అద్భుత హిందూ ఆధ్యాత్మిక కట్టడంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య గుడిని చేరుకోవడానికి రైలు, విమానం, రోడ్డు మార్గాల్ని అభివృద్ధి పరిచే ప్రణాళికల గురించి యోగీ ఆదిత్యనాథ్ అప్పుడప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాడు… ఇప్పుడు తాజాగా ఓ ప్రణాళిక వేస్తున్నాడు… జలమార్గాన్ని కూడా అయోధ్యకు అనుసంధానించాలనేది దాని సారాంశం… రఫ్‌గా చెప్పాలంటే… యూపీ చుట్టుపక్కల నదుల నుంచి అయోధ్యకు లింక్ ఏర్పాటు చేయడమే కాదు, అంతిమంగా సముద్రానికి కలిపి, ఇతర దేశాలకూ సముద్రమార్గాన్ని డెవలప్ చేయాలి… స్థూలంగా చూస్తే బాగానే అనిపించినా, అది అనుకున్నంత సులభమైతే కాదు… అయితే ఈ జలమార్గం ఆలోచనకు యోగికి స్పూర్తి మాత్రం రెండువేల సంవత్సరాల నాటి ఓ యువరాణి… ఆమె పేరు సూరిరత్న…
గతంలో ఆమె గురించి విన్నారా..? పదహారేళ్ల వయస్సులో అయోధ్య నుంచి ఆమె జలమార్గంలో కొరియాకు వెళ్లింది… అక్కడికి చేరాక కిమ్ సూరోను పెళ్లి చేసుకుంది… తరువాత ఆమె వంశం వర్ధిల్లింది… కొరియాను పాలించింది… కరాక్ రాజరికం అది… అక్కడ ఆమె పేరు హియో వాంగ్… ప్రత్యేకించి కిమ్, హు కమ్యూనిటీలు (ఉత్తర కొరియా నియంత పేరు కూడా కిమ్) సూరో, సూరిరత్నల వంశీకులమని బలంగా విశ్వసిస్తారు… వీళ్లు ఇప్పుడు దాదాపు 60 లక్షల మంది ఉంటారని ఓ అంచనా… రెండు దేశాల్లోనూ వీళ్లదే ఆధిపత్యం… మూడేళ్ల క్రితం కొరియా ఫస్ట్ లేడీ కిమ్ జంగ్ సూక్ వచ్చి అయోధ్యలో దీపావళి ఉత్సవాల్లో పాల్గొంది… రెండు దేశాలు కలిసి క్వీన్ సూరిరత్న మెమోరియల్ ప్రాజెక్టు డెవలప్ చేయడానికి అంతకుముందే ఒప్పందం కుదిరింది…
Ads
సూరిరత్న జలమార్గం ద్వారా అయోధ్య నుంచి ఏకంగా కొరియాకు వెళ్లింది… మరి ఇప్పుడు జలమార్గం ద్వారా అయోధ్యను మిగతా అన్ని ప్రాంతాలతో అనుసంధానించలేమా..? ఇదీ యోగీ ఆలోచన… ఒకవేళ యూపీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో నదీమార్గాల్లో అనుసంధానం చేయాలని అనుకుంటే చేయగలరు… హిమానీ నదాలు గిర్వా, కౌరియాలు, ఘఘరా నదిలోకి… దాన్నుంచి గంగ, పద్మ, మేఘన… చివరకు సముద్రం… కానీ మధ్యలో బంగ్లాదేశ్ వస్తుంది… ఎగువ నుంచి బ్రహ్మపుత్రను లింక్ చేయాలన్నా బంగ్లాదేశ్ తగులుతుంది… అయోధ్యను లింక్ చేయడానికి దిగువకు సోనే, ఉత్తర కోయల్… తూర్పు దిశగానే ఔరంగ, ఎగువ నుంచి కోశి… ఇలా రకరకాల ప్రవాహాలున్నాయి… మధ్యమధ్య పలు ప్రాజెక్టులు, జలవిద్యుత్తు ప్లాంట్లు, డ్యాములు… అనుకున్నంత వీజీ ఏమీ కాదు…
ఈ జలమార్గానికి కేంద్రం సహకరిస్తుందని యోగీ చెబుతున్నాడు గానీ… అసలు రఫ్ ఐడియా గానీ, ఖర్చుపై ఉజ్జాయింపు అంచనాలు గానీ ఇప్పటికి ఏమీలేవు… ఫీజబులిటీకితోడు వయబులిటీ కూడా చూడాల్సి ఉంటుంది… అన్నింటికీ మించి రైలు, రోడ్డు, విమానమార్గాలు ఉన్న తరువాత జలమార్గం ఆవశ్యకత ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతుంది… ఒకవేళ అయోధ్య కేంద్రంగా ఓ జలరవాణా హబ్ ఏర్పాటు చేస్తే తప్ప… జలరవాణా మిగతా పద్ధతుల్లోకన్నా బాగా చౌక… కానీ అది పర్‌ఫెక్ట్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఆపరేషన్ జరిగినప్పుడు మాత్రమే…!! దేశంలో ఐదారు ప్రధాన జలరవాణా మార్గాలను డెవలప్ చేయాలనే ప్రతిపాదనలు ఏళ్లుగా ఉన్నయ్… అడుగు కదల్లేదు..!!
Share this Article