శ్యామ్ సింగరాయ్ సినిమా మీద అకస్మాత్తుగా ఓ వివాదం చెలరేగింది… హిందూవాదుల నుంచి ప్రత్యేకించి ఒక డైలాగ్ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది… సోషల్ మీడియాలో సదరు సినిమా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ మీద మాటల దాడి సాగుతోంది… ఆ డైలాగ్ ఏమిటంటే..? ‘‘కులం కాళ్లు పట్టుక్కూర్చోవడానికి ఇదేమీ రుగ్వేదం కాదు, స్వాతంత్ర్య భారతం….’’ ఓ కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్టుగా పెరిగిన ఓ నాస్తిక దర్శకుడు కావాలనే హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా రుగ్వేదానికి తప్పుడు బాష్యం చెప్పాడనేది తనపై ప్రధాన విమర్శ… ఇకపైనా ఇలాంటి సినిమాలే తీస్తానని చెబుతున్నాడు, ఉద్దేశపూర్వకంగానే హిందూ వ్యతిరేకతను సినిమా కథలో జొప్పించాడనేది ఆ విమర్శల సారాంశం… సినిమాలో ఆ రుగ్వేదం ప్రస్తావన వచ్చినప్పటి సీన్ ఇదీ…
ఇక్కడ దర్శకుడు అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ వంటి సామాజిక దురాచారాల మీద కథానాయకుడి పోరాటశీలతను చెప్పే క్రమంలో ఈ సీన్ రాసుకున్నట్టున్నాడు… అయితే అంటరానితనం మీద ఆ సీన్ బాగానే పేలినా, అనవసరంగా రుగ్వేదం ప్రస్తావన తీసుకొచ్చి, దర్శకుడే ఈ వివాదానికి తావిచ్చాడనేది కొందరి విమర్శ… ఇలాంటి సీన్లను దురుద్దేశాలతో జొప్పిస్తున్నారనీ, అసలు రుగ్వేదం తెలియకుండా ఈ డైలాగ్ ఎలా రాశారనీ, రుగ్బేదం ఎప్పుడూ అంటరానితనాన్ని ప్రోత్సహించలేదనీ ఓ రుగ్వేద పండితుడు చెప్పిన వివరణ ప్లస్ ఆరోపణ కూడా సోషల్ మీడియా గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతోంది… ఇదీ ఇది…
అంటరానితనం, జోగిని-దేవదాసి వ్యవస్థ, సతి, బాల్యవివాహాలు వంటి సామాజిక దురాచారాల్ని అందరమూ వ్యతిరేకిస్తున్నాం… కొన్నింటి జాడలు, నీడలు ఇంకా ఉన్నయ్, కొన్ని పూర్తిగా కనుమరుగయ్యాయి… నాగరిక సమాజం దిశలో ఈ చైతన్యధార ప్రవహిస్తూనే ఉండాలి… ఈ కథాకాలం ఎప్పుడో 1970 ప్రాంతం… అప్పట్లో ఓ అభ్యుదయ రచయిత పాత్ర అది… తన రాజకీయ భావజాలం, వ్యక్తిగత ఆలోచనల పరిధిలోనే మాట్లాడతాడు… ఈ డైలాగ్‌ను ఆ కోణం వరకే పరిమితం చేసి, చూస్తే సరి… ఆ పాత్ర కేరక్టరైజేషనే అది… తన తత్వాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేయడానికి ఆ సీన్స్ పెట్టినట్టున్నారు… ఐనా కమ్యూనిస్టుల నాస్తికత్వం, హిందూ వ్యతిరేకత గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది..? హిందూ సమాజం కూడా ఇలాంటి విషయాల మీద తమ సాధనసంపత్తి, శక్తియుక్తులను వినియోగించడంకన్నా సీరియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు, వాటిపై కేంద్రీకరిస్తే మేలనే ఒక అభిప్రాయం కూడా వినవస్తోంది…
Ads
నిజానికి ఈ వివాదాన్ని దర్శకుడు ముందే ఊహించాడు… గుడి, దేవదాసీ అనగానే పర్టిక్యులర్‌గా కులం, మతం ప్రస్తావనకు వస్తాయనీ, వివాదం తలెత్తే అవకాశాలున్నాయనీ తనకు తెలుసు… ఆ డైలాగ్ అనాలోచితంగా రాయించుకున్నదేమీ కాదు… నాస్తికుడు, హిందూ వ్యతిరేకి అనే ముద్రలు పడతాయనే సందేహం ఉంది తనకు… అలాంటప్పుడు రుగ్వేదం అనే పదాన్ని అవాయిడ్ చేయాల్సింది… కమ్యూనిస్టు, నాస్తికుడు, హిందూ వ్యతిరేకి, అందుకే ఈ సీన్స్ కావాలని జొప్పించాడు అనే విమర్శలకు ముందస్తు వివరణ కమ్ సమాధానం అన్నట్టుగా గ్రేటాంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో (సినిమా విడుదలకు ముందే చేసినట్టుంది ఇంటర్వ్యూ) కొన్ని పాయింట్లు ఉన్నయ్… (నాస్తికులు, హిందుత్వ వ్యతిరేకులు, కమ్యూనిస్టులు అయితేనేం… తమ సినిమాల్లో తమ భావజాలాన్ని ఏదోరకంగా టచ్ చేస్తుంటారు… సహజమే కదా…)
‘‘కమ్యూనిస్టుగా నాన్న నన్ను పెంచాడు, నిజమే, కానీ నాకు ఊహ తెలిసే కొద్దీ వివిధ అంశాల మీద ఆ ప్రభావాలన్నీ తొలగించుకున్నాను, నా సొంత అభిప్రాయాలు ఏర్పరుచుకున్నా, నేను గుడికి వెళ్తాను, దేవుడిని నమ్ముతాను, అసలు మతం లేకపోతే ప్రపంచం ఇంకెంత ధ్వంసమయ్యేదో ఆలోచిస్తుంటాను… మా కుటుంబంలో కాంగ్రెస్ ఉందీ, కమ్యూనిజమూ ఉంది…’’ ఇలా చెబుతూపోయాడు… తను ఓ థింకర్… దురుద్దేశపూర్వకంగా హిందుత్వ వ్యతిరేకతను తన సినిమాలో జొప్పిస్తాడనేదే నిజమైతే తన ముందు సినిమా టాక్సీవాలాలో ఇవేమీ లేవు కదా మరి…!! (తన పేరును టీవీ జర్నలిస్టులే సరిగ్గా పలకడం లేదని ఓచోట అన్నాడు… నిజానికి తన పేరును తనే ఓసారి సరిచూసుకోవడం బెటర్… తను పెట్టుకున్న పేరుకు ఒరిజినల్ ఓనర్ రాహుల్ సాంకృత్యాయన్… Not Rahul Sankrityan….)
Share this Article