ఒక వీడియో సాంగ్… అదీ ఐటమ్ సాంగ్… తెలుగులో మొన్న సమంత ‘‘ఊ అంటావా, ఊఊ అంటావా’’ అని ఇరగదీసింది కదా… పాపం, ఒళ్లు దాచుకోకుండా బాగా కష్టపడింది కదా.., అదే స్టయిల్… అదే కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య… అందులోనూ సన్నీ లియోన్ డాన్స్… ఇక వేరే చెప్పేదేముంది..? యూట్యూబ్‌లో కోటి దాటేసిన వ్యూస్… దేశంలోకెల్లా ప్రఖ్యాత మ్యూజిక్ కంపెనీ సరిగమ… సీన్ కట్ చేస్తే… యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్ మొత్తం డిసేబుల్ చేసుకుంది… ఒకటీరెండు రోజుల్లో ఆ పాట మొత్తం అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారాల నుంచీ తీసేస్తామనీ కంపెనీ ప్రకటించింది… ప్రజల మనోభావాలను గౌరవిస్తామంటూ చెంపలేసుకుంది… లిరిక్స్ మొత్తం మార్చేసి, కొత్త వీడియోతో రీప్లేస్ చేస్తామని చెప్పుకుంది… అసలు పాట పేరునే మార్చేస్తామని చెప్పింది… ఎందుకిలా..? ఏం జరిగింది..?
అప్పుడెప్పుడో 1960లో కోహినూర్ అనే సినిమా కోసం మహ్మద్ రఫీ పాడిన పాట ఇది… మధుబన్ మే రాధిక నాచేరే… ఇదీ పాట… రాధాకృష్ణుల ప్రణయంపై రాసిన పాట… అందులో ఓ గాయకుడు పాడుతూ ఉంటాడు, ఓ డాన్సర్ ఆడుతూ ఉంటుంది… మన మ్యూజిక్ కంపెనీలు, సినిమా క్రియేటర్స్‌కు, సంగీత దర్శకులకు రీమిక్స్ అనే పిచ్చి ఒకటి ఎప్పుడూ గోకుతూ ఉంటుంది కదా… దాన్ని కూడా లిరిక్స్ మార్చేసి, ఓ ఐటమ్ సాంగ్ చేసేశారు… సన్నీ లియోన్ స్టెప్పులు అంటేనే అర్థమవుతోంది కదా… (ఏమాటకామాట సమంత పుష్ప మూవీ ఐటమ్ స్టెప్పులకన్నా సన్నీ స్టెప్పులే కాస్త తక్కువ అసభ్యంగా ఉన్నాయనేది లోకవాక్యం…) ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘‘సా విరహే తవ దీనా’’ పాటను కూడా ‘‘నువ్వు నా లక్కువు, నా హక్కువు, నా చుంబక్కువు’’ అని ఏవేవో పిచ్చి పదాలన్నీ కూర్చేసి, ఓ ఐటమ్ సాంగ్ చేసినట్టు అన్నమాట… దీంతో సహజంగానే మనోభావాలు తెరమీదికొచ్చినయ్…
Ads
ఒరేయ్ అప్రాచ్యుల్లారా, నాశనమైపోతార్రోయ్, వెంటనే ఈ పాటను బ్యాన్ చేయాల్సిందే అంటూ మధుర ప్రాంతం నుంచి డిమాండ్లు మొదలయ్యాయి… మేం దేవతలా పూజించే రాధను అంత చీపుగా, గలీజుగా చూపించడం ఏమిట్రా అని మండిపడసాగారు… ఈమధ్య ఇలాంటివి తలకెత్తుకుని, వార్తల్లో నిలుస్తున్న మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తం మిశ్రా ఇప్పుడు కూడా ‘నేనున్నాను’ అంటూ వచ్చేశాడు… ‘‘మూడు రోజులు టైమ్ ఇస్తున్నా, ఆ పాట డిలిట్ అయిపోవాలి, లేకపోతే సన్నీలియోన్ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్లు షరిబ్, తోషిల మీద కేసు బుక్ చేస్తా’’ అని హెచ్చరించాడు… ఆమధ్య గే జంట తాళిబొట్టు యాడ్‌కు సంబంధించి ఓ జువెలరీ డిజైనర్‌ను ఇలాగే హెచ్చరిస్తే, ఆ యాడ్‌ను వెనక్కి తీసుకున్న సంగతి తెలుసు కదా… సేమ్, ఇప్పుడు సరిగమ కంపెనీ కూడా ఆ రీమిక్స్ ఐటం సాంగ్‌ను, తప్పు దిద్దుకుని రీరీమిక్స్ చేస్తామని ప్రకటించింది…
మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రాను కొందరు మెచ్చుకోవచ్చుగాక, ఇలాంటి క్రియేటింగ్ స్వేచ్ఛకు అడ్డుపడుతున్నవాడిగా కొందరు తిట్టుకోవచ్చుగాక… ఈమధ్య ఇలాంటి వివాదాలపై స్థిరంగా వ్యవహరిస్తూ తెర మీద కనిపిస్తున్నాడు… నిజానికి తను కూడా పెద్ద కంట్రవర్సీ వ్యక్తే… ఎన్నికల నియమోల్లంఘన నుంచి అవినీతి, కిడ్నాపుల దాకా చాలా ఆరోపణలున్నయ్… అప్పట్లో ఓ స్థానిక మ్యాగజైన్ ‘జగద్ విజన్’ అయితే ఏకంగా ‘నరోత్తముడా, నరాధముడా’ అంటూ ప్రత్యేక కథనాల్ని వెలువరించింది… ఆ రేంజ్ అన్నమాట… సరే, ఈ సాంగ్ వివాదానికీ నరోత్తమ్ జీవితచరిత్రకూ లింకేమీ లేదు కాబట్టి అది మరోసారి చెప్పుకుందాం…
Share this Article