చాలా సింపుల్‌రా భయ్… మతం మత్తు మందు… అది ప్రయోగిస్తేనే ఎన్నికల్లో గెలుపు అనేది పాతసూత్రం… అసలు ఆ మత్తును కలిగించే మద్యాన్నే ప్రయోగించాలి… ఇదీ కొత్త సూత్రం… ఈ తొక్కలో మద్యనిషేధాలు, నైతికసూత్రాలు నథింగ్… అవేమైనా అధికారం తెచ్చిపెడతాయా..? ఏపీలో కోటి మంది మందు తాగుతారు… చంద్రబాబులాగా లైసెన్సు ఫీజులు పెంచేది లేదు, జగన్లాగా అనుయాయుల చీప్ లిక్కర్ కంపెనీలకు కోట్లకుకోట్లు దోచిపెట్టేలా కొత్త విధానమూ లేదు… మనకు అధికారమొస్తే జస్ట్, 75 రూపాయలే చీప్ లిక్కర్ బాటిల్… అంతే… రెవిన్యూ బాగుంటే 50 రూపాయలే… ఇదీ మన నినాదం… ఇదే మన మేనిఫెస్టో… అరె, అవసరమైతే గంజాయిని చట్టబద్ధం చేద్దాం… డ్రగ్స్ అమ్మకాలకు పర్మిట్లు జారీ చేద్దాం…
అంతెందుకు..? కిరాణాకొట్లలాగే ఎవడైనా ఎక్కడైనా సరే బార్లు ఓపెన్ చేసుకోవచ్చు… నో లైసెన్స్, నో పర్మిట్, నో టెండర్… ఎవడికి ఎంత చేతనైతే అంత అమ్ముకోవడమే… ఇంకా ఆలోచిస్తున్నాం… రెవిన్యూ ఇంకాస్త పెరిగితే నెలకు రెండు ఫ్రీ ఫుల్ బాటిల్స్ ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది..? బార్లలో సీకులు ఫ్రీగా సప్లయ్ చేస్తే బాగుంటుందా..? ఫిష్ ఫ్రై పీసులు, చికెన్-65 ముక్కలు, మటన్ బిర్యానీ మీద రాయితీలు ఎలాగూ ఇస్తాం… ఇంకేం ఇవ్వొచ్చో ఆలోచిద్దాం… పోనీ, ఖాళీ సీసాల్ని తీసుకొచ్చి ఎమ్మార్వో, ఎక్సయిజు ఆఫీసుల్లో అప్పగిస్తే బాటిల్‌కు పది రూపాయలు పారితోషికం ఇస్తే బెటరా..? వావ్, బాగుంది… స్పెషల్ ఎకనమిక్ జోన్స్లాగే స్పెషల్ ఎక్సయిజ్ జోన్లు క్రియేట్ చేసి, మద్యం ఉత్పత్తిదారులకు ఫ్రీ భూమి, ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటర్, టాక్స్ ఫ్రీ గట్రా ప్రకటించాలి…
రండి, ఇక రండి… జగన్ కమాన్… చంద్రబాబూ దీన్ని కౌంటర్ చేసే దమ్ముందా..? ఎహె, కమ్యూనిస్టులకు ఎలాగూ చేతకాదు, జనసేనను మనం గుర్తించేదే లేదు ఇక… ఏయ్ బిడ్డా, ఇది మా అడ్డా అని తొడ కొట్టడమే… కోడి తొడలదే అధికారం అని ప్రకటించడమే… తగ్గేదే లే… ఈ దోపిడీ‘దారూ’ జగన్ స్వార్థం వల్ల మందుబాబులు అలో సజ్జలా అని ఏడుస్తున్నారు… ఈ‘మద్య’ ప్రజల నాలుకలు తడారిపోయాయి… రాజ్యం మరీ మద్యదుర్భిక్షం అయిపోయింది… బ్రాండెడ్ మద్యం లేక, ఆ రంగుసారా బ్రాండ్లు తాగి జనం అల్లాడిపోతున్నారు… జనసంక్షేమమే మన ధ్యేయం, అందుకే మద్యమే మన విధానం… అంతే… ఇక ఎవడాపుతాడో చూద్దాం…
Ads
అవునండీ… వ్యతిరేకిస్తారేమో… అమిత్ షా తాగడు, మోడీ తాగడు, నాగపూర్ ఆఫీసులో ఎవరూ తాగరు… ఐతేనేం, వాళ్లకు అధికారం చేదా..? మందు అధికారం తెస్తుందీ అంటే వద్దంటారా..? ఒప్పిద్దాం… సమగ్ర సంక్షేమ మద్యవిధానం ఏదో అధికారికంగానే ప్రకటించాలని డిమాండ్ చేద్దాం… మందులో మహత్తు ఉందని పెద్ద పెద్ద పీఠాధిపతులతో చెప్పిద్దాం… తప్పేముంది..? వీలయితే గంజి కేంద్రాల్లాగే భంగు కేంద్రాలు ఓపెన్ చేద్దాం… అధికారమే మత్తు, దాన్ని మద్యమే తీసుకొస్తుందీ అనుకుంటే, విరివిగా తెచ్చేద్దాం… వెయిట్, వెయిట్… కాపు సారాకు చట్టబద్ధత, ఇప్ప సారాకు అధికార పానీయంగా హోదా, కల్లుకు ప్రత్యేక విక్రయ కేంద్రాలు కూడా ఆలోచిద్దాం… వీలైతే కొన్ని ప్రభుత్వ భవనాలకు మేన్షన్ హౌజ్ అని పేర్లు పెట్టాలి… తాగుడు పోటీలు పెట్టాలి, విజేతలకు ‘ఓల్డ్ మాంక్’ బిరుదులు ఇవ్వాలి… చాలా ఆలోచనలున్నాయి… ఓ రెండు పెగ్గులేసి వస్తా… కొత్త అవుడియాలు ఏమైనా తడతాయో చూద్దాం…!!
Share this Article