ఆశువుగా అప్పటికప్పుడు కవిత్వం అల్లేసి, తన గొంతులోనే పలికించే గాయకుడు, రచయిత గోరేటి వెంకన్న గురించి మనం ఈరోజు కొత్తగా ఏమీ చెప్పుకోనక్కర్లేదు… జగమెరిగిన కవి… కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అనేది మాత్రమే కొత్త విశేషం… తను రాసిన వల్లంకి తాళం కూడా అప్పట్లో చాలామందిని కదిలించినదే… ఆ పుస్తకానికి ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ అప్పరుసు కృష్ణారావు రాసిన ముందుమాట భలే నచ్చింది… గోరేటి ధోరణిని తను అర్థం చేసుకుని, ఆ ఫీల్‌కు సరైన అక్షరరూపం కల్పించడం అంత వీజీ ఏమీ కాదు… వంద మాటలేల..? మీరే చదివేయండి…
సాహితీ సెంద్రవంక
Ads
నన్నెవరో లాగుతున్నారు.. కిటికీలోంచి కూడా బయటకు చూడలేని దుస్సహ జీవితం నుంచి నన్నెవరోలాగుతున్నారు. ఎవరికోసం చేస్తున్నామో, ఏం చేస్తున్నామో తెలియని హడావిడి బతుకు నుంచి నన్నెవరో లాగుతున్నారు. ఎవర్నీ పట్టించుకోకుండా, నన్ను నేను పట్టించుకోకుండా, యంత్రంలా సాగుతున్న తుచ్ఛమైన బూటకపు అర్థంపర్థంలేని జీవితం నుంచి, విమానాల నుంచి, కార్ల నుంచి, హైవే రహదారుల నుంచి నన్నెవరో లాగి పిచ్చి తుమ్మల డొంకలో పడవేశారు. కీచురాళ్ల మోతల మధ్య నేనెప్పుడూ చూడని ప్రపంచంలోకి నన్ను తోసేశారు. ఎవరాయన? సంచారమే బాగున్నదీ.. దీనంత ఆనందమేమున్నదీ అని పాడుతూ వెళ్లిపోతున్న ఒక వ్యక్తిని వెంబడిస్తూ ఎరుకపడని లోయలెంట సాగిపోయాను.
అలినీలాలక పూర్ణ చంద్రముఖుల్నీ చూడలేదు. గబ్బి గుబ్బలనూ కానలేదు. ప్రవాళాధరలనూ పట్టించుకోలేదు. జ్ఞానమొక్కటి వెలిగి నిలుచును అన్న కవిని పలకరిస్తూ, భయంకర బాధల పాటల పల్లవిని వింటూ, నన్ను నేను నగ్నపునీతం చేసుకుంటూ నినాదాలు చేస్తూ, పిడికిళ్లు బిగిస్తూ, కుప్పకూలిపోతున్న యువ శవాల కనురెప్పలను మూస్తూ మూస్తూ ముందుకు వెళ్లాను. అతడు పాట ఆపలేదు.
ఆయన పాటల్లో కాటుక రాసులను కాలరేఖ పంచితే నల్లమొల్ల తనువెల్లా పూసుకుంది పండుటాకులు వీణలపై చీమవేళ్లు చిటుకలేశాయి. బండరాతి దోనెలపై రువ్వే పుప్పొడి సవ్వడి చేసింది. పరుగు తగ్గిన ఏరు తనువులో తేలిన పాలశంకుల మెరుపు పెంకులే మువ్వలుగా ఘల్లుమన్నాయి. ఆతడి వెంట వెళుతుంటే ఆ పయనం తల్లి వోలే పాదాలను తడుముతున్నది. పసితనంలోకి మలుపుతున్నది.
ఎవరతను? ముఖం చూడాలని అతడి వెనుక పరుగెత్తుతూనే ఉన్నాను. కిరీటాలు పడిపోయాయి. ఆస్థానాలు కూలిపోయాయి. రహదారులు బీటలు వారాయి. కాళ్లను తడుపుతున్నది చెమట సముద్రాలో, అమ్మ స్తన్య ప్రవాహాలో తెలియదు. చెట్ల కురుల మీద బొట్లుబొట్లుగా రాలి గట్ల బండలమీద గంధమయి పారే వానచినుకులో తెలియదు. గ్రంథాలయాలు పడిపోయి పుస్తకాలు రెపరెపలాడుతూ ఆతడి చుట్టూ పరుగెడుతున్నాయి. విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, పీఠాధిపతులు, కవిపుంగవులు అతడిని దాటడానికి ప్రయత్నించి మహాప్రస్థానంలో పాండవ సోదరుల్లా కుప్పకూలిపోతున్నారు. కవిత్వ కార్ఖానాలు మూతపడుతున్నాయి. తూనీగలు అతడి పాటకు దరువేసి వానొచ్చెనమ్మా.. వరదొచ్చెనమ్మా… అని ఆడుతున్నాయి.
అతడు నడుస్తూనే ఉన్నాడు. వెలుగుపూలను వెదజల్లే పరమశివుడులా. అనంత కాంతిపుంజములతో అలరించే నింగిరేడులా, మండే కొలిమిలా, సాగరంతో చెలిమి చేస్తూ. నడుస్తూనే ఉన్నాడు. అతడి వెంట నడుస్తుంటే అలసటే లేదు. అదొక సోయిలేని హాయి. సూడ సక్కని రేయి. సిరుగాలి పవనాల సినుకు మువ్వల లాలి. అతడు నడుస్తుంటే కులుకు తీగెలు గాలి మొలక నవ్వుల కూగాయి. తనువిరుసుకుని సెట్లు తల దువ్వుకొనసాగాయి. కునుకు పిట్టల ముక్కులందానికి పూలపుప్పొడి గంధమే దిద్దాయి.
అతడు నడుస్తున్నాడు. ఎండిపోతున్న పెద్ద వాగును చూస్తూ గంతులేసిన ఇసుక తీరం గరుకునేలయిపోయినాది.. ఎదలోని శోకమే ఎగిసి వాగయిందిరో.. అని ఏడుస్తూ నవ్వుతూ వెళ్లుతున్నాడు. కన్నీళ్లు పెడుతున్న పల్లెలను చూస్తూ కుమ్మరి వామిల మొలిచిన తుమ్మలను, దుమ్ము పేరిన కమ్మరి కొలిములను చూసి రోదిస్తూ సాగుతున్నాడు. అప్పు నాగులు కాటుకు అశువులు ఒదిలిన రైతును తలుచుకుంటూ దిగులుగా వెళుతున్నాడు.. రంగుమారిన నింగి నీలి పొరను చూస్తూ గోరెంక పిట్టల సవ్వడి కోసం అన్వేషిస్తున్నాడు. పచ్చతనం తగ్గిపోయి వలస వెళ్లిన పక్షులకోసం వెతుకుతున్నాడు.
అతడు నిర్వేదంగా, నిర్వికారంగా నడుస్తున్నాడు. యక్షగానాలు పాడుతున్న బుక్క బాలయ్యలా, యాగంటి తత్వాలు ఆలపిస్తున్న చిరుతొండ ప్రహ్లాద భక్త రామదాసులా నడుస్తున్నాడు. కాస్సేపు సంతవీధి చివరలో ఒంటిగా కూర్చున్నాడు. మరి కాస్సేపు యోగనిద్ర చేస్తాడు. ఉన్నట్లుండి ఏకనాదం బట్టి, ఏకాంతాన్ని వలచి, పదములల్లుకుంట, పాట పాడుకుంట బాటల్ల తోటల్ల, భ్రమలేని బయలల్ల వెళుతున్నాడు. ఉప్పొంగే కన్నీట ఊరేటి రాగాలను దారి పొడవున పంచుతూ దాటిపోతున్నాడు. అతడి పాటలకు మేఘాలు జడలిప్పి జాబిలిని కప్పాయి. మిణుకుమనే చుక్కలు మిన్నులో దాగాయి. వెలుగారి కలువలు చిరునవ్వు నవ్వాయి. చీకటిలో వెలిగిన ఆ పాటకు పడగే పురివిప్పి లేచింది.
కొండదారుల్లో ఈ రాత, గీత సోకు తెలవని, చెయ్యి తిరగని చిత్రకారుని చేతికందని లోకంలోకి వన్నెలొలికే పున్నమి వెలుగులు సన్నంపు ఆ సరికెల వెంట పోతాననీ, నీకు సింతల మాపుకుంటానని వెళుతున్నాడు. పిట్ట బతుకే ఎంత పోయీ.. అనుకుంటూ సాగుతున్నాడు. బరువు దిగిన గుండెతో వెర్రి జ్ఞాపకాలనన్నీ వదులుకుని వెళుతున్నాడు.
ఎవరతను? విప్లవకారుడా? తిరుగుబాటుదారా? వేదాంతియా? బైరాగియా? యోగియా? తాత్వికుడా? జ్ఞానియా? అంతా బురద నిండిన అతడిని ముట్టుకుంటే మట్టి పెళ్లలు రాలుతున్నాయి. అది నేలలో కలిసిపోతున్నది. నేలకూ అతడికీ తేడా తెలియడం లేదు. నేలే అతడై, అతడే నేలై సాగిపోతున్నాడు. అతడి మీదే పైర్లూ, వాగులూ, గుడిసెలూ, చెట్లూ, పిట్టలూ.. అతడిని వెంబడించి, చెదలు పట్టిన పాత పుటల్ని రాల్చుకుని తెలుగుసాహిత్యం పునీతమైంది.
- కృష్ణుడు
Share this Article