ఒకటే సందర్భం… ఒక్కొక్కరు ఒక్కో తీరులో విశ్లేషించుకుంటారు… ప్రత్యేకించి రాజకీయాలకు లింకున్న అంశమైతే ఇంకాస్త ఆసక్తిగా ముచ్చట్లలోకి వస్తుంది… సందర్భం ఏమిటంటే..? కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ దగ్గర మున్నూరు కాపు సంఘ భవనం, కల్యాణ మంటపం నిర్మాణానికి శంకుస్థాపన… మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ… శుక్రవారం జరిగింది… దానికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు… వివేక్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా వచ్చారు…
హమ్మా, చూశారా, చూశారా… కులం అనగానే అందరూ ఎలా ఒక్కటయ్యారో… పార్టీల్లేవు, కైలాట్కాలు లేవు… రాజకీయాల్లో డిష్యూం డిష్యూం అని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు… నిజానికి అందరూ ఒకటే… కార్యకర్తలు, ప్రజలే బకరాలు… బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు ఒకరి మీద మరొకరు చలోక్తులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ఎంత హాయిగా కలిసిపోయారో చూశారా…?……….. ఇది కొందరి వెర్షన్…
Ads
కానీ దీన్ని అలా చూడాల్సిన అవసరం ఉందా..? నిజానికి ఆహ్వానించాల్సిన విషయం అనిపిస్తోంది… రాజకీయాల్లో వైరం ఓ లెవల్ వరకే ఉండాలి… అది పాలసీలకు పరిమితమైతే ఇంకా బెటర్… లేదా మరీ ఒక నాయకుడు ప్రజాకంటకుడిగా మారితే టార్గెట్ చేయడం వేరు… అది లేనప్పుడు నాయకులు ఒకరినొకరు ఎందుకు ద్వేషించుకోవాలి..? వ్యక్తిగత వైరం దాకా రాజకీయాలు ఎందుకు పోవాలి… అలా వెళ్తే ఆ విద్వేషం, ఆ విషం దిగువ దాకా… అంటే కార్యకర్తలు, ప్రజల దాకా వ్యాపించి… ఉద్రిక్తతలు, దాడులు, అనవసర వైరాలకు దారితీస్తుంది… అంత అవసరమా..?
సందర్భం ఏదైనా గానీ… నాయకులు ఏ హోదాల్లోనైనా ఉండనీ… వాళ్లు ఒక్కచోట కలిసినప్పుడు… మంచిగా మాట్లాడుకోవడం సొసైటీలోకి మంచి సంకేతాల్ని పంపిస్తుంది… పాజిటివ్ సిగ్నల్స్… ఆఫ్టరాల్… ఈ పార్టీలు, ఈ ఎన్నికలు, ఈ రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే… ఎవరు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో… అసలు ఏ పార్టీ పొజిషన్ ఎప్పుడెలా ఉంటుందో ఎవరికీ తెలియదు… మరలాంటప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని వర్గాలుగా ఎందుకు విడగొట్టడం..? ఇలా భాయీభాయీ అనుకునే సందర్భాలు కొన్నిసార్లు మంచిదే…
ఈ సందర్భం ఒక కులానికి సంబంధించిందే కావచ్చు… సంజయ్, పొన్నాల, గంగుల మాత్రమే కాదు… అక్కడికి వివేక్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నల ప్రభాకర్ తదితరులు కూడా వచ్చి అభినందించారు… ఆహ్వానించాల్సిన విషయమే కదా… ఎస్, రాజకీయాలు అంటే, వేర్వేరు పార్టీల్లో ఉండటం అంటే… ప్రత్యర్థులు మాత్రమే… శత్రువులు కారు… కానవసరం లేదు… ఎనిమిటీ కాదు, జస్ట్, ఒక పోటీ… దాన్ని అక్కడికే పరిమితం చేయాలి… లక్ష్మణరేఖలు గీసుకుని, ఒకరికొకరు ఏదో సందర్భంలో మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే సమాజానికి మంచిదే… మంచిదే…
నిజానికి అధికారగణం, నాయకగణం నడుమ కూడా ఈ సంబంధాలు ఎప్పటికప్పుడు సరైన దిశలో సాగేలా చూసుకోవడం కూడా బెటర్… ఎన్నికలప్పుడు, లేదా ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు పోలీసులు, ఇతర శాఖల సిబ్బందితో నాయకులకు కోపాలు రావడం సహజం… కానీ అదీ ఓ స్థాయి దాటొద్దు… పర్సనల్‌గా తీసుకునేదాకా పోవద్దు… మొత్తానికి ఈ కార్యక్రమాల సందర్భంగా సహృదయంగా వ్యవహరించిన నాయకులను అభినందించాలని అనిపిస్తోంది…!
Share this Article