార్తల్ని హైలైట్ చేయడం ఇష్టపడరు గానీ, ఈ డెల్మిక్రాన్ వంటి ‘‘అభూత కల్పనలకు’’… సారీ, నిజంగానే భూతప్రేత కథనాలకు ప్రయారిటీ ఇస్తున్నారు… నిజమే, జనం ప్రశాంతంగా, సుఖంగా ఉండటం మీడియాకు ఎప్పుడూ ఇష్టముండదు, అది డ్రగ్ మాఫియాకు తాత కదా…!!
Share this Article