ఎవరి పొలిటికల్ బాధ వాళ్లది… ఎవరి అబద్ధాలు వాళ్లవి… ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ నడుమ సాగుతున్న ధాన్యసమరంలో సత్యాలు ఎవరికీ పట్టవు… పట్టనివ్వరు… అంతా రాజకీయం… రైతులే సమిధలు…! తాజాగా కేంద్రం దిగివచ్చిందనీ, కేసీయార్- మంత్రులు- ఎంపీల పోరాటం ఫలించి కేంద్రం మరో 6 లక్షల బియ్యం సేకరించడానికి అంగీకరించి లేఖ రాసిందనీ వార్త… అదొక విజయంగా చిత్రీకరణ… నిజమేనా..? అది నిజంగా పరిగణించాలా..? అసలు సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నమా..? నిజానికి సమస్య ఏమిటి..?
ఎఫ్‌సీఐ తనకు బాయిల్డ్ బియ్యం అక్కర్లేదనీ, దాన్ని డిస్పోజ్ చేసే అవకాశాల్లేవనీ అంటోంది… దానికి కట్టుబడి ఉంది… ఇప్పుడు కూడా ముడి బియ్యం సేకరణకు మాత్రమే అనుమతించింది… ఉప్పుడుబియ్యం కావు… అదీ అసలు సంగతి… ఎఫ్‌సీఐ చాలా స్పష్టంగా ముడిబియ్యం అని చెప్పింది… అంటే రా రైస్… రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది ఉప్పుడు బియ్యం కూడా సేకరించాలని..! దానికి నానా గందరగోళం లెక్కల్ని ఏకరువు పెడుతూ వస్తోంది… నిజం ఏమిటంటే..? ప్రస్తుతం సేకరణకు సిద్దంగా ఉన్న బియ్యం రా రైస్ అయితే సేకరించడానికి అభ్యంతరం లేదని… అదే జరిగింది… కేంద్రం అదే చెప్పింది… మరిక కేంద్రం దిగి వచ్చింది ఏముంది..? బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్రం తన ధోరణికే కట్టుబడి ఉందిగా…
Ads
అసలు సమస్య వచ్చే సీజన్ ధాన్యం కొనుగోలు… బాయిల్డ్ రైస్ ఒక్క కిలో కూడా కొనేది లేదని కేంద్రం చెబుతోంది… దాని వాదన దానిది… హేతుబద్ధంగా కూడా ఉంది… బాయిల్డ్ రైస్ సేకరించినా ఏం చేసుకోవాలో తెలియని దురవస్థ… గోదాముల్లో నిల్వ వసతి లేదు… డిస్పోజ్ చేసే అవకాశాల్లేవు… రా రైస్ అయితే ప్రజాపంపిణీ వ్యవస్థలోకి పుష్ చేయగలదు, కానీ బాయిల్డ్ రైస్ మీద ఏమీ చేయలేదు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే పంజాబ్‌తో పోలుస్తూ కేంద్రాన్ని నిందించే ప్రయత్నం చేస్తోంది కానీ పంజాబ్ రైతులు ఇచ్చే రా రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ సేకరిస్తోంది… ఆ నిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతూ, రాజకీయ కారణాలతో రైతులకు నిజాల్ని చెప్పడం లేదు…
ఇప్పటికీ ఎఫ్‌సీఐది అదే ధోరణి… వచ్చే సీజన్ బాయిల్డ్ రైస్ తీసుకోం, రా రైస్ అయితే పర్లేదు అని… ఇన్నేళ్లూ ధాన్యాన్ని తానే కొనుగోలు చేస్తున్నట్టు రాష్ట్రం చెప్పుకున్నది గానీ అదంతా ఎఫ్‌సీఐ సేకరణ సొమ్ముతోనే…! రాష్ట్రం మిల్లర్ల దగ్గర కస్టమ్ మిల్లింగ్ చేసి, ఎఫ్‌సీఐకి అమ్ముతోంది… ఇప్పుడు తత్వం బోధపడింది… ఊళ్లల్లో కల్లాలు లేవు, రైతు సమన్వయ సమితుల జాడలేదు… ఎఫ్‌సీఐ ఊహూ అనేసరికి ధాన్యం కొనుగోళ్లు మందగించాయి… అసలు కస్టమ్ మిల్లింగ్ లెక్కలే ఆగమాగం… ఎందరు మిల్లర్లు బియ్యం ఎగ్గొట్టారో, ఆ డబ్బు ఏమైందో తెలియదు… ధాన్యం ఉత్పత్తి మీద అయోమయం లెక్కలు… ఈ స్థితిలో రాష్ట్రం యాసంగి సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి… కానీ దాని మీద సోయి లేదు… ఈరోజుకూ పడావు పడిన భూములకు సైతం రైతుబంధు చెల్లించి, చేతులు దులుపుకునే రాష్ట్రానికి వ్యవసాయం మీద ఓ దశ లేదు, ఓ దిశ లేదు… పైగా ఇప్పుడు కేంద్రం దిగి వచ్చిందనే ఓ ప్రచారం… రాష్ట్రం ఒత్తిడి ఫలించిందీ అనే అబద్ధం… నిజానికి జరిగిందీ, ఒరిగిందీ ఏమీ లేదు… ఎఫ్‌సీఐ తన ధోరణికే తాను కట్టుబడి ఉంది… అదీ అసలు నిజం…!! మన తెలుగు మీడియాకు రారైస్, బాయిల్డ్ రైస్‌కూ నడుమ తేడా కూడా తెలియదు, అదీ అసలు దరిద్రం…!!!
Share this Article