వాజపేయి… ఆయన జయంతి రోజున చాలామంది తనకు సంబంధించిన చాలా విశేషాల్ని ప్రజలతో షేర్ చేసుకుంటున్నారు… ప్రత్యేక వ్యాసాలు రాస్తున్నారు… నివాళ్లు అర్పించి స్మరించుకుంటున్నారు… వర్తమాన రాజకీయాల పోకడల్లో ఒక వాజపేయి, ఒక పీవీ వంటి నేతల రాజనీతిజ్ఞత చాలామందికి ఛాందసంగా అనిపించవచ్చుగాక… కానీ ఇన్ని విశేషాల నడుమ వాజపేయి అనగానే గుర్తొచ్చేది ఓ సంఘటన… ఒక్క అక్షరమ్ముక్క రాని ఓ గ్రామీణ మహిళ కాళ్లను ఆయన స్పృశించి, మీలాంటి మహిళలే నిజమైన దేవతలమ్మా అని బహిరంగంగా, ఓ జాతీయ స్థాయి అధికారిక వేదిక మీద ప్రధాని హోదాలో ప్రస్తుతించిన సంఘటన… తను నిజంగానే ఎమోషనల్… అక్కడ వాజపేయి ప్రవర్తనలో కృత్రిమత్వమో, నటనో కనిపించలేదు… పొగడాలనుకుంటే మనసులో ఏదీ ఉంచుకోడు, వ్యక్తీకరించేస్తాడు… ఇదీ ఆ ఫోటో…
మధురై… పుల్లిసెరి అనే ఓ కుగ్రామంలో చిన్నపిళ్లై అనే ఓ వృద్ధురాలు… ధన్ ఫౌండేషన్ అనే ఎన్జీవో సాయంతో ఆమె కలాంజియం గ్రూపుల్ని ఏర్పాటు చేసింది… దాదాపు 60 వేల మంది మహిళలు వాటిల్లో సభ్యులు… సాధికారత, పరస్పర సహకారం, వర్తమాన సామాజిక అంశాలపై అవగాహన, వ్యక్తిగత ఆరోగ్యం వంటి అనేక అంశాలపై కృషి సాగేది… వాళ్లందరికీ ఆమె లీడర్… గొప్ప శ్రమ, ప్రయాస, గెలుపు, సంకల్పం… 2001లో… కేంద్ర హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ స్త్రీ శక్తి అవార్డుల్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది.., ఈ చిన్నపిళ్లై గురించి విని ఒకటికి పదిసార్లు సమాచారం తెప్పించుకుంది, నిర్ధారించుకుంది… ఆమెను నేరుగా ఢిల్లీకే రప్పించారు… ఆమె విమానం ఎక్కడమే అది మొదటిసారి…
Ads
ప్రధాని ముఖ్య అతిథిగా స్త్రీ శక్తి పురస్కారాల ప్రదానం ఢిల్లీలో… ఆమె గురించి చెప్పారు ఆయనకు… ఆయన లేచి, ఆమె కాళ్లపైకి వంగాడు, అయ్యో, సార్ అంటూ ఆమె చేతులతో అడ్డుకుంటున్నా సరే, ఆమె కాళ్లు టచ్ చేశాడు వాజపేయి… ఆమె కళ్లల్లోకి చూస్తూ, మీలాంటోళ్లేనమ్మా దేవతలు అని వ్యాఖ్యానించాడు… వేదిక మీద ఉన్న మిగతా అతిథులు, కేంద్ర అధికారులు, మంత్రులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు… ఆ స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంది… చాలాసేపు దిగ్భ్రాంతిలోనే ఉండిపోయింది… ఇక్కడ వాజపేయి తత్వానికి ఎవరెలా బాష్యం చెప్పుకున్నా సరే…! ఏ పేరు పెట్టుకున్నా సరే…! ఇప్పుడు కూడా కొందరు నాయకులు కావాలని ఇలా మహిళలు, అణిచివేతకు గురైన బాధితులు, దివ్యాంగుల కాళ్లు మొక్కడం చూస్తుంటాం… కానీ వాజపేయి వైఖరి ఆర్టిఫిషియల్ అనిపించదు… వాజపేయి మరణించినప్పుడు అదే స్త్రీ స్పందన అడిగారు కొందరు విలేఖరులు… ఆమె ఒక్కసారిగా భోరుమన్నది… ‘‘మా సొంత నాన్నను కోల్పోయినట్టుగా ఏడుపొస్తోంది’’… ఇదీ ఆమె స్పందన…!! వాజపేయి మరణానికి ఇంతకన్నా గొప్ప నివాళి మరొకటి లేదనిపించింది…!!
Share this Article