కొన్ని వార్తలు మన మీడియాకు అసలే పట్టవు… ఎంతసేపూ మన రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల బూతులు, కేసులు, దాడులు, కక్షలు వంటి ‘‘అత్యున్నత సంస్కారమయ రాజకీయాల’’ వార్తలు తప్ప ఇంకేమీ పట్టడం లేదు… అందుకే కొన్ని ఇంట్రస్టింగ్ వార్తలు కూడా అన్ నోటీస్డ్‌గా వెళ్లిపోతున్నయ్… ఉదాహరణకు మొన్న మద్రాస్ హైకోర్టులో ఓ జడ్జిమెంట్… సింగిల్ బెంచ్, న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వెలువరించిన తీర్పు… సోషల్ మీడియా పోస్టుల మీద ఈరోజుకూ దేశంలో చాలాచోట్ల కేసులు, అందులోనూ దేశద్రోహం కేసులు కూడా నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ తీర్పు కాస్త ఊపిరి పీల్చుకునేలా ఉంది… ఓసారి వివరాల్లోకి వెళ్దాం…
సీపీఐఎంఎల్ నాయకుడు మత్తివానన్… వయస్సు 62 ఏళ్లు… ఎంఎల్ పార్టీ అనగానే నక్సలైటు అనేస్తారు కదా మన పోలీసులు… ఆయన ఇదే నెలలో ఓసారి బిడ్డ, అల్లుడితో సిరుమలైకి సైట్ సీయింగ్ ట్రిప్ వెళ్లాడు… అక్కడ ఫోటోలు తీసుకుని, సరదాగా ‘‘Trip to Sirumalai for shooting practice’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు… వెంటనే వడిపత్తి పోలీసులు ఒక సూమోటో కేసు పెట్టేశారు, అరెస్టు చేశారు… ఇదేంటయ్యా అనడిగితే… ఇది కుట్ర కేసు, దేశానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రేరేపించడం అంటూ ఏవేవో కారణాలు చెప్పేసి, పలు ఐపీసీ సెక్షన్లు పెట్టేశారు… ఓరి దేవుడో అనుకుంటూ ఆయన బెయిల్‌కు దరఖాస్తు చేశాడు, స్థానిక మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చాడు… అసలు ఆ కేసే కొట్టేయాలంటూ ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు…
Ads
న్యాయమూర్తి ఆ కేసు కొట్టేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు… అందులో ముఖ్యమైనవి ఏమిటంటే… ‘‘ఆ పోస్టు ఎవరు చదివినా సరదాగా నవ్వేస్తారు, అందులో అంత హానికరమైన ఉద్దేశాలు, కుట్రలు ఏమున్నాయి..? నిజానికి Jug Suraiya, Bachi Karkaria, EP Unny, G Sampath వంటి సెటైరిస్టులో, కార్టూనిస్టులో ఈ తీర్పు గనుక రాసే పక్షంలో ఏం రాస్తారో తెలుసా..? ప్రజలకు ఫన్నీగా ఉండే ప్రాథమిక హక్కు కూడా ఉండాలనీ… అంతేకాదు, రాజ్యాంగంలో నిర్వచించిన ఫండమెంటల్ పౌరవిధుల్లో నవ్వడాన్ని కూడా చేర్చాలనీ రాసేవారేమో… అసలు ఈ కేసే అబ్సర్డ్, మన లీగల్ ప్రాసెస్‌నే కించపరిచినట్టుగా ఉంది… జోక్స్ వేయడం, నవ్వడం, సరదాగా ఉండటం అనేవి మనకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ, అభిప్రాయాన్ని కలిగి ఉండే స్వేచ్ఛకు విరుద్ధం ఏమీ కాదు…’’ బాగుంది జస్టిస్… మీరు సరదాగా తీర్పు రాసినా సరే, ఇది అభినందనీయమైన ఓ సీరియస్ తీర్పే సుమా…!! (ఈ తీర్పును ఉత్తర కొరియాలో ఎవరూ నవ్వొద్దు, సరదాగా కనిపించొద్దు అని ఇటీవల కొన్నాళ్లు ఆంక్షలు పెట్టిన కిమ్ జాంగ్ తప్పకుండా చదవాలి…)
Share this Article