- దీపిక పడుకోన్ జీవితంలో రణబీర్ కపూర్ ఎవరు..? రణవీర్ సింగ్ ఎవరు..?
- ఐశ్వర్యా రాయ్ సల్మాన్ ఖాన్ల బంధం ఎన్నేళ్లపాటు కొనసాగింది..?
- మహేశ్ భట్ తన మొదటి ప్రియురాలు లొరేన్ బ్రైట్ మార్చుకున్న పేరేంటి..?
- హీరోయిన్ ఆలియా భట్ జీవితంలో ఆలి దాదర్కర్ అనే వ్యక్తి ఎవరు..?
- డ్రగ్స్ కేసులో పట్టుబడిన షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ను పెట్టిన జైలు పేరు..?
- సుమంత్‌ను వదిలేసిన కీర్తిరెడ్డికి మాజీ మిస్ ఇండియా కీర్తిరెడ్డికి రిలేషనేంటి..?
- సమంత, నాగచైతన్య కాపురంలో చిచ్చురేపిన ప్రీతమ్ జుకల్కర్ వృత్తి ఏంటి..?
- అఖిల్‌ను వదిలేసిన శ్రేయో భూపాల్‌కు ఇండస్ట్రియలిస్ట్ జీవీకేరెడ్డి ఏమవుతాడు..?
- సింగర్ ఉపద్రష్ట సునీత ప్రస్తుత భర్త నడిపించే వ్యాపార సంస్థ పేరేమిటి..?
- నాగార్జున విడాకులిచ్చిన దగ్గుబాటి లక్ష్మి ప్రస్తుత భర్త పేరేమిటి..;? వృత్తేమిటి..?
మీ పిల్లలకు ఏదైనా పరీక్షలో ఈ ప్రశ్నపత్రం వస్తే తను తెల్లమొహం వేయాల్సిన పనిలేదు… మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు… ఇవేం ప్రశ్నలురా బాబూ అని మీరు సదరు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే, ఇంతకుమించిన జనరల్ నాలెడ్జ్ పిల్లలకు ఇంకేం అవసరం అంటూ సదరు టీచర్లు పెడసరంగా సమాధానాలు ఇస్తే మీరు జుత్తు పీక్కోవాల్సిన పనీ లేదు… ఎహె, ఇదా జనరల్ నాలెడ్జ్ అంటే అని ఊరకే కోపం తెచ్చుకోకండి… మనమే ఇంకా ఎదగడం లేదనీ, ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా జ్ఞానంలో ఎదిగిపోయాయనీ మనం అర్థం చేసుకోవాలి…
మధ్యప్రదేశ్… ఖంద్వా జిల్లా… Academic Heights Public School తన ఆరో తరగతి పిల్లలకు ఇచ్చిన పరీక్షపత్రంలో కరెంట్ అఫర్స్ కేటగిరీలో ఓ ప్రశ్న ఏమిటో తెలుసా..? ‘‘కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ కొడుకు పూర్తి పేరేమిటో రాయండి’’… ఇదీ ప్రశ్న… ఇది చూసిన ఒక పేరెంట్స్‌కు చిర్రెత్తింది… అరికాలి మంట నెత్తికెక్కింది… ఇది తెలిసిన జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిష్ ఝర్జారేకు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశాడు, ఇలాంటి బడిని మూసేసినా నష్టం లేదు అని మండిపడ్డాడు… వెంటనే సదరు విద్యాధికారి సంజీవ్ భలేరావు ‘‘స్కూల్‌కు నోటీసులు ఇచ్చాను, రెస్పాన్స్ చూసి చర్య తీసుకుంటాను’’ అన్నాడు… అసలు ఆరో తరగతి పిల్లలకు కరీనా, సైఫ్ కొడుకు పేరు తెలియాల్సిన పనేముంది అంటారా..? నమ్మడం లేదా..? ఇదుగో ఆ ప్రశ్నపత్రం…
Ads
భారతదేశం మీద దండయాత్రలు చేసి, హిందువుల్ని ఊచకోత కోసిన తైమూర్ ఖాన్ పేరును సైఫ్ అలీ ఖాన్, కరీనా ఖాన్ తమ కొడుక్కి పెట్టడం ఏమిటంటూ ఆమధ్య వివాదం చెలరేగిన సంగతి తెలుసు కదా… కరీనాను ఒక సెక్షన్ ప్రేక్షకులు తిట్టిపోసిన విషయమూ గుర్తుంది కదా… తమ రెండో కొడుక్కు కూడా అలాంటి పేరే జెహంగీర్ అని పెట్టుకున్నారు… సైఫ్, కరీనాల జాతీయతావాదం సోషల్ మీడియాలో చాన్నాళ్లు చర్చల్లో ఉంది… బహుశా అది దృష్టిలో పెట్టుకుని ఆ స్కూల్ ఆ ప్రశ్న వేసి ఉంటుంది… కానీ, ఆరో తరగతి పిల్లలకు ఈ ప్రశ్నలు అవసరమా..? అసలు సిలబస్‌లో లేని పాఠ్యాంశాల మీద ఇలాంటి ప్రశ్నలు పిల్లలకు సంధించవచ్చా..? అవి ప్రైవేటు స్కూళ్లండీ… వాళ్లు పిల్లలకు ఏవైనా ప్రశ్నలు వేయవచ్చు, పరీక్షించవచ్చు… వాళ్లకు సిలబస్‌లు, కరిక్యులమ్స్, మన్నూమశానం ఏమీ పట్టవు…
సదరు స్కూల్ డైరెక్టర్ శ్వేతా జైన్ ఏమని సమర్థించుకున్నదీ అంటే… ‘‘అబ్బే, అది మేం సెట్ చేసిన ప్రశ్నపత్రం కాదండీ, ఢిల్లీ బేస్‌గా పనిచేసే ఓ ఆర్గనైజేషన్‌కు అప్పగించాం… ఐనా దీన్ని మతం కోణంలో చూడొద్దు కదా, కరెంట్ అఫైర్స్‌లో ఇది ఒక ప్రశ్న… అంతే కదా…’’ అంటోంది… అంతేలెండి మేడమ్… ఆలెక్కన మనం పైన చెప్పుకున్న పది ప్రశ్నలు కూడా జస్ట్, కరెంట్ అఫైర్స్… పిల్లలు చదవాల్సిందే, తెలుసుకోవాల్సిందే… ఏమో, రేపురేపు సివిల్స్ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ అడుగుతారేమో, ఇప్పుడే అన్నీ నేర్పించేయాలి మనం… అన్నట్టూ… మచ్చుకు మరో రెండు ప్రశ్నలు… 1) అమీర్ ఖాన్ మొదటి భార్య రీనాదత్తాకు పిల్లలెందరు..? వాళ్ల పేర్లేమిటి..? 2) సుస్మిత సేన్ వదిలేసిన సహచరుడి జన్మస్థలం ఎక్కడ..? పేరేమిటి..? జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలే… ఇంతకీ ఇన్ని ప్రశ్నల్లో మీకెన్ని జవాబులు తెలుసు..?!
Share this Article